IPL 2023: అలా చేస్తే బెటర్.. నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై స్టోక్స్ కొత్త ప్రతిపాదన

బౌలర్ బంతి వేయకముందు నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితే సదరు బౌలర్ అవుట్ చేయడాన్ని ప్రస్తుతం అఫీషియల్ రనౌట్‌గా పరిగణిస్తున్నారు.

Update: 2023-04-11 12:57 GMT

న్యూఢిల్లీ: బౌలర్ బంతి వేయకముందు నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితే సదరు బౌలర్ అవుట్ చేయడాన్ని ప్రస్తుతం అఫీషియల్ రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ చట్టాలను రూపొందించే మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ), ఐసీసీ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాయి. అయితే, కొందరు ఈ తరహా అవుట్‌ను సమర్థిస్తుండగా.. మరికొందరు అనైతికమంటున్నారు. తాజాగా నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్, సీఎస్కే స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్ కొత్త ప్రతిపాదన చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ బంతి పడకముందే క్రీజు దాటితో అంపైర్లు 6 పెనాల్టీ పరుగులు ఇస్తే దీనిపై ఎలాంటి వివాదం ఉండదని అభిప్రాయపడ్డాడు.

సోమవారం బెంగళూరు, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌తో మరోసారి నాన్‌స్ట్రైకర్ రనౌట్‌పై చర్చ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో బౌలర్ హర్షల్ పటేల్.. బంతి వేస్తుండగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న రవిబిష్ణోయ్ క్రీజు దాటడాన్ని గమనించి రనౌట్ చేయబోయి విఫలమయ్యాడు. చివరి బంతికి అవేశ్ ఖాన్ ఒక పరుగు తీయడంతో లక్నో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం రవిబిష్ణోయ్‌ను రనౌట్ చేస్తే ఆర్సీబీ గెలిచేదని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు భిన్నంగా స్పందించారు.

దీనిపై నాన్‌స్ట్రైకర్ రనౌట్‌ను వ్యతిరేకించే వాళ్లను కామెంటేటర్ హర్ష బోగ్లే సూటిగా ప్రశ్నిస్తూ.. ‘రవిబిష్ణోయ్ బంతి వేయకముందే క్రీజుని దాటేశాడు. ఇప్పటికీ నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో రనౌట్ చేయకూడదని చెప్పే సిల్లీ పీపుల్ ఉన్నారా?’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి బెన్‌స్టోక్స్ స్పందిస్తూ.. ‘నువ్వేం అనుకుంటున్నావ్ హర్ష భోగ్లే? ఒకవేళ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బాల్ వేయకముందే క్రీజు దాటి అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తే.. అంపైర్లు 6 పెనాల్టీ పరుగులు ఇవ్వాలి. ఇలా చేస్తే బ్యాటర్లు బంతి వేసే దాకా క్రీజులోనే ఉంటారు. ఎలాంటి వివాదాలు ఉండవు’ అని బెన్ స్టోక్స్ కొత్త ప్రతిపాదన చేశాడు. ఇలా చేస్తే బ్యాటర్లు క్రీజు దాటరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News