ఇండియా vs ఇంగ్లాండ్: కీలకంగా మారిన రెండో వన్డే
దిశ, స్పోర్ట్స్ : తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న జట్టు ఒకవైపు.. టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోవడమే కాకుండా వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ కూడా ఓడిపోయి నిరాశలో ఉన్న జట్టు మరోవైపు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. కాగా, ఇంగ్లాండ్ జట్టులోని కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు గాయపడటంతో వాళ్లు రెండో వన్డేలో అందుబాటులో ఉంటారో లేదో అనే సందిగ్దం నెలకొన్నది. ఈ మ్యాచ్‌లోనే […]
దిశ, స్పోర్ట్స్ : తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న జట్టు ఒకవైపు.. టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోవడమే కాకుండా వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ కూడా ఓడిపోయి నిరాశలో ఉన్న జట్టు మరోవైపు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. కాగా, ఇంగ్లాండ్ జట్టులోని కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు గాయపడటంతో వాళ్లు రెండో వన్డేలో అందుబాటులో ఉంటారో లేదో అనే సందిగ్దం నెలకొన్నది. ఈ మ్యాచ్‌లోనే విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి వన్డే సిరీస్ విజయంతో అయినా స్వదేశానికి వెళ్లాలని ఇంగ్లీష్ క్రికెటర్లు ఉన్నారు. శుక్రవారం జరుగబోయే కీలకమైన ఈ సమరానికి పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది.
మంచి ఫామ్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మాన్..
తొలి వన్డే ముందు ఫామ్ లేమితో జట్టుకు భారంగా మారిన శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చారు. ధావన్ తృటిలో సెంచరీ మిస్ అయినా.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడికి తోడుగా రోహిత్ శర్మ మరిన్ని పరుగులు చేయాల్సి ఉన్నది. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకుంటే శుభమన్‌గిల్ అతడి స్థానంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక కెప్టెన్ కోహ్లీ పరుగులు రాబడుతున్నా.. అతడు అంతర్జాతీయ సెంచరీ చేయక ఏడాదిన్నర గడిచిపోయింది. ఈ మధ్య కాలంలో అర్దసెంచరీలను సెంచరీలుగా మార్చలేకపోతున్నాడు.
ఈ మ్యాచ్‌లో అయినా సెంచరీ చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేయడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే అతడి ఎంట్రీపై టీమ్ మేనేజ్‌మెంట్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా తొలి వన్డేలోనే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టాప్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండటంతో వారిని నిలువరించడానికి ఇంగ్లాండ్ బౌలర్లు కష్టపడాల్సిందే.
బౌలింగ్‌లో చిన్న మార్పు?
భారత బౌలింగ్ దళంలో చిన్న మార్పు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. తొలి వన్డేలో విఫలమైన కుల్దీప్ యాదవ్ బదులు యజువేంద్ర చాహల్‌ను తీసుకునే అవకాశం ఉన్నది. భువీకి తోడుగా ప్రసిధ్ కృష్ణ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బంతిని పంచుకుంటారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు తొలుత తడబడినా.. ఆ తర్వాత పుంజుకొని ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూల్చారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇటీవల ప్రమాదకరంగా మారుతున్నారు. దీంతో వారిని త్వరగా పెవీలియన్ పంపాల్సిన బాధ్యత ప్రధాన బౌలర్లపై ఉన్నది. ముఖ్యంగా జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోను సాధ్యమైనంత త్వరగా కట్టడి చేసేదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
దూకుడు ప్రదర్శించాల్సిందే..
ఇంగ్లాండ్ జట్టు గెలిచే మ్యాచ్‌లను కూడా చేజేతులా ఓడిపోవడం ఇటీవల చూశాము. మంచి శుభారంభాలే దక్కినా.. దాన్ని కొనసాగించడంతో మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారు. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ ఛేదించే క్రమంలో ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత 116 పరుగులకే 10 వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్నది. బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ చేతులెత్తేయడం ఇంగ్లాండ్‌కు భారంగా మారింది.
ఇప్పటికైనా ఇంగ్లాండ్ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించాల్సిన అవసరం ఉన్నది. తొలి వన్డేలో గాయపడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు అందుబాటులో ఉండేది అనుమానమే. వారి స్థానంలో ఎవరిని తీసుకొని వస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇక ఇంగ్లాంగ్ బౌలర్లలో మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ వికెట్లు తీయగలుతున్నారు. కానీ స్పిన్నర్లు విఫలం కావడం ఆందోళనకు గురి చేస్తున్నది. టీమ్ ఇండియాను తొలుత కట్టడి చేసినా.. చివర్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. కీలకమైన రెండో వన్డేలో ఇంగ్లాండ్ అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో రాణిస్తేనే విజయం సాధించి సిరీస్‌ను సజీవంగా ఉంచగలుగుతుంది.
జట్ల అంచనా :
ఇండియా : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్/యజువేంద్ర చాహల్
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కీపర్), మొయిన్ అలీ, సామ్ కర్రన్, టామ్ కర్రన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్