ఇంటర్ పరీక్షలకు బోర్డు కసరత్తు

దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిజికల్ క్లాసులు మొదలవుతున్న నేపథ్యంలో వార్షిక పరీక్షలపై కూడా కసరత్తు మొదలైంది. సీబీఎస్ఈ పరీక్షలు మే నాలుగు నుంచి జరగనున్నాయి. వాటికంటే ముందుగానే రాష్ట్ర సిలబస్ పరీక్షలను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఫిజికల్ క్లాసులను కనీసం రెండు నెలల పాటు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నందున మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పెట్టి ఏప్రిల్‌లో థియరీ పరీక్షలను […]

Update: 2021-01-15 22:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిజికల్ క్లాసులు మొదలవుతున్న నేపథ్యంలో వార్షిక పరీక్షలపై కూడా కసరత్తు మొదలైంది. సీబీఎస్ఈ పరీక్షలు మే నాలుగు నుంచి జరగనున్నాయి. వాటికంటే ముందుగానే రాష్ట్ర సిలబస్ పరీక్షలను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఫిజికల్ క్లాసులను కనీసం రెండు నెలల పాటు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నందున మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పెట్టి ఏప్రిల్‌లో థియరీ పరీక్షలను నిర్వహించాలనుకుంటోంది. టెన్త్ పరీక్షలను ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత నిర్వహించాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు భావిస్తోంది. ఎలాగూ 30 శాతం సిలబస్‌ను తగ్గించినందున రెండు నెలల వ్యవధిలో క్లాసులను పూర్తిచేసి పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ చేయడంపై ఇంటర్ బోర్డు, టెన్త్ బోర్డు దృష్టిపెట్టాయి. గతేడాది ఆగస్టులో అప్పటి కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మార్చిలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు తాత్కాలిక షెడ్యూలు రూపొందించినా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష అనంతరం వెలువడిన మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ ఇంటర్ క్యాలెండర్ ఇయర్‌కు తుది గడువు కావడంతో అప్పటికల్లా వార్షిక పరీక్షలను పూర్తి చేయాలనుకుంటోంది.

వీలైతే మార్చి చివరి వారంలోనే

వీలైతే మార్చి చివరి వారంలోనే ప్రాక్టికల్స్ పూర్తి చేసి ఏప్రిల్ రెండవ వారం నుంచి పరీక్షల షెడ్యూలును ఖరారు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఎండల తీవ్రత పెరిగినా, కరోనాలో ఏమైనా తేడా వచ్చినా రోజుమార్చి రోజు నిర్వహించే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఉదయం ఒకటి, మధ్యాహ్నం తర్వాత మరొకటిగా నిర్వహించడానికి కూడా ప్రత్యామ్నాయ షెడ్యూలును తయారు చేయాలనుకుంటోంది. విద్యార్థులకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ ప్రకారం నిర్వహించాలన్నది విద్యాశాఖ అభిప్రాయం. కనీసం రెండు నెలల పాటు ఫిజికల్ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై ప్రావీణ్యం పెరుగుతుందని అనుకుంటున్నా రెండు వారాల పాటు విద్యార్థులు వార్షిక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం అవసరమని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. థియరీపరంగా పరీక్షల్ని ఏప్రిల్‌లో నిర్వహించినా ప్రాక్టికల్ పరీక్షల విషయంలో మాత్రం మార్చి చివరలో నిర్వహించడానికి ఇబ్బంది లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్చి చివరి నుంచే ప్రాక్టికల్, థియరీ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇంటర్ పరీక్షల తరువాతే పది పరీక్షలు

ఇక పదో తరగతి పరీక్షల విషయంలో మాత్రం ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాతనే నిర్వహించాలనుకుంటోంది. గతేడాది ఒక్కో సబ్జెక్టుకు రెండు ప్రశ్నాపత్రాలు ఉన్నప్పటికీ ఈసారి ఒక పేపర్‌కే కుదించడంతో వారం రోజుల్లోనే పరీక్షలను పూర్తి చేసే వీలు కలిగింది. ఆ ప్రకారం ఏప్రిల్ మూడవ వారంలోనే పదవ తరగతి పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల చివరికల్లా అన్ని పరీక్షలనూ పూర్తిచేయాలన్నది విద్యాశాఖ భావన. మే నెలలో తీవ్రమైన ఎండలు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు పరీక్షలు రాయడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ కల్లా మొత్తం పరీక్షలను పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్షలు, మరోవైపు వేసవి తీవ్రతలతో పాటు ఈ పరీక్షలు ముగిసిన తర్వాత వివిధ ప్రవేశపరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా షెడ్యూలు ఖరారు కానుంది. ఏకకాలంలో వార్షిక పరీక్షలు, వివిధ ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూలు ఖరారయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News