పల్లెల్లో పకడ్బందీ చర్యలు
– కరోనా కట్టడికి సామాజిక వర్గాల వారిగా గస్తీ దిశ, కరీంనగర్: కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు జగిత్యాల జిల్లాలోని పల్లెలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. హై అలర్ట్‌గా ఉంటున్నాయి. పోలీసులు వచ్చి లాక్ డౌన్ ఎలా సాగుతుందో పర్యవేక్షించే అవసరమే లేకుండా పోయిందా ఊర్లలో. ఆరోగ్య సూత్రాలు పాటించడంలోనూ వారికి వారే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అక్కడి పల్లె జనం. కరోనా తమ ఊరి పొలిమేరల్లోకి కూడా రాకుండా వారు తీసుకుంటున్న […]
– కరోనా కట్టడికి సామాజిక వర్గాల వారిగా గస్తీ
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు జగిత్యాల జిల్లాలోని పల్లెలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. హై అలర్ట్‌గా ఉంటున్నాయి. పోలీసులు వచ్చి లాక్ డౌన్ ఎలా సాగుతుందో పర్యవేక్షించే అవసరమే లేకుండా పోయిందా ఊర్లలో. ఆరోగ్య సూత్రాలు పాటించడంలోనూ వారికి వారే సాటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అక్కడి పల్లె జనం. కరోనా తమ ఊరి పొలిమేరల్లోకి కూడా రాకుండా వారు తీసుకుంటున్న చర్యలు వింటే ఔరా అనాల్సిందే మరి.
జగిత్యాల జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు సరికొత్త తరహాలో తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆ ప్రాంత పల్లె వాసులు చేపడుతున్న చర్యలు నేటి తరానికి విచిత్రంగా అనిపిస్తాయి చాలామందికి. కాని వారు మాత్రం పూర్వీకుల ఆచరాలను కూడా తూ.చ తప్పకుండా పాటించాలని తీర్మానం చేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, మెట్ పల్లి, మల్లాపూర్ తదితర మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాలు, ఇతర మండలాల్లో కొన్ని గ్రామాలుక్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తున్నాయి. చైతన్యం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా అక్కడి పల్లెలు తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
సామాజిక వర్గాల వారిగా గస్తీ..
గ్రామ పొలిమేరల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని నింపాదిగా ఇళ్లకే పరిమితం కావడం లేదు ఆయా గ్రామాల ప్రజలు. సామాజిక వర్గాల వారిగా రోజుకో సామాజిక వర్గానికి గ్రామ సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరు చెక్ పోస్టుల వద్ద 20 మంది చొప్పున టీంలుగా విడిపోయి డ్యూటీలు చేస్తున్నారు. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు డ్యూటీ చేసి గంట సేపు లంచ్ టైం కేటాయించుకున్నారు. తిరిగి రాత్రి 10 గంటల వరకు గస్తీ గాస్తున్నారు. ఇలా రోజుకో సామాజిక వర్గానికి చెందిన వారు తమ గ్రామానికి రక్షణ కవచంగా మారిపోతున్నారు.
వీరు ఊరికి సంబంధం లేని వారు వస్తే లోపలకు రానివ్వకుండా నిలువరిస్తారు. ఊర్లోని వారు బయటకు వెళ్తే కచ్చితమైన కారణం చెప్పాల్సిందే. అంతేకాదు వారు తిరిగి ఎప్పుడు వస్తారో కూడా చెప్పి గస్తీ నిర్వహిస్తున్న వారి వద్ద ఉన్న రిజిస్టర్‌లో రాయించాలి. వారు చెప్పిన సమయం దాటితే చెక్ పోస్టు వద్ద ఆపేస్తారు. ఆలస్యం ఎందుకయింతో అడుగుతారు, చెప్పిన కారణానికి ఆధారం చూపిస్తే సరి లేనట్టయితే గ్రామ పంచాయతీకి ఫైన్ కట్టాల్సిందే.
బయట తిరిగితే జరిమానా..
లాక్ డౌన్‌కు ముందు ఊర్లోకి ఇతర గ్రామాల వారు వచ్చి తిరిగి వెళ్లానుకుంటే వారిని ఆపేస్తున్నారు. గ్రామంలోకి ఎప్పుడు వచ్చారు..? ఏ కారణంతో వచ్చారు. వారి బంధువుల పేర్లు చెప్పండి వారితో మాట్లాడించండి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతను చెప్పిన తమ గ్రామానికి చెందిన వ్యక్తులను వాకబు చేసి నిజమేనని నిర్ధారించుకున్న తర్వాతే వారిని వదిలేస్తున్నారు. గ్రామంలో ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఇద్దరేసి చొప్పు కలిసి వెళ్లినా, చిన్న పిల్లలను ఇళ్లు దాటించి బయటకు తీసుకొచ్చినా జరిమానా విధిస్తున్నారు. పొలిమేర్లలో డ్యూటీ చేసే వారే కాకుండా గ్రామంలోని వీధుల్లో కూడా సంచరిస్తూ గ్రామస్తులను ఇళ్లకే పరిమితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి చెందిన కిరాణ షాపు యజమానులు మాత్రం నిత్యవసరాలు తీసుకొచ్చే వెసులుబాటు కలిపించినా వారు కూడా గ్రామం దాటి వెళ్తేప్పుడు, వచ్చేప్పుడు కచ్చితంగా రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయడంతో పాటు వారు ఏఏ సామన్లు ఏ ఏ హోల్ సేల్ షాపు నుంచి కొనుక్కొస్తారో కూడా జాబితాను చూపించాల్సి ఉంటుంది. ఈ కట్టుబాటు తప్పితే వారికీ కూడా ఫైన్ విధించడమేనని నిర్ణయించుకున్నారు. కిరాణ షాపులు కూడా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. జరిమానా సొమ్మును కూడా గ్రామపంచాయతీకే అప్పగించాలని తీర్మానం చేసుకోవడం మరో విశేషం.
ఆహారం విషయంలోనూ..జగిత్యాల జిల్లాలోని పల్లె వాసులు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడే ఆహారం మాత్రమే వండుకుని తినాలని చెప్తున్నారు. ప్రతి రెండు రోజుల కోసారి గ్రామస్తులంతా తమ ఇళ్లలోనే తమకు వంటలు చేసుకోవాలన్న షరతుతో పాటు తాము చెప్పిన వంటకాలే చేసుకోవాలని చెప్తున్నారు. ఇందు కోసం గ్రామంలో ఆలయానికుండే మైక్ ద్వారా ప్రకటన చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో దండోరా కూడా వేయిస్తున్నారు. ఆరోగ్యాన్ని పంచేందుకు ఉపయోగపడే బెల్లంతో తయారు చేసిన బొబ్బట్లు, సి విటమిన్ పుష్కలంగా దొరికే ఉసిరికాయ పచ్చడి, సొంఠి, మిరియాలు, అల్లం మిక్స్ చేసిన పేస్ట్‌ను తినాలని అంటున్నారు. ఇలా డే బై డే అనౌన్స్ మెంట్ చేయగానే వాటినే పల్లె వాసులు వండుకుని తినాలి.
ప్రతి రోజూ సాయంత్రం వాకిలిలొ పేడ కలిపిన నీటితో అలుకు (కల్లాపి) చల్లాలి. గడపలకు పసుపు రాయాలి. క్రిమి కీటకాలు ఇంట్లోకి చొరబడకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలు చేసి తీరాలి.
కరోనా కట్టడికి పట్టణ ప్రాంతాల్లో పోలీసులు 24 గంటలూ గస్తీ గాస్తూ నాగరికత ముసుగేసుకున్న వారిని నియంత్రించాల్సి వస్తుంటే జగిత్యాల జిల్లాలోని ఆ పల్లెలు మాత్రం పోలీసులను తమ గ్రామల వైపు చూడకుండా వారే సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకుంటుండటం ఆదర్శనీయం.
Tags: jagtial district villages, ideal, covid 19 prevention, strict lockdown, committed people