అదేపనిగా సినిమాలు చూస్తే..మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్ట్రీమింగ్ యుగం నడుస్తోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి.. కంటెంట్ చూడాలన్న క్షణాల్లో దొరికిపోతుంది..Latest Telugu News

Update: 2022-06-14 05:42 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం స్ట్రీమింగ్ యుగం నడుస్తోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి.. కంటెంట్ చూడాలన్న క్షణాల్లో దొరికిపోతుంది. నచ్చిన సినిమాలు, సిరీస్‌లు చూసే అవకాశాన్ని అందిస్తోంది. ఒక చేతిలో స్నాక్స్, డ్రింక్స్.. మరో చేతిలో రిమోట్ పట్టుకుని టీవీ, ల్యాప్ టాప్ లేదా మొబైల్‌లో ఒక్క సినిమా ఆన్ చేస్తే చాలు కావాల్సినంత వినోదం దొరుకుతుంది. కానీ ఏదైనా అతిగా చేస్తే అనర్థమే కాబట్టి పగలు, రాత్రి తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోవడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

బింజ్ వాచింగ్(అతిగా చూడటం) అనేది ప్రస్తుతం కామన్ బిహేవియర్ అయిపోయింది. కానీ నెట్‌ఫ్లిక్స్ సర్వే ప్రకారం, 61 శాతం మంది వినియోగదారులు ఒకే సిట్టింగ్‌లో షో యొక్క 2-6 ఎపిసోడ్‌లను క్రమం తప్పకుండా చూస్తున్నారని తెలుస్తోంది. ఇలా అతిగా చూడటం ప్రారంభిస్తే ఇక ఆపలేరని.. మెదడు డోపమైన్, సంతోషకరమైన హార్మోన్ను నిరంతరం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. ఈ రసాయనం ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను చూస్తూ ఆస్వాదించడం కొనసాగించమని ప్రోత్సహిస్తుంది.

ఇక అతిగా చూడటం అనేది ఒక అడిక్టివ్ బిహేవియర్ అయినందున.. ఇది కాస్తా సూడో అడిక్షన్(నకిలీ వ్యసనం)ను సృష్టిస్తుంది. ఒకరు టెలివిజన్ చూడటానికి ఎక్కువ సమయం గడపడం గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబీకులు.. ఆపమని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వారిపై శత్రుత్వం, చిరాకు పెరుగుతుందని, వారితో మునుపటిలాగా ప్రేమగా ఉండటం కష్టంగా మారొచ్చని నిపుణులు చెప్తున్నారు.

అతిగా చూడటం వలన ఎఫెక్ట్ :

1. ఒంటరి అనుభూతిని కలిగిస్తుంది

విరామం అవసరమైనప్పుడల్లా అతిగా సిరీస్, సినిమాలు చూడటం అనేది ప్రపంచం నుంచి వైదొలిగేందుకు, ఇతరులతో డిస్‌కనెక్ట్ అయ్యేందుకు గొప్ప మార్గం. అయితే, ఒక షోను కంటిన్యూగా చూడటం వల్ల మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇది మీ ఖాళీ సమయంలో వ్యక్తిగతంగా ఇతరులకు దగ్గరయ్యే సంభావ్యతను తగ్గిస్తుంది. ఫలితంగా కుటుంబం, స్నేహితుల నుంచి దూరమయ్యే అవకాశముంది.