IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..

IPL 2023లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Update: 2023-04-21 13:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని సన్‌రైజర్స్ పట్టుదలగా ఉంది. అదే సమయంలో చెన్నై కూడా ఆర్సీబీపై భారీ విజయం సాధించిన జోరు కొనసాగించాలని అనుకుంటోంది. పేపర్‌పై చూస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ సాలిడ్‌గా ఉంది. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ తో పాటు వాషింగ్టన్ సుందర్ వరకూ అందరూ హిట్టర్లే.

కానీ, కీలక సందర్భాల్లో చేతులెత్తేసే బలహీనతతో హైదరాబాద్‌కు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ మూడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూడగా.. అవి స్పష్టంగా బ్యాటింగ్ వైఫల్యాలే. బౌలింగ్‌లో కూడా నటరాజన్ ధారాళంగా పరుగులిస్తుండటం సన్ రైజర్స్‌ను ఆందోళనకు గురిచేసేదే. భువీ ఫర్వాలేదనిపిస్తున్నాడు. మయాంక్ మార్కండే తన స్పిన్‌తో మ్యాజిక్ చేస్తే చెన్నైకి కష్టమే. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైని వీళ్లు ఎలా నిలువరిస్తారన్నది కీలకం.

సొంత గడ్డపై చెన్నై మరింత బలంగా..

చెపాక్ స్టేడియంలో వందలాది మ్యాచ్‌లు ఆడిన ధోని సేన.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రహానే, శివమ్ దూబే, రాయుడు, రవీంద్ర జడేజా, ధోని వంటి బ్యాటర్లతో పటిష్టంగా ఉంది. ఇక ఆర్సీబీతో ఆడిన గత మ్యాచ్‌లో రహానే, కాన్వే, దూబేలు దుమ్ము దులిపారు. సొంత అభిమానుల మధ్యలో ఆడుతుండటం వీరికి మరింత కలిసొచ్చేదే. అయితే బ్యాటింగ్ పటిష్టంగా ఉన్న బౌలర్లలో అనుభవరాహిత్యం చెన్నైని దెబ్బతీసేదే. ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరన లు ఇంకా కుదురుకోలేదు. సీనియర్ స్పిన్నర్లు మోయిన్ అలీ, రవీంద్ర జడేజాతో పాటు యువ స్పిన్నర్ తీక్షణ మీదే ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

రికార్డులు వాళ్ల వైపే..

ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నై - హైదరాబాద్ మధ్య 19 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ధోని సేనదే ఫుల్ డామినేషన్. సీఎస్కే ఏకంగా 14 మ్యాచ్ లలో విజయాలు సాధించగా సన్ రైజర్స్ గెలిచింది ఐదు మాత్రమే. చెపాక్ లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరుగగా మూడింట్లోనూ సీఎస్కేదే విజయం. ఇక ఈ రెండు జట్లూ తలపడిన గత ఐదు మ్యాచ్‌లలో చెన్నై 3 నెగ్గగా హైదరాబాద్ రెండు గెలిచింది.

CSK vs SRH హెడ్-టు-హెడ్..

మ్యాచ్‌లు: 19 | CSK – 14 | SRH - 5

చెపాక్ స్డేడియంలో..

మ్యాచ్‌లు: 3 | CSK – 3 | SRH - 0

పిచ్ రిపోర్టు:

చెన్నైలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. కానీ, మ్యాచ్ జరుగుతున్నకొద్దీ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉంటాయి. ఛేదన చేసే జట్లకు కాస్త కష్టమేనని ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌ల ఫలితాలే చెబుతున్నాయి. ఈ పిచ్‌లో 160 పరుగుల కంటే ఎక్కువ స్కోర్‌లను ఛేజింగ్ చేయడం అంత సులభం కాదు.

చెన్నై సూపర్ కింగ్స్:

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w/c), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా

సన్‌రైజర్స్ హైదరాబాద్:

హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(డబ్ల్యూ), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

Tags:    

Similar News