ఆ శాఖలో కోరుకున్న చోటే డ్యూటీ.. సిన్సియారిటీకి లేదు పోటీ..!
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రేంజ్ పరిధిలో.. డిప్యూటేషన్ల విధానం ఇష్టారాజ్యంగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఒకే కార్యాలయంలో తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు బదిలీ చేసినా.. తిరిగి డిప్యూటేషన్‌పై అదే సీట్లలోకి వచ్చేస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగులు ఇలాగే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. పనిలేని చోట, అక్రమ ఆదాయం ఎక్కువగా ఉండే స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రేంజ్ పరిధిలో.. డిప్యూటేషన్ల విధానం ఇష్టారాజ్యంగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఒకే కార్యాలయంలో తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు బదిలీ చేసినా.. తిరిగి డిప్యూటేషన్‌పై అదే సీట్లలోకి వచ్చేస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వరంగల్ జిల్లా డిప్యూటీ కమిషనరేట్ పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగులు ఇలాగే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. పనిలేని చోట, అక్రమ ఆదాయం ఎక్కువగా ఉండే స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు ఎగబడుతున్నారు. డిప్యూటేషన్లకు ఆర్డర్ ఇప్పించేందుకు ఉన్నతాధికారులు, వారికి దగ్గరగా ఉండే సహోద్యోగులకు ఎంతయినా సమర్పించుకునేందుకు వెనకాడకపోవడం గమనార్హం.
అధికార దుర్వినియోగం..
లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న ఎక్సైజ్ ఉద్యోగులను గతంలో.. ఈ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన అకున్ సభర్వాల్ బదిలీలు చేయించారు. కమిషనర్‌గా అకున్ సభర్వాల్ వేరే శాఖకు వెళ్లిపోవడంతో అక్రమ డిప్యూటేషన్లకు తెరలేచింది. ఏదో ఒక సాకుతో ఉన్నతాధికారులు.. ఉద్యోగులు కోరుకున్న చోట విధులు నిర్వహించేలా డిప్యూటేషన్లకు ఆదేశాలిస్తుండటం గమనార్హం. పరిపాలన సౌలభ్యం కోసమని ఉన్నతాధికారులకు కల్పించిన విశేషాధికారాలు దుర్వినియోగమవుతున్నాయి. ఒకే స్థానంలో, ఒకే స్టేషన్‌లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై కరుణ చూపుతుండటం గమనార్హం. బదిలీ అయిన ఐదారు నెలల వ్యవధిలోనే పాత పోస్టింగ్‌లోనే ఉద్యోగులను కూర్చోబెడుతున్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు సిబ్బందిని సమర్థవంతమైన వినియోగానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని.. ఇటు ఉద్యోగులు అటు ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. కాసింత మాముళ్ల రాబడి ఎక్కువగా ఉండే చోట్లలోనే పనిచేయడానికి అధికారులు పోటీ పడుతుండటం గమనార్హం. అడ్డుగా ఉన్న నిబంధనలను డిప్యూటేషన్ల రూపంలో తొక్కి తుంగలో పడేస్తున్నారు.
నిబంధనలకు పాతర..
తొర్రూరు ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందిని గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతోంది. వాస్తవానికి ఈ స్టేషన్ పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు పనిచేయాల్సి ఉంది. 8 మంది కానిస్టేబుళ్లలో కనీసం ఒక్క మహిళా కానిస్టేబులైనా ఉండాలి. కానీ ఇక్కడ ఒక్కరూ లేరు. వాస్తవానికి కొద్ది నెలల క్రితం ఇక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌కు డిప్యూటేషన్‌పై వరంగల్ డీపీఈవో కార్యాలయంలో పనిచేసేందుకు అవకాశం కల్పించడం గమనార్హం.
దీంతో అప్పటి నుంచి మహిళా నిందితులను పట్టుకున్న సమయంలో పర్యవేక్షణ అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మినిస్టీరియల్ సిబ్బంది విషయం కూడా అంతే. ఇక్కడ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్ విధులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్న వ్యక్తితో చేయిస్తున్నారు. ఉన్న ఒక్క రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ కూడా తనకు హనుమకొండ డీపీఈవో కార్యాలయంలో విధులు నిర్వహించేలా డిప్యూటేషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినట్లు, దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుండటం గమనార్హం.
డిప్యూటీ కమిషనర్ రేంజ్ పరిధిలో..
వరంగల్ డిప్యూటీ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్లలో అయితే ఏకంగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యనే ఎక్కువగా ఉండటం గమనార్హం. తమ చెప్పు చేతల్లో ఉండకుండా.. సిన్సియారిటీ ప్రదర్శిస్తున్న ఉద్యోగులకు శిక్షగా డిప్యూటేషన్లను అమలు చేస్తున్నట్లుగా ఆ శాఖ ఉద్యోగ బాధితుల ద్వారా సమాచారం అందుతోంది. డిప్యూటేషన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అనేక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.