ఇండియాలో పేటెంట్ పొందడం కష్టమా!?

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) సహకారం కోసం ఒప్పందం గురించిన చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇండియాలో పేటెంట్ పొందడం కష్టమా? అనే ప్రశ్న మరోసారి ఈ చర్చల్లో ఉత్పన్నమైంది. ఇండియాలో పేటెంట్లను అనుమతించడానికి 2005లో మేధో సంపత్తి చట్టాలను మార్చినప్పటి నుంచి దేశంలో ఎక్కువ పేటెంట్లు మంజూరయ్యాయి. ఔషధ రంగాలతోసహా మిగిలిన రంగాల్లో కూడా పేటెంట్ల విషయంలో ఇండియా సరళతరంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది. […]

Update: 2020-02-23 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) సహకారం కోసం ఒప్పందం గురించిన చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇండియాలో పేటెంట్ పొందడం కష్టమా? అనే ప్రశ్న మరోసారి ఈ చర్చల్లో ఉత్పన్నమైంది.

ఇండియాలో పేటెంట్లను అనుమతించడానికి 2005లో మేధో సంపత్తి చట్టాలను మార్చినప్పటి నుంచి దేశంలో ఎక్కువ పేటెంట్లు మంజూరయ్యాయి. ఔషధ రంగాలతోసహా మిగిలిన రంగాల్లో కూడా పేటెంట్ల విషయంలో ఇండియా సరళతరంగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది.

2019-20లో ఇండియా పేటెంట్ కార్యాలయం 48,751 పేటెంట్ దరఖాస్తులను ఇచ్చింది. 2014-15లో ఇది 14,316గా ఉండేది. పేటెంట్ పరీక్షల్లో అనుమతి పూర్తికానీ దరఖాస్తులు 2014-15లో 1,78,525 ఉంటే, 2020 జనవరి నాటికి 81,271కు తగ్గాయి. గడిచిన 3 ఏళ్లకు సంబంధించిన 85 పేజీల జాబితాను కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ కార్యాలయం ఔషధాల కోసం మంజూరు చేసిన పేటెంట్ల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పేటెంట్ దరఖాస్తుల పరిశీలనతోపాటు పేటెంట్లు మంజూరు చేయడానికి తీసుకున్న సమయంలో కూడా ఇండియా పురోగతి సాధించింది.

జాబితాను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యంగా బహుళజాతి సంస్థలు, విదేశీ దరఖాస్తుదారులే ఎక్కువ ప్రయోజనం పొందారని తెలుస్తోంది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2005 నుంచి క్యాన్సర్, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్(హెచ్ఐవీ), హెపటైటిస్ సీ వైరస్(హెచ్‌సీవీ), క్షయవ్యాధి(టీబీ) ల కోసం విదేశీ కంపెనీలు, సంస్థలకు 650 పేటెంట్లు ఇవ్వబడ్డాయన్నారు. క్యాన్సర్ ఔషధాల కోసం 402 పేటెంట్లు మంజూరు చేయగా, ఇండియా పేటెంట్ చట్టాన్ని మార్చిన తర్వాత 146 డయాబెటిస్ మందులకు పేటెంట్లు ఇవ్వబడ్డాయి. హృదయ సంబంధవ్యాధుల చికిత్సకు సంబంధించి 42 పేటెంట్లు, క్షయవ్యాధికి సంబంధించి 51 పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి. మొత్తం 869 పేటెంట్లలో 37 పేటెంట్లకు ఈ ఏడాదిలో 20 ఏళ్ల పేటెంట్ గడువు ముగిసింది. మిగిలినవి పేటెంట్ రక్షణ కింద సాంకేతికంగా చెల్లుబాటు అవుతాయి.

పేటెంట్ల నాణ్యత విషయానికి వస్తే, 2018లో ఇండియా ఔషధ పేటెంట్లపై ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. 2009 నుంచి 2016 మధ్య మంజూరు చేసిన 2,293 పేటెంట్లలో 72 శాతం మందుల కోసం మంజూరు చేయబడ్డాయి. ఇది గతంలో ఔషధాలకు మంజూరు చేసిన దాని కంటే స్వల్పంగా మెరుగు. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఫిరోజ్ అలీ, డాక్టర్ సుదర్శన్ రాజగోపాల్, డాక్టర్ వెంకట ఎస్.రామన్, రోషన్ జాన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మంజూరు చేసిన ద్వితీయ పేటెంట్లలో 15 శాతం మాత్రమే విస్తృతమైన పరిశీలనకు లోబడి ఉన్నాయని కనుగొన్నారు. పేటెంట్ కంట్రోలర్ ఇచ్చిన వివరణాత్మక లేఖలో ‘చాలా సందర్భాలలో, పేటెంట్ సామర్థ్యానికి సంబంధించిన వివరణలో తగినవిధంగా ఉదహరించలేదు. ఇది చట్టం అమలులో ఉన్న లొసుగులను సూచిస్తుంది’ అని తెలిపారు.

ఐపీఆర్‌లో భాగంగా ఇండియా-యూఎస్ మధ్య ఒప్పందం ద్వారా తక్కువ నాణ్యత గల పేటెంట్లను మంజూరు చేయడాన్ని కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ వ్యతిరేకిస్తున్నాయి. యూఎస్ చట్టంతో ఇండియా పేటెంట్ చట్టాన్ని ఏకీకృతం చేసే ఏ చర్య అయినా ఇండియా పేటెంట్ చట్టాన్ని బలహీనపరుస్తుందని సివిల్ సొసైటీ గ్రూప్స్ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read also..

కనెక్టివిటీ మిస్సయిన ‘భారత్‌నెట్’!

Full View

Tags:    

Similar News