దుమారం రేపుతోన్న జీవోల వివాదం.. జగన్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
రాష్ట్రంలో రహస్య జీవోల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతున్నది. హైకోర్టు తప్పుపట్టిన దరిమిలా విపక్షాలు స్వరం పెంచాయి. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోనూ తెలుసుకునే హక్కు పౌరులందరికీ ఉన్నదని, ఎలా సీక్రెట్‌లో పెడతారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాటిని ఎందుకు దాచాల్సి వచ్చిందో తేల్చాలని నిలదీస్తున్నాయి. ఆగస్టు 10, 2021న సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి 14 జీవోలను విడుదల చేసింది. వాటిలో 10 జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో బ్లాంక్ జీవోలుగానే ఉంచారు. […]
రాష్ట్రంలో రహస్య జీవోల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతున్నది. హైకోర్టు తప్పుపట్టిన దరిమిలా విపక్షాలు స్వరం పెంచాయి. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోనూ తెలుసుకునే హక్కు పౌరులందరికీ ఉన్నదని, ఎలా సీక్రెట్‌లో పెడతారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాటిని ఎందుకు దాచాల్సి వచ్చిందో తేల్చాలని నిలదీస్తున్నాయి. ఆగస్టు 10, 2021న సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి 14 జీవోలను విడుదల చేసింది. వాటిలో 10 జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో బ్లాంక్ జీవోలుగానే ఉంచారు. వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు రూ.85 లక్షలు కేటాయింపు జీవోతో పాటు మరో 3 జీవోలను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచారు. మిగిలిన వాటిని బ్లాంక్‌గానే ఉంచారు. ఆఖరుకు అధికారుల బదిలీలకు సంబంధించిన జీవోలు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రహస్య జీవోల వివాదం రాజుకుంటోంది. వైసీపీ సర్కారు లెక్కలేనన్ని సీక్రెట్ జీవోలను జారీ చేస్తున్నదంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా జగన్ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోలు విడుదల చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు సైతం ఈ అంశంపై సర్కారుకును తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో సర్కారు సంకటంలో పడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకున్నదని, వాటిని ఎలా రహస్యంగా ఉంచుతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. జీవోల అప్‌లోడ్ పద్ధతి సాఫీగా సాగుతున్నప్పుడు దానిని ఎందుకు మార్చాల్సి వచ్చిందని హైకోర్టు నిలదీసింది. అసలు ఈ విధానం అమలులోకి తెచ్చిన తర్వాత మొత్తం ఎన్ని జీవోలను ఇలా ఏపీ గెజిట్‌లో అప్‌లోడ్ చేశారు? కాన్ఫిడెన్షియల్ పేరుతో అసలు ఎన్ని జీవోలను రహస్యంగా ఉంచారు? తదితర అంశాలతో పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఆగస్టులో మొదలైన వివాదం
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జీవోల విడుదల సాఫీగానే జరిగిపోయింది. జారీ చేసిన జీవోలన్నీ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అంతా పారదర్శకంగా వ్యవహరించింది. ఎవరైనా ఒక్క క్లిక్‌తో జీవోను ఓపెన్ చేసి అందులోని అంశాలన్నీ సమగ్రంగా చదువుకోవచ్చు. జీవో సారాంశం అంతా ప్రజలకు అవగతమయ్యే విధంగా డిస్‌ప్లేలో పెట్టింది. అయితే అలా విడుదలైన జీవోల్లోని అంశాలపై ప్రతిపక్షాలు పదేపదే కోర్టుకు వెళ్తుండటంతో జీవోలను బహిరంగపరచడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఆగస్టు 10, 2021న సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి 14 జీవోలను విడుదల చేసింది. వాటిలో 10 జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో బ్లాంక్ జీవోలుగానే ఉంచారు. వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు రూ.85 లక్షలు కేటాయింపు జీవోతో పాటు మరో 3 జీవోలను మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంచారు.
