కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం ఎందుకు భయపడుతోందంటే… !

        కరోనా కేవలం ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపడం లేదు. అంతర్జాతీయంగా ఆర్ధికంగా కూడా ప్రభావం చూపుతోంది. కరోనా ఇప్పటికే 26 దేశాలకు ఎక్స్‌పోర్ట్ అయింది. దీంతో ఆయా దేశాలన్నీ ఆఘమేఘాల మీద చైనాతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చే విమానాలు దిగే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను ఏర్పాటు చేశాయి. కరోనా బాధితుల నుంచి ఇతరులకు సోకకూడదన్న లక్ష్యంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలతో గదులను ఏర్పాటు చేశారు.   […]

Update: 2020-02-04 21:27 GMT

రోనా కేవలం ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపడం లేదు. అంతర్జాతీయంగా ఆర్ధికంగా కూడా ప్రభావం చూపుతోంది. కరోనా ఇప్పటికే 26 దేశాలకు ఎక్స్‌పోర్ట్ అయింది. దీంతో ఆయా దేశాలన్నీ ఆఘమేఘాల మీద చైనాతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చే విమానాలు దిగే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ మెషీన్లను ఏర్పాటు చేశాయి. కరోనా బాధితుల నుంచి ఇతరులకు సోకకూడదన్న లక్ష్యంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక సౌకర్యాలతో గదులను ఏర్పాటు చేశారు.

మరోవైపు కరోనా బాధితులను పరీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు, వైద్యమందించేందుకు ప్రత్యేక వైద్యులు, వారిని పరీక్షించేందుకు ప్రత్యేక పరికరాలు, వారికి టెస్టులు చేసేందుకు ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ చిట్టచివరగా వారికి బాగైతే.. తిరగబెట్టకుండా, ఆ గదిలోని వైరస్ బతకకుండా చేసేందుకు కెమికల్ క్లీనింగ్ ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కానీ కరోనాను కట్టడి చేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను కేవలం ఆరోగ్య సమస్యగా చూడలేమని, దీనిని ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా కూడా పరిగణించొచ్చని గణాంకాలు చెబుతున్నాయి.


గతంలో సార్స్ (సివియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) ప్రబలినప్పుడు అంటే 2002 నుంచి 2003 మధ్యలో చైనా జీడీపీ వృద్ధి రేటు 1.1 శాతం నుంచి 2.6 శాతం క్షీణించింది. అంటే సుమారు 18 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. కరోనా కూడా దానికి తక్కువేం కాదని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అమెరికాను పట్టి కుదిపేసిన లేమాన్ బ్రదర్స్ సంక్షోభంతో పాటు సార్స్ సంక్షోభం సమయంలో ప్రపంచ దేశాల ప్రగతిపై చూపిన ప్రతికూలతలను గుర్తు చేసుకుంటున్నారు. కరోనా కూడా అలాంటి ప్రభావమే చూపే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.

చైనాలో కరోనా భయంతో సుమారు 3.5 కోట్ల మంది రోడ్లెక్కడం లేదు. వీరంతా ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో చైనాలో ప్రధాన పరిశ్రమైన తయారీ, ఉత్పత్తి రంగం కుదేలైపోతుంది. మరోవైపు అక్కడ నిత్యావసరాలు కొనేవారు లేరు. దీంతో వాణిజ్య రంగం కుదేలైపోనుంది. సినిమాలు, షికార్ల ఊసెత్తడం లేదు. దీంతో ఎంటర్ టైన్ మెంట్ రంగంతో పాటు టూరిజం కూడా దివాలా తీసింది. నెల రోజులుగా వివిధ రంగాలను దెబ్బతీసిన కరోనా ఈ పరిస్థితులను ఇంకెన్నాళ్లు కొనసాగేలా చేస్తుందో తెలియడం లేదు.


మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనానే వూహాన్ ను కరోనా కమ్మేయడంతో చమురు, గ్యాస్ స్టేషన్, చైనా నేషనల్ కెమికల్ కార్ప్, హింగ్లి పెట్రో కెమికల్ లు కొనుగోళ్లను తగ్గించాయి. ఈ ప్రభావం ఇండోనేషియా వంటి చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గాంబ్లింగ్ కేంద్రమైన మకావూను రెండు వారాలపాటు మూసేస్తున్నారు. చైనాలో 25,000 విమానాలు రద్దయ్యాయి. హ్యుందాయ్ దేశీయ ఉత్పత్తులను ఏకంగా నిలిపేసింది. వీటి ప్రభావం చైనాపై తీవ్రంగా చూపించనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లనుందనే వార్త ఆర్థిక నిపుణుల్లో ఆందోళన పెంచుతోంది.

భారత్ విషయానికొస్తే

భారతీయ మొబైల్, ఎలక్ట్రానికి రంగం ఇంచుమించు చైనాపై ఆధారపడిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే బ్రాండెడ్ అన్ బ్రాండెడ్ ఇలా ఏ రకమైన ఉత్పత్తి అయినా చైనాతో ముడిపడే ఉంది. కరోనా ప్రభావంతో భారత్ ప్రయాణాలపై నియంత్రణ విధించింది. దీంతో ఎగుమతి, దిగుమతులపై ఈ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. ఈ దెబ్బతో అది మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గతంలో చైనాను సందర్శించేందుకు భారతీయులు బాగా ఆసక్తి చూపేవారు. కరోనా భయంతో చైనా వెళ్లాలంటే భయపడిపోతున్నారు. దీంతో వైమానిక రంగంపై దీని ప్రభావం చూపనుంది. ట్రావెల్ పోర్టళ్లు మూతపడనున్నాయి. వైద్య విద్య సులభంగా అభ్యసించాలంటే భారతీయులకు కనిపించే ప్రత్యామ్నాయం కూడా చైనాయే దీంతో విద్యార్థుల విద్యపై కరోనా ప్రభావం చూపుతుంది. కేవలం చైనా పర్యాటకమే కాకుండా దేశీయంగా కూడా పర్యాటకంపై కరోనా ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే కేరళ టూర్ కు బుక్ చేసుకున్న జంటలు టూర్లను రద్దు చేసుకున్నాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. మరోవైపు చైన సరిహద్దులతో కలిసి ఉండడం వల్ల ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. దీంతో దేశీయంగా పర్యాటకం ప్రమాదంలో పడింది. ఇది భారత్ ఊహించని పరిణామమే దీని ప్రభావం సుదీర్ఘ కాలం ఉండకపోయినప్పటికీ భారత వృద్ధి రేటు పడిపోయే ప్రమాదముందని వారు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News