దేశంలో కరోనా తీవ్రరూపం.. భారీగా పెరిగిన మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. సోమవారం గణాంకాలతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,59,170 కాగా.. మరణాలు 1,761 గా నమోదయ్యాయి. దేశంలో మహమ్మారి ప్రారంభమైన తర్వాత రోజూవారీ మరణాలు ఇన్ని నమోదవడం ఇదే ప్రథమం. కొత్త కేసులతో కలుపుకుని దేశంలో కరోనా బారిన పడ్డవారి […]
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. సోమవారం గణాంకాలతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,59,170 కాగా.. మరణాలు 1,761 గా నమోదయ్యాయి. దేశంలో మహమ్మారి ప్రారంభమైన తర్వాత రోజూవారీ మరణాలు ఇన్ని నమోదవడం ఇదే ప్రథమం. కొత్త కేసులతో కలుపుకుని దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. మరణాలు 1.80 లక్షలకు చేరాయి. ఇదే సమయంలో క్రియాశీల కేసుల సంఖ్య 20 లక్షలు (20,31,977) దాటడం ఆందోళనకు గురి చేస్తు్న్నది. దీంతో క్రియాశీల కేసుల రేటు 13.26 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దేశంలో కరోనా బారిన పడి రికవరీ అయిన వారి రికవరీ రేటు 85.56 శాతానికి పడిపోయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెలువరించింది.
ఆ ఐదు రాష్ట్రాల్లో భీకర విజృంభణ
కరోనా సెకండ్ వేవ్ దేశమంతా విస్తరించినా ఐదు రాష్ట్రాల్లో మాత్రం అది బీకరంగా విజృంభిస్తున్నది. దేశంలో మంగళవారం నాటికి నమోదైన మొత్తం కేసుల్లో ఆ రాష్ట్రాల నుంచే 54.2 శాతం కేసులు నమోదవడం గమనార్హం. జాబితాలో మహారాష్ట్ర (58,924), ఉత్తరప్రదేశ్ (28,211), ఢిల్లీ (23,686), కర్నాటక (15,785), ఛత్తీస్‌గఢ్ (13,834) రాష్ట్రాలలోనే ఎక్కువగా విస్తరిస్తున్నది. మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే సగానికిపైగా ఉన్నాయి.