మిగిలిన వాటిని బ్లాంక్‌గానే ఉంచారు. కీలక అధికారుల బదిలీలు, వారి ఇంటి అద్దె లాంటి భత్యాల కేటాయింపు జీవోలను ఎందుకు బ్లాంక్‌లో పెడుతున్నారో తెలియడం లేదని విపక్షాలు విమర్శలు మొదలెట్టాయి. టీడీపీ నేత పట్టాభి ఆ సమయంలో తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కారు. దొంగ జీవోలు, చీకటి జీవోలు జారీ చేయడంలో జగన్ రికార్డు సృష్టిస్తున్నారంటూ ఆయన చేసిన సెటైర్లు సంచలనం సృష్టించాయి. ఒకే రోజున కాన్ఫిడెన్షియల్ జీవోలంటూ ఏకంగా 80 జీవోలను విడుదల చేసిన రికార్డు సీఎం సొంతమంటూ ఆయన ఎద్దేవా చేశారు. 10 నిమిషాల్లో 10 రహస్య జీవోలు విడుదల చేయడం ఏమిటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అర్ధరాత్రి చీకటి జీవోలు ఎందుకు జారీ చేస్తున్నారంటూ టీడీపీ ప్రశ్నించింది.
తెలంగాణలోనూ ఇదే తంతు
ఈ కాన్ఫిడెన్షియల్ జీవోల విషయంలోనే గతంలో హైకోర్టులు ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంచాలని కోర్టులు చెబుతూనే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రహస్య జీవోలు పెరిగిపోతున్నాయని కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు, ప్రజలకు మధ్య రహస్యాలు ఉండకూడదని.. జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో.. పేరాల శేఖర్ అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో రహస్య జీవోలు చెల్లవని వాటన్నిటినీ పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. రహస్య జీవోల్లో కొత్త దారులు వెతికి బ్లాంక్ జీవోలను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు ఆంధ్రా హైకోర్టు సైతం ఇదే అంశాన్ని తప్పుబట్టింది.
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ప్రతిపక్షం
రాష్ట్రంలోని ఈ బ్లాంక్ జీవోల వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గతంలోనే గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన కూడా ఈ బ్లాంక్ జీవోల వ్యవహారం చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అయితే దానిపై ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారా? లేదా అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
అసలీ బ్లాంక్ జీవో అంటే ఏమిటి?
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నింటినీ అందరికీ తెలిసేలా జీవోలను అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం ఒక వెబ్‌సైట్ కూడా నిర్వహిస్తున్నారు. https://goir.ap.gov.in/అనే వెబ్‌సైట్‌లో జీవోలను అందుబాటులో ఉంచుతారు. వాటిని ఎవరైనా ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అయితే కొంతకాలంగా జీవోలను ఇలా ఈ వెబ్‌సైట్‌లో పెట్టారు కానీ.. వాటి వివరాలేమీ లేవు. ఏ డిపార్టుమెంట్ నుంచి రిలీజ్ అయ్యాయో తెలుస్తుంది. జీవో నెంబర్ కూడా ఉంటుంది. కానీ అసలు ఆ జీవో దేనికి సంబంధించినది. అనే వివరాలు మాత్రం ఉండవు. జీవో కాపీ కూడా ఉండదు. ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. గత ప్రభుత్వాలు కూడా కాన్ఫిడెన్షియల్ పేరుతో కొన్ని జీవోలను రహస్యంగా ఉంచేవారు. వివాదాస్పదం అవుతాయి అనుకున్న వాటిని కాన్ఫిడెన్షియల్‌గా పెట్టి.. ఆ నిర్ణయాలను అమలు చేశాక వాటిని బహిరంగ పరిచేవారు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ పద్దతిని మరింత ముందుకు తీసుకెళ్లి బ్లాంక్ జీవోల పద్దతి తీసుకొచ్చారు. అంటే జీవో నెంబర్ మాత్రం ఉంటుంది, జీవో ఉండదన్నమాట. దీన్నే బ్లాంక్ జీవో అంటారు.
సర్కారు రిప్లయ్‌పై సర్వత్రా ఆసక్తి
తాజాగా కోర్టు ఆదేశించినట్టుగా ప్రభుత్వం ఈ బ్లాంక్ జీవోలపై ఏం వివరణ ఇస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే బ్లాంక్ జీవోలను కోర్టు ఆదేశాల మేర బహిర్గతపరిస్తే అసలు వాటిలో ఏముంది అనే దానిపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కోర్టు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఈ రహస్య జీవోల వ్యవహారం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.