ప్రమాదంలో 160 కోట్ల మంది కార్మికులు!

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఉన్న శ్రామిక శక్తిలో కనీసం సగం మందికి జీవనాన్ని అందించే అసంఘటిత రంగంలో 50 శాతం మంది కరోనా వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) వెల్లడించింది. దీర్ఘకాలికంగా లాక్‌డౌన్ వల్ల అనేక సంస్థలు, పరిశ్రమలు మూసేయడం, పనిగంటలను తగ్గించడం వల్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన ఐఎల్‌వో స్పష్టం చేసింది. అసంఘటిత కార్మిక రంగంలో దాదాపు 160 కోట్ల మంది కార్మికులు కరోనా […]

Update: 2020-04-30 04:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఉన్న శ్రామిక శక్తిలో కనీసం సగం మందికి జీవనాన్ని అందించే అసంఘటిత రంగంలో 50 శాతం మంది కరోనా వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) వెల్లడించింది. దీర్ఘకాలికంగా లాక్‌డౌన్ వల్ల అనేక సంస్థలు, పరిశ్రమలు మూసేయడం, పనిగంటలను తగ్గించడం వల్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశముందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అయిన ఐఎల్‌వో స్పష్టం చేసింది. అసంఘటిత కార్మిక రంగంలో దాదాపు 160 కోట్ల మంది కార్మికులు కరోనా వల్ల జీవనోపాధి పోగొట్టుకోనున్నారు. యూ.ఎన్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా 31 లక్షల మందికి కరోనా సోకగా, 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఆర్థికవ్యవస్థలన్నీ అస్తవ్యస్తమవడంతో ఉద్యోగాలు, ఆదాయాలపై కరోనా వినాశక ప్రభావాన్ని చూపించింది. ‘గత నెలలో ఉన్న అంచనాలకు మించి ఉద్యోగాలు, ఉపాధి సంక్షోభం అత్యధికంగా ఉందని, ఇంకా తీవ్రమయ్యే ప్రమాదముందని’ ఐఎల్‌వో డైరెక్టర్ జనరల్ వివరించారు. ఈ పరిణామాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పేదరికం ప్రబలే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు.

గత నెల రోజులుగా ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలోని కార్మికుల జీతాల్లో సంక్షోభం నెలకొందని ఐఎల్‌వో నివేదిక పేర్కొంది. ప్రపంచ శ్రామికశక్తిలో 330 కోట్ల మంది ఉన్న అసంఘటిత రంగ కార్మికులే కరోనా వల్ల అధికంగా నష్టపోతున్నారని, ఉన్న సంక్షేమ పథకాల రక్షణ అందకపోవడం, సరైన ఆరోగ్య సంరక్షణ దొరక్కపోవడంతో వీరి ఉపాధి సంక్షోభంలో ఉందని, ఈ రంగంలోని వారికి ఇతర రంగాల మాదిరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే మార్గాలు లేకపోవడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్‌డౌన్ రెండోసారి పొడిగించడం వల్ల గత నెల ప్రకటించిన అంచనాలను దాటి రెండో త్రైమాసికంలో కార్మికుల పని గంటలు దారుణంగా పడిపోతాయని ఐఎల్‌వో స్పష్టం చేసింది.

ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ రంగం, రిటైల్, టోకు వ్యాపారాలు, ఇంకా ఇతర వ్యాపార కార్యకలాపాలు అత్యధికంగా నష్టపోయినట్లు ఐఎల్‌వో వెల్లడించింది. ప్రధానంగా యూరప్, మధ్య ఆసియా, అమెరికా దేశాల్లోని పనిగంటల్లో అత్యంత క్షీణత నమోదైనట్లు చెబుతోంది. దాదాపు 43.6 కోట్ల కంపెనీలు, వ్యాపారాలు అత్యధిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని, 2020లో అంతర్జాతీయ నిరుద్యోగం భారీగా పెరిగే అవకాశముందని నివేదిక చెబుతోంది. అయితే, ప్రభుత్వం తీసుకునే చర్యల వల్లే ఉద్యోగాలు సమర్థవంతగా కాపాడేందుకు దొహదపడతాయి. లాక్‌డౌన్ తర్వాత ఎదురయ్యే డిమాండ్‌ను ప్రభుత్వ నిర్ణయాలే పెంచగలవని తెలుస్తోంది.

ప్రస్తుత సంక్షోభాన్ని దాటేందుకు ప్రభుత్వాలు నగదు బదిలీ నిర్ణయం తీసుకుంటున్నాయి. అలా కాకుండా, వేగవంతంగా నిరుద్యోగుల ప్రయోజన విధానాలను చేపట్టాలని, చిన్న, అనధికార వ్యాపారాలకు, స్వతంత్ర కార్మికులకు మద్దతు అవసరమని, వీరు రుణాలు, క్రెడిట్ వీలైనంత వేగంగా పొందేలా చూడాలని ఐఎల్‌వో సూచనలిచ్చింది.

Tags : ILO, International Labour Organization, pandemic, covid-19, coronavirus, workforce lose livelihood

Tags:    

Similar News