దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19. 4 ఓవర్లకు 172 రన్స్‌కు అలౌటైంది. ఢిల్లీని కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51), అక్షర్ పటేల్ (54) హాఫ్ సెంచరీలు చేయగా.. మనీష్ పాండే 26 పరుగులు చేశాడు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ 172 రన్స్‌కే పరిమితమైంది. ముంబై బౌలర్లో బెహ్రెండోర్ఫ్ 3, పీయూష్ చావ్లా 3, మెరెడిత్ 2, హృతిక్ 1 వికెట్ తీశారు.
చావ్లా మ్యాజిక్..
వన్ డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే (26: 18 బంతుల్లో 5 బౌండరీలు) మెరిడిత్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ మరుసటి ఓవర్ వేసిన హృతీక్ శోకీన్ బౌలింగ్‌లో కూడా ఇదే రిపీట్ అయింది. కానీ, చావ్లా రాకతో ఢిల్లీ కథ మారిపోయింది. వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించిన పాండేను చావ్లా ఔట్ చేశాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యశ్ ధుల్ (2) నాలుగు బంతులే ఆడి మెరిడిత్ వేసిన పదో ఓవర్లో ఐదో బంతికి డీప్ స్క్వేర్ దిశగా ఆడి నెహల్ వధేరకు క్యాచ్ ఇచ్చాడు. ఆడిన తొలి బంతినే బౌండరీకి తరలించిన రొవ్మన్ పావెల్ (4)ను చావ్లా వికెట్ల ముందు బలిగిన్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన లలిత్ యాదవ్ (2) కూడా చావ్లా వేసిన 13వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.