శకుంతలా దేవి రికార్డు బ్రేక్!

మానవ కంప్యూటర్ అంటూ ఇప్పటివరకు ‘శకుంతలా దేవి’ని కొనియాడాం. మొన్నీమధ్యే ఆమె బయోపిక్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె రికార్డును బద్దలు కొట్టి, ఓ హైదరాబాదీ యువకుడు వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా పేరు సంపాదించాడు. లండన్‌లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకం సాధించి 20 ఏళ్ల వయస్సులోనే రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతని పేరు, ఎలా రికార్డు సంపాదించగలిగాడు అనే విషయాలు మీకోసం! అతని పేరు నీలకంఠ భాను […]

Update: 2020-08-27 02:49 GMT

మానవ కంప్యూటర్ అంటూ ఇప్పటివరకు ‘శకుంతలా దేవి’ని కొనియాడాం. మొన్నీమధ్యే ఆమె బయోపిక్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె రికార్డును బద్దలు కొట్టి, ఓ హైదరాబాదీ యువకుడు వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా పేరు సంపాదించాడు. లండన్‌లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకం సాధించి 20 ఏళ్ల వయస్సులోనే రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతని పేరు, ఎలా రికార్డు సంపాదించగలిగాడు అనే విషయాలు మీకోసం!

అతని పేరు నీలకంఠ భాను ప్రకాశ్. పేరుకు తగ్గట్టుగానే మ్యాథ్స్ కాలిక్యులేషన్‌లో భానుడిలాగానే ప్రకాశిస్తాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భానుకి చిన్న వయస్సు నుంచే గణితం అంటే చాలా ఇష్టం. అప్పుడే ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకుని గణితంలో తన నైపుణ్యాలను పెంచుకునే దిశగా పయనించాడు. 2013లో అంతర్జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్, 2011, 2012ల్లో జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచాడు.

మెంటల్ కాలిక్యులేషన్ ప్రపంచ చాంపియన్‌షిప్ 1997 నుంచి ప్రతి ఏడాది జరుగుతోంది. ఈ ఏడాది కరోనా వైరస్ పాండమిక్ కారణంగా ఈ చాంపియన్‌షిప్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. యూకే, జర్మనీ, యూఏఈ, ఫ్రాన్స్, గ్రీస్, లెబనాన్ వంటి 13 దేశాల నుంచి వచ్చిన 30 పార్టిసిపెంట్‌లతో భాను ఈ పోటీలో పాల్గొన్నాడు. రెండో స్థానంలో నిలిచిన లెబనాన్ పోటీదారుతో భానుకి 65 పాయింట్ల తేడా ఉందంటేనే ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌లుగా రికార్డులు సృష్టించిన శకుంతలా దేవి, స్కాట్ ఫ్లాన్స్‌బర్గ్ రికార్డులను భాను కొల్లగొట్టాడు. కానీ తనకు రికార్డులంటే పెద్దగా పట్టింపు లేదని, గణితవేత్తలు, మానవ కాలిక్యులేటర్‌లతో ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేయాలని తన లక్ష్యం అని భాను అంటున్నాడు.

గణిత సమస్యల ద్వారా మానవ మెదడు పనితీరును మెరుగుపరచడానికి తాను కష్టపడతానని భాను చెప్పుకొచ్చాడు. ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌ఫైనెట్స్ పేరుతో ఒక స్టార్టప్ సంస్థను కూడా భాను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి ఆర్థమెటిక్ సమస్యలతో పిల్లల మేధస్సును పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ, టీ-శాట్ నెట్‌వర్క్‌తో కలిసి 6-10 తరగతుల వారి కోసం 700 గంటల మ్యాథ్స్ కంటెంట్‌ను ఇవ్వడానికి కూడా భాను ఒప్పందం చేసుకున్నాడు. గణితం బోధించే విధానాల్లో మార్పు తీసుకొచ్చి, ప్రభుత్వ పాఠశాలల నుంచి మ్యాథ్స్ జీనియస్‌లను తయారు చేయడానికి తాను అంకితభావంతో పనిచేస్తానని భాను చెప్పాడు.

Tags:    

Similar News