కమలాహారీస్.. వివక్ష నుంచి అమెరికా వైస్‌ప్రెసిడెంట్ వరకు!

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో జాతివివక్ష కొత్తేం కాదు. ఇప్పటికీ అక్కడ చాలా మంది వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారు. తెల్ల జాతీయులు నల్లజాతీయుల పట్ల వివక్షను చూపడమే కాకుండా, దాడులకు సైతం తెగబడుతుంటారు. అయితే, కమలాహారీస్ భారత సంతతి మహిళ అయినప్పటికీ కొందరు అమెరికన్స్ ఆమెను నల్లజాతీయురాలిగానే గుర్తించారని స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల వేళ జాతివివక్ష అంశాన్ని ప్రధాన అజెండా చేసుకున్న డెమొక్రటిక్ అభ్యర్థులు, దాని నిర్మూలన దిశగా చేసిన ప్రసంగాలే వారికి విజయ తీరాలకు […]

Update: 2020-11-07 23:40 GMT
కమలాహారీస్.. వివక్ష నుంచి అమెరికా వైస్‌ప్రెసిడెంట్ వరకు!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో జాతివివక్ష కొత్తేం కాదు. ఇప్పటికీ అక్కడ చాలా మంది వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నారు. తెల్ల జాతీయులు నల్లజాతీయుల పట్ల వివక్షను చూపడమే కాకుండా, దాడులకు సైతం తెగబడుతుంటారు. అయితే, కమలాహారీస్ భారత సంతతి మహిళ అయినప్పటికీ కొందరు అమెరికన్స్ ఆమెను నల్లజాతీయురాలిగానే గుర్తించారని స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల వేళ జాతివివక్ష అంశాన్ని ప్రధాన అజెండా చేసుకున్న డెమొక్రటిక్ అభ్యర్థులు, దాని నిర్మూలన దిశగా చేసిన ప్రసంగాలే వారికి విజయ తీరాలకు చేర్చాయనడంలో అతిశయోక్తి లేదు. కమలాహారీస్ నిర్వహించిన పలు ప్రసంగాల్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఉటంకించారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఉదాహరణలను ఓటర్ల ముందుంచడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు.

దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత సంతతి మహిళ కమలాహారీస్ (56) అమెరికా తొలి ఉపాధ్యాయుక్షురాలిగా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. కమలా తల్లి ఇండియా లోని (తమిళనాడు రాష్ట్రం చెన్నై)కు చెందినవారు కాగా, తండ్రి జమైకా దేశానికి చెందిన వారు. దక్షిణాసియా (ఇండియన్ అమెరికన్), ఆఫ్రికా (ఆఫ్రికన్ అమెరికన్) దేశాల సంతతిగా కమలాహారిస్ గుర్తింపు పొందినప్పటికీ కొందరు అమెరికా పౌరులు మాత్రం ఆమెను అమెరికన్ నల్ల జాతీయురాలిగానూ గుర్తిస్తున్నారు. న్యాయశాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన కమలా హారిస్ 2004లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా బాధ్యతలు చేపట్టి అప్పుడు కూడా ఆ పదవికి ఎన్నికైన తొలి నల్లజాతీయురాలుగా గుర్తింపు పొందారు.

దాదాపు 2011 వరకు ఆమె ఆ జిల్లా అటార్నీగా పనిచేసి ఆ తర్వాత కాలిఫోర్నియా ఆటార్నీ జనరల్‌గా 2017 వరకూ పనిచేశారు. 2017 నుంచి ఆమె కాలిఫోర్నియా నుంచి యునైటెడ్ స్టేట్స్ జూనియర్ సెనేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2016లో జరిగిన యుఎస్ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలోనే ఆమె ఆరోగ్య రంగం (హెల్త్ కేర్)లో విప్లవాత్మకమైన సంస్కరణలకు నాంది పలికారు. ప్రగతిశీల పన్నుల విధానం, దాడులకు ఉపయోగించే ఆయుధాలు (తుపాకులు)పై నిషేధం, గతంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వలస వచ్చినవారికి పౌరసత్వం కల్పించడం, గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఫెడరల్ షెడ్యూలు జాబితా నుంచి తొలగించడం లాంటి సంస్కరణలకు బీజం వేశారు.

నిజానికి ఆమె 2008లోనే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. కానీ మూడేళ్ళ తర్వాత (2011 జనవరి) ఆ పదవిని అధిష్టించారు. ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్‌గానూ, తొలి ఆఫ్రికా అమెరికన్‌గానూ గుర్తింపు పొందారు. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన కమలా హారిస్ 2014 నవంబరులో మరోసారి ఎన్నికయ్యారు. అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి రోనాల్డ్ గోల్డ్‌పై 57 శాతం ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

జో బిడెన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్న కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాల్లో తన మూలాల గురించి ప్రస్తావించారు. క్యాన్సర్ వ్యాధి పరిశోధకురాలిగా చెన్నై నుంచి అమెరికాకు చేరుకున్న తన తల్లి గురించి ప్రస్తావించారు. ఆ రకంగా అమెరికాలోని సుమారు 45 లక్షల మంది భారతీయుల్లో ఓటు హక్కు కలిగిన ఇరవై లక్షల మందిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అమెరికాలోనే రెండో ఉన్నత స్థానమైన వైస్ ప్రెసిడెంట్ పదవికి అర్హత సాధించడంపై అక్కడి భారతీయులు ఒకింత గర్వంగానే వారివారి అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకున్నారు. ఆమె పోటీ ఖరారు కావడంతోనే చెన్నై నగరంలో సైతం ఆమె ఫోటోలతో బ్యానర్లు దర్శనమిచ్చాయి. ఆమె గెలుపు కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.

Tags:    

Similar News