BREAKING: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సంచలన విజయం

ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది.

Update: 2024-05-19 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. పంజాబ్ కింగ్స్ విధించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను ఘన విజయంతో ముగించింది. కాగా, ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.

పంజాబ్ బ్యాటర్లలో అథర్వ తైదే 46, ప్రభుమాన్ సింగ్ 71 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే శుభారంభం అందించారు. చివర్లో రిలే రూసో (49), కెప్టెన్ జితేశ్ శర్మ (32 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపర్చాడు. హెడ్ పెవిలియన్ చేరినప్పటికీ మరో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు.

పంజాబ్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 28 బంతుల్లోనే ఆరు సిక్స్‌లు, ఐదు ఫోర్లు బాది 66 రన్స్ చేసి ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ప్లేయర్స్ రాహుల్ త్రిపాఠి (33), నితీష్ రెడ్డి (37) పరుగులతో ఆకట్టుకున్నారు. చివర్లో డేంజరస్ బ్యాటర్ క్లాసెన్ మెరుపు బ్యాటింగ్‌తో ( 42) ఎస్ఆర్‌హెచ్‌కు ఘన విజయాన్ని అందించాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్లతో మరో అద్భుత విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరో 2 రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి దూసుకెళ్లింది. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే.. ఎస్‌ఆర్‌హెచ్ క్యాలిఫయర్ 1లో కోల్‌కతాతో తలపడనుంది. 


Similar News