అప్పుల వాయిదాలు కట్టాలా..? వద్దా..?

దిశ, న్యూస్‌బ్యూరో: దేశం, రాష్ట్రంలో కుటుంబాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కాటు వేసింది. దీంతో ఇప్పటికే మోస్తున్న రుణ భారాన్ని తీర్చలేక బతుకు బండిని ఈడ్చలేక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ లాంటి గత నాలుగైదేళ్లలో దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ ఓ మోస్తరు మాంద్యానికి గురై ఉద్యోగుల జీతాలలో పెద్ద […]

Update: 2020-04-21 05:55 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:
దేశం, రాష్ట్రంలో కుటుంబాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కాటు వేసింది. దీంతో ఇప్పటికే మోస్తున్న రుణ భారాన్ని తీర్చలేక బతుకు బండిని ఈడ్చలేక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎస్టీ, డీ మానిటైజేషన్ లాంటి గత నాలుగైదేళ్లలో దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ ఓ మోస్తరు మాంద్యానికి గురై ఉద్యోగుల జీతాలలో పెద్ద పెరుగుదల లేకుండా పోయింది. అదే సమయంలో బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు వ్యక్తుల సంపాదన ఎంతన్నదానితో సంబంధం లేకుండా జీతం, స్వయం ఉపాధి ద్వారా వచ్చే ఆదాయం ఎంతోకొంత ఉంటే చాలన్నట్లు ఇబ్బడిముబ్బడిగా రుణాలిచ్చాయి. సెల్ ఫోను, టీవీ, ఫ్రిజ్ దగ్గర నుంచి మొదలు పెడితే కారు, ఇల్లు కొనుక్కునేదాకా ఎంతంటే అంత లోన్లు సాంక్షన్ చేశాయి. కొందరికైతే పర్యాటక ప్రదేశాలకు టూర్లకు వెళ్లడానికి సైతం రుణాలు మంజూరు చేశాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం, ఒక్క ఇంటి లోనుకు తప్ప దేనికి తాకట్టు అవసరం లేకపోవడంతో చాలామంది ఈ లోన్లు తీసుకొని తెగ ఖర్చు చేశారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి దేశంలో దాదాపు నెల రోజుల నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర సర్వీసులు, నిత్యావసర వస్తువులు తప్ప దేశంలో వస్తు, సేవల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలే తమ ఉద్యోగులకు జీతాల కోతలు పెట్టాయి. ప్రజాప్రతినిధుల వేతనాలకు సైతం కోత విధించారు. ఇక ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, పలు రకాల వ్యాపారాలు రన్ చేసే వాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకింగ్, ఐటీ లాంటి రంగాల్లో తప్ప దాదాపు అందరు ప్రైవేటు ఉద్యోగులకు మార్చి నెల జీతం పూర్తిస్థాయిలో అందలేదనే చెప్పాలి. ఇక ఏప్రిల్ నెల జీతంపైనైతే చాలా మంది ఆశలు వదులుకున్నారు. దీంతో వీరికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. తీసుకున్న అప్పులకు నెలసరి వాయిదాలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అన్ని రకాల లోన్లపై 3 నెలల పాటు మారటోరియం విధించినప్పటికీ అక్కడక్కడా బ్యాంకులు కస్టమర్లకు వాయిదాలు చెల్లించాలని ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నాయి. వాయిదాలు కట్టకపోతే పెనాల్టీలు తప్పవని, క్రెడిట్ స్కోరు ప్రభావితమవుతుందని హెచ్చరికలు చేస్తున్నాయి. పొదుపు మరిచి అందినకాడికి అప్పుచేయడం తప్పైపోయిందని పలువురు ప్రస్తుతం పశ్చాతపపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

2008 సంక్షోభంతో పోలిక లేదు..

ప్రస్తుత లాక్‌డౌన్ వల్ల దేశ జీడీపీ వృద్ధి రేటు పాతాళానికి పడిపోతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఈ సంక్షోభాన్ని 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్(జీఎఫ్ సీ)‌తో పోలుస్తున్నాయి. అయితే జీఎఫ్ సీ రావడానికి ముందున్న పరిస్థితులు ప్రస్తుత లాక్ డౌన్‌కు ముందున్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కంటే చాలా బెటర్ అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. 2008లో దేశంలో ఉన్న కుటుంబాల మొత్తం అప్పు రూ6.6 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు ఆ అప్పు కాస్త సమారు 7 రెట్లు పెరిగి రూ. 43.5 లక్షల కోట్లకు చేరుకుంది. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగుల వేతనాల వృద్ధి కేవలం ఏడాదికి 4.3 శాతం ఉండగా అప్పులు మాత్రం ఈ 5 సంవత్సరాల్లో ఏకంగా సంవత్సారానికి 17.7 శాతం పెరిగిపోయింది. జీడీపీలో ఈ అప్పు వాటా 2008లో 13.2 శాతంగా ఉంటే 2015లో ఇది 15.5 శాతానికి చేరుకుంది. 2020 మార్చి నెల కల్లా జీడీపీలో 21.3 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో దేశ జీడీపీలో ప్రజల పొదుపు వాటా తగ్గుతూ వచ్చింది. 2008లో జీడీపీలో 22.4 శాతంగా ఉన్న సేవింగ్స్, 2018కి వచ్చే సరికి 19.6 శాతానికి, 2019లో 18.2శాతానికి పడిపోయింది. దేశంలో కుటుంబాలు చేసే పొదుపు తగ్గి అప్పులు పెరిగిపోయి. వాటి ద్వారా చేసే ఖర్చు పెరుగుతూ వస్తోంది. జీడీపీ వృద్ధి చెందడం వల్ల ఆదాయాలు పెరిగి అప్పులు తీర్చాల్సిన ప్రస్తుత సమయంలో కరోనా విజృంభణతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక అప్పులు తీర్చడానికి, బతుకు బండి లాగడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితిలో పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పులతో ఇబ్బందిగా ఉంది: వహీద్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీ మేనేజర్

నేను ఒక ప్రైవేటు కంపెనీలో మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. జీతం 40 వేల వరకు ఉంటుంది. బ్యాంకులతో పాటు పలు బ్యాంకింగేతర సంస్థలు ఫోన్లు చేసి వెంటపడి మరీ లోన్లు ఇచ్చాయి. ఇప్పటికి ఒక పర్సనల్ లోన్, ఒక ఇంటి లోను ఉంది. లాక్‌డౌన్ స్టార్టైన రోజు నుంచి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. మార్చి నెల జీతం సగమే వచ్చింది. ఏప్రిల్ నెల జీతం వచ్చేలా లేదు. ఈఎమ్ఐలు కట్టాల్సిందిగా బ్యాంకులు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నాయి. రుణాలపై 3 నెలల మారటోరియం అని ఆర్బీఐ చెప్పిందని విన్నా. దాని గురించి బ్యాంకులతో మాట్లాడాలి. ఏదైనా జీతాన్ని బట్టి ఖర్చు పెట్టాలి కానీ అప్పులు ఇస్తామన్నారు కదా అని ఎంత పడితే అంత తీసుకోవద్దని ఈ కరోనా పరిస్థితి వల్ల తెలిసొచ్చింది.

ప్రతి దానికి అప్పే: అనిల్, పేరొందిన హోటల్‌లో సీనియర్ మేనేజర్

నిజానికి గత 5 సంవత్సరాల్లో నా జీతం పెద్దగా పెరిగింది లేదు. ప్రతి సంవత్సరం సగటున 5 శాతం మాత్రమే సాలరీ హైక్ చేశారు. కానీ నా అప్పు మాత్రం పెరిగిపోయింది. ప్రతి దానికి క్రెడిట్ కార్డు వాడడం అలవాటైపోయింది. అన్ని అప్పు మీదే. ఏ వస్తువు కొనాలన్నా వాయిదాల పద్ధతి మీదే కొనడం అలవాటైంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మనదగ్గర ఏముందా అని చూసుకుంటే భార్య దగ్గర ఉన్న బంగారం తప్ప ఏమీ లేదు. ఇల్లు, కారు, ఇంట్లో వస్తువులు, చివరకు మొబైల్ ఫోను అన్నింటికి ఇంకా ఈఎమ్ఐలు కట్టాల్సి ఉంది. పొదుపు చేసుకుని మితంగానే అప్పులు చేయాలని ఇప్పుడు తెలిసొచ్చింది. ఎలాగైనా ఈ లాక్‌డౌన్ ముగిస్తే ఉద్యోగాలకు వెళ్లడం స్టార్టై మా పని మేం చేసుకొని అప్పులు తగ్గించుకోవాలనిపిస్తోంది.

అప్పులు కుప్పలాగా తయారయ్యాయి: రాజు, ఫ్యాన్సీ స్టోర్ ఓనర్

నాకు సికింద్రాబాద్ ఏరియాలో ఓ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. వ్యాపారం బాగానే ఉండేది. కరోనా దెబ్బకు మార్చి22 నుంచి షాపు మూత పడింది. వ్యాపారం బాగా నడిచినపుడు బ్యాంకు ఖాతాలో లావాదేవీలు జోరుగా జరిగేవి. అవి చూసి నాకు ఎన్నంటే అన్ని అప్పులిచ్చారు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఎవరిస్తే వారి దగ్గర అప్పు తీసుకున్నాను. ఇప్పుడు షాపు నుంచి ఆదాయం లేదు. అప్పులకు వాయిదాలు కట్టడానికి డబ్బు లేవు. ఉన్న కొద్ది డబ్బు షాపు తెరిచాక సామాను కొనడానికి కావాలి. అప్పులతో ఎందరో రోడ్డు మీద పడ్డారంటే సీరియస్‌నెస్ తెలియలేదు. నాదాకా వస్తే ఇప్పుడర్థమవుతోంది. దేవుడి దయ వల్ల వ్యాపారం మళ్లీ ఓపెన్ అయి బాగుంటే ముందు అప్పులు తగ్గించుకుంటా. తర్వాతే ఏదైనా ఖర్చు చేస్తా. కరోనా ప్రమాదకరమైన వ్యాధే అయినప్పటికీ జీవితం, డబ్బు గురించి చాలా నేర్పిస్తోంది.

Tags: families debt, banks, financial institutions, emis, corona, lockdown

Tags:    

Similar News