IPL 2023 Final: బీసీసీఐ సెక్రటరీ జై షా అసభ్యకర సంజ్ఞ.. మండిపడుతున్న ధోనీ ఫ్యాన్స్..! (వీడియో)
బీసీసీఐ సెక్రటరీ జై షాపై చెన్నై అభిమానులతో పాటు దక్షిణ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ సెక్రటరీ జై షాపై చెన్నై అభిమానులతో పాటు దక్షిణ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జై షాపై ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ సందర్భంగా జై షా చేసిన పనే వారి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో జై షా తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్‌కు మద్దతు తెలిపారు. గుజరాతీగా.. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో జై షా గుజరాత్ టైటాన్స్‌కు మద్దతు ఇవ్వడంలో తప్పులేదు. కానీ బీసీసీఐ సెక్రటరీగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడిగా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన జై షా.. చాలా చిల్లరగా ప్రవర్తించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమవ్వగా.. మోహిత్ శర్మ అద్భుతమైన యార్కర్లతో తొలి రెండు బంతులను కట్టడి చేస్తుండగా.. చివరి 4 బంతుల్లో చెన్నై విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. క్రీజులో ఉన్న చెన్నై బ్యాటర్లు శివమ్ దూబే, రవీంద్ర జడేజా బిగ్ షాట్స్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. చెన్నై అభిమానులు ఓటమి తప్పదనే బాధను దిగమింగుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంలో డగౌట్‌లో ఉన్న జై షా.. తన చేతితో అసభ్యకరమైన సంజ్ఞ చేశారు. మంచిగా అయ్యిందని తన చేతిని ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే జై షా ఉపయోగించిన ఆ సంజ్ఞ బూతుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. జై షా ఉద్దేశం కూడా ఆ బూతు పదమే. ఇదంతా టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. దక్షిణాది జట్లన్నా.. ప్రజలన్నా జై షాకు ఎంతటి వివక్షో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి చిల్లర వ్యక్తికి బీసీసీఐ సెక్రటరీ వంటి అత్యున్నత పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జై షాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చివరి 2 బంతులను గుజరాత్‌కే చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 6, 4 బాది చెన్నైకి చిరస్మరణీయ విజయాన్నందించాడు.