రూ.లక్షన్నర ఇస్తే ఆ ఉద్యోగం మీకే..!
దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని ఓ ముఠా కోట్ల రూపాయలను దండుకుంది. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఈ ఘరాణ మోసానికి పాల్పడిందీ ముఠా. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ చీటింగ్ వివరాలను పోలీసులు వివరించారు. కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర లక్షన్నర రూపాయలు తీసుకోని, ఉద్యోగం ఇవ్వలేదని మేళ్లచెరువు మండలం మంగలితండాకు చెందిన భూక్యా లక్‌పతి ఈనెల 5న మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు. తిరిగి […]
దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని ఓ ముఠా కోట్ల రూపాయలను దండుకుంది. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఈ ఘరాణ మోసానికి పాల్పడిందీ ముఠా. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ చీటింగ్ వివరాలను పోలీసులు వివరించారు.
కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర లక్షన్నర రూపాయలు తీసుకోని, ఉద్యోగం ఇవ్వలేదని మేళ్లచెరువు మండలం మంగలితండాకు చెందిన భూక్యా లక్‌పతి ఈనెల 5న మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశాడు. తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వమన్నా ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిలుకూర్ మండలం సీత్లతండాకు చెందిన నూనవత తావుర్యా, నూనవత్ వినోద్ కుమార్, భూక్యా శ్రీకుమార్, సాయి కుమార్, మునగాల మండలం ఆకుపాములకు చెందిన తాటిపాక శివ, హైదరాబాద్ కు చెందిన భాస్కర్, సికింద్రాబాద్‌లోని బొల్లారానికి చెందిన జనార్ధన్ ఆచార్య కొమందూర్ నంభీ ఓ ముఠాగా ఏర్పాడి నకిలీ ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.
కోర్టులో అటెండర్ ఉద్యోగం ఉన్నదని, రూ.1.50 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం మీ సొంతమని మాయమాటలతో నిరుద్యోగులను తమ వలలో వేసుకుంటున్నారు. అలా వారి వద్ద నుంచి డబ్బులు కాజేసి, అటు ఉగ్యోగం ఇవ్వకుండా, ఇటు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకోని తిరుగుతున్నారు. వీరు కేవలం లక్‌పతి నుంచే కాకుండా మరికొంత మంది నుంచి సుమారు రూ.2కోట్లను వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరికొంత మంది బాధితులు పరువు పోతుందన్న కారణంగా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ముఠా సభ్యులు ఒకే దగ్గర ఉన్నారన్న సమాచారం అందుకున్న మేళ్లచెరువు పోలీసులు ఆదివారం దాడి చేసి తావుర్యా, శ్రీకుమార్, జనార్ధన్ ఆచార్య కొమందూర్ నంభీని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిరుద్యోగులు ఎవరు ఇలాంటి ఫేక్ ఉద్యోగాలు ఇచ్చే వారిని నమ్మోదని పోలీసులు కోరారు. కష్టపడి చదివింది ఇలా దొంగతనంగా ఉద్యోగాలు కొనుగోలు చేయడానికి కాదని, పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగం సంపాదించాలని కోరారు.