ఈ ఏడాది బంగారం గిరాకీ సన్నగిల్లే అవకాశం: డబ్ల్యూజీసీ

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక అభిప్రాయపడింది. ప్రజల వద్ద పొదుపు లేకపోవడం, వ్యవసాయ వేతనాలు తగ్గుతుండటం వంటి కీలక సవాళ్ల కారణంగా పసిడి గిరాకీ దెబ్బతినే అవకాశముందని తెలిపింది. సాధారణంగా ఆదాయ పెరుగుదల బంగారం డిమాండ్ పెంపును సూచించే కీలక సాధనం. ‘భారత ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న ఈ తరుణంలో బంగారం అమ్మకాలు కూడా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కానీ, గత కొంతకాలంగా […]

Update: 2021-10-19 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక అభిప్రాయపడింది. ప్రజల వద్ద పొదుపు లేకపోవడం, వ్యవసాయ వేతనాలు తగ్గుతుండటం వంటి కీలక సవాళ్ల కారణంగా పసిడి గిరాకీ దెబ్బతినే అవకాశముందని తెలిపింది. సాధారణంగా ఆదాయ పెరుగుదల బంగారం డిమాండ్ పెంపును సూచించే కీలక సాధనం. ‘భారత ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న ఈ తరుణంలో బంగారం అమ్మకాలు కూడా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కానీ, గత కొంతకాలంగా ప్రజలు గతం కంటే తక్కువ మొత్తం ఆదా చేస్తున్నారు. దీనివల్ల పసిడి లాంటి విలువైన లోహం కోసం కేటాయించే మూలధనం తగ్గిపోవచ్చు’ అని డబ్ల్యూజీసీ నివేదికలో పేర్కొంది.

ఇటీవల ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు బ్యాంకులు, ఇతర పెట్టుబడి మార్గాలను ఎన్నుకోవడం వల్ల బంగారం లాంటి వాటిని కొనడం తగ్గే అవకాశం ఉంది.. ఇది కొంత కాలానికి పరిమితమవుతుందని, దీర్ఘకాలికంగా అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నివేదిక తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య పండుగ సీజన్ కోసం ఆభరణాల అమ్మకాలకు జ్యువెలరీ పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడి డిమాండ్ ఉంటుందని బంగారం దుకాణదారులు అంచనా వేస్తున్నారు. కానీ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ధనవంతులు బంగారాన్ని కొనే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉండొచ్చని డబ్ల్యూజీసీ కౌన్సిల్ భారత ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ ఆర్ సోమసుందరం అన్నారు. కాగా, ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్న ధోరణిని అనుసరిస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన పసిడి ధరలు మంగళవారం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ. 48,330 వద్ద ఉండగా, ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 44,300 వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News