ఆ జిల్లాల నారు.. వద్దే వద్దు!

దిశ ప్రతినిధి, వరంగల్ : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుంచి నకిలీ క్రిమి సంహారక మందులే కాదు.. నాసిరకం మిర్చి నారు కూడా దిగుమతి అవుతోంది. జిల్లాకు తీసుకొచ్చి అమాయక గిరిజన రైతులకు అంటగడుతున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులు స్థానికంగా ఉండే పలువురి అండదండలతో ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఫకీర్‌ తండాలో రెండు లక్షల విలువ గల నాసిరకం మిర్చినారును ఉద్యానశాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకోవడంతో ఈ […]

Update: 2020-09-14 00:37 GMT

దిశ ప్రతినిధి, వరంగల్ : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుంచి నకిలీ క్రిమి సంహారక మందులే కాదు.. నాసిరకం మిర్చి నారు కూడా దిగుమతి అవుతోంది. జిల్లాకు తీసుకొచ్చి అమాయక గిరిజన రైతులకు అంటగడుతున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళారులు స్థానికంగా ఉండే పలువురి అండదండలతో ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఫకీర్‌ తండాలో రెండు లక్షల విలువ గల నాసిరకం మిర్చినారును ఉద్యానశాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.

నాసిరకం నారుతో నష్టం..!

మహబూబాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 44,198 ఎకరాల్లో మిర్చి సాగయ్యింది. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిర్చి తోటల్లో నీరు నిలిచి, 50 శాతం మేర నారు కుళ్లిపోయింది. సుమారు 22 వేల ఎకరాల్లో మిర్చినారు పాడవడంతో మళ్లీ నారు పోయాలని రైతులు నిర్ణయించుకున్నారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన దళారులు కమీషన్ ద్వారా నారు తెస్తామని నాసిరకం నారును అమాయక రైతులకు అంటగడుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు 10 వేల మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో మొక్క రూ.2నుంచి రూ.3 వరకు ధర నిర్ణయించి అమ్ముతున్నారు. పదివేల మొక్కలకు దాదాపు రూ.30 వేల వరకూ ఖర్చు అవుతోంది.

అనుమతి ఏదీ?

నారు, మొక్కలు విక్రయించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మిన రైతులకు లాట్ నెంబర్‌తో బిల్లు ఇవ్వాలి. కానీ దళారులు ఎలాంటి అనుమతులు లేకుండా మిర్చినారు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి మొక్కలు నాటితే పూత, కాత ఉండదని అధికారులు చెప్తున్నారు. గతేడాది జిల్లాలో వేసిన మిర్చితోటలు కాత కాయకుంటే అనేక మార్లు గిరిజన రైతులు ఆందోళనలు చేశారు. దీంతో దుకాణాదారులు కొంతమేర నష్ట పరిహారం చెల్లించి, చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఆంధ్ర నుంచి వస్తున్న ఈ నారు వల్ల తోటలు కాత కాయకపోతే ఎవరినీ అడిగే అవకాశమే ఉండదు. భారీగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు.

నాసిరకం నారు కొనొద్దు..

గుంటూరు, ఆంధ్ర ప్రాంతం నుంచి నాసిరకం మిర్చి నారు వస్తోంది. ఆ నారు కొని ఎవరూ నష్టపోవద్దు. అది నాటిన వారం రోజుల లోపు చనిపోతుంది. ప్రభుత్వ అనుమతి ఉన్న నర్సరీల్లో మాత్రమే కొనాలి. నారు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు అడిగి తీసుకోవాలి. అనుమతి లేని నారు అమ్మితే రూ. 50 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించడం జరుగుతుంది. -కె.సూర్య నారాయణ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి

Tags:    

Similar News