తక్కువ ధరకే ఆక్సిజన్ సరఫరా.. ఐఐఎస్ఈఆర్ నూతన పరికరం
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను సృష్టించింది. కరోనా బారినపడి ప్రాణవాయువు అందక ప్రతీరోజు అనేక మంది మరణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ సిలిండర్లను సప్లయ్ చేయలేకపోతోంది. ఈ క్రమంలో భోపాల్ ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) పరిశోధకులు సిలిండర్లకు బదులుగా తక్కువ ధరలో ఆక్సిజన్ సప్లయ్ చేసే నూతన పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరం ఏ మేరకు పని చేస్తుంది? […]
దిశ, ఫీచర్స్ : కొవిడ్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను సృష్టించింది. కరోనా బారినపడి ప్రాణవాయువు అందక ప్రతీరోజు అనేక మంది మరణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ సిలిండర్లను సప్లయ్ చేయలేకపోతోంది. ఈ క్రమంలో భోపాల్ ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) పరిశోధకులు సిలిండర్లకు బదులుగా తక్కువ ధరలో ఆక్సిజన్ సప్లయ్ చేసే నూతన పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరం ఏ మేరకు పని చేస్తుంది? ప్రస్తుతం ఏ దశలో ఉంది?
కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఆక్సిజన్ అందించే పరికరాన్ని తయారు చేసిన ఐఐఎస్ఈఆర్ పరిశోధకులు.. ‘ఆక్సికాన్’ అని నామకరణం చేశారు. దీని ధర రూ.20,000/- కాగా, నిమిషానికి 3 లీటర్ల ఆక్సిజన్ అందించగలదు. ఈ డివైజ్ తయారీకి రూ.60 వేల నుంచి 70 వేలు ఖర్చవుతుందని, ఆక్సిజన్ షార్టేజ్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, మెటీరియల్‌తో తయారు చేసినట్లు ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్ శివ ఉమాపతి తెలిపారు. ఒకసారి ఈ పరికరానికి పూర్తిస్థాయిలో అనుమతి లభిస్తే, పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ అందుబాటులోకి వస్తుందని, తక్కువ ధరకే అందరికీ ఆక్సిజన్ అందుతుందని వివరించారు.
‘ఆక్సికాన్’లోని కంప్రెషర్.. బయటి వాతావరణం నుంచి గాలిని తీసుకుంటుంది. ఇందులోని జియోలైట్ అనే మెటీరియల్ ప్రెషర్‌తో ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ జనరేట్ అవుతుందని, నిరంతర సరఫరా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. డివైజ్‌లోని జియోలైట్.. గాలిలో నుంచి నైట్రోజన్‌ను గ్రహించడంతో పాటు వదిలేస్తుందని, తద్వారా పరికరానికి సంబంధించి ఔట్‌లెట్ ఆక్సిజన్ సాంద్రత పెరుగుతుందని ఐఐఎస్ఈఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిత్రదీప్ భట్టాచార్జి వివరించారు. ప్రస్తుతం ఈ పరికరానికి సంబంధించిన సిస్టమ్ ప్రొటోటైప్ తయారైనప్పటికీ అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉందని, అవి వచ్చిన తర్వాత మెడికల్ ఇండస్ట్రీ కొలాబరేషన్‌తో బల్క్ ప్రొడక్షన్ చేస్తామని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే డివైజ్ ప్రొటోటైప్‌తో మార్కెట్‌లో పరిశీలన చేయగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.