టీం ఇండియా క్లీన్ స్వీప్..? రేపు మూడో వన్డే..
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత యువ జట్టుపై చాలా మంది అనేక రకాలుగా అంచనా వేశారు. శ్రీలంక మాజీ క్రికెటర్లు అయితే, బీసీసీఐ ‘బి టీమ్’ను పంపి అవమానించిందని కూడా వ్యాఖ్యానించారు. తీరా వన్డే మ్యాచ్‌లు ప్రారంభమయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. తొలి వన్డేలో వార్ వన్ సైడే అయ్యింది. అయితే రెండో మ్యాచ్‌కు తేరుకున్న శ్రీలంక జట్టు భారత కుర్రాళ్లపై ఒత్తిడి పెంచారు. కీలకమైన వికెట్లను తీసి గెలుపు దిశగా పయనించారు. కానీ […]
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత యువ జట్టుపై చాలా మంది అనేక రకాలుగా అంచనా వేశారు. శ్రీలంక మాజీ క్రికెటర్లు అయితే, బీసీసీఐ ‘బి టీమ్’ను పంపి అవమానించిందని కూడా వ్యాఖ్యానించారు. తీరా వన్డే మ్యాచ్‌లు ప్రారంభమయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. తొలి వన్డేలో వార్ వన్ సైడే అయ్యింది. అయితే రెండో మ్యాచ్‌కు తేరుకున్న శ్రీలంక జట్టు భారత కుర్రాళ్లపై ఒత్తిడి పెంచారు. కీలకమైన వికెట్లను తీసి గెలుపు దిశగా పయనించారు. కానీ యువ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ కలసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. ముఖ్యంగా చాహర్ ఆడిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఇక కీలకమైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగనున్నది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. మరోవైపు శ్రీలంక జట్టు కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. టీ20 సిరీస్ ముందు ఓటమి భారాన్ని మీద వేసుకోకుండా గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నది.
జట్టులో కీలక మార్పులు..
ఇప్పటికే సిరీస్ విజయం సాధించడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లు ఆడని యువకులకు మూడో వన్డేలో చోటు కల్పించాలని అనుకుంటున్నారు. పృథ్వీషా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తొలి రెండు వన్డేల్లో తమ సత్తా చాటారు. ఇప్పుడు ఓపెనర్‌ను మార్చాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. పృథ్వీషా స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరికి అవకాశం కల్పించనున్నారు. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కే కాకుండా రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం కూడా వీరిని పరీక్షించనున్నారు. మిడిల్ ఆర్డర్‌లో మార్పులు చేయకపోయినా.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించవచ్చు.
బౌలింగ్ ఇలా..
భారత బౌలర్లు రెండు వన్డేల్లో కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. అయితే డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చారు. శ్రీలంక బ్యాట్స్‌మాన్ కూడా చివర్లో భువనేశ్వర్ కుమార్ వంటి డెత్ ఓవర్ల స్పెషలిస్టుపై కూడా ఎదురు దాడికి దిగారు. అయితే దీపక్ చాహర్‌కు విశ్రాంతి కల్పిస్తే మాత్రం చేతన్ సకారియా లేదా నవదీప్ సైనీకి చోటు దక్కవచ్చు. కుల్దీప్, చాహల్ స్థానంలో రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్‌లకు చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కోచ్, మేనేజ్‌మెంట్ సాధ్యమైనంతగా బెంచ్ మీద ఉన్న వారిని పరీక్షించాలని భావిస్తున్నది. యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అనుకుంటున్నది. ఇక రెండు వన్డేలు ఓడిపోయిన శ్రీలంక ఇంటా బయటా విమర్శలపాలవుతున్నది. ఓపెనింగ్ జోడీ శుభారంభం అందిస్తున్నా.. ఆ తర్వాత ఎవరూ నిలదొక్కుకోవడం లేదు. కోచ్, కెప్టెన్ మధ్య కూడా సమన్వయం లేనట్లు రెండో వన్డేలో తెలిసింది. మరి శ్రీలంక జట్టు లోపాలను సరిదిద్దుకొని పరువు దక్కించుకుంటుందో లేదో చూడాలి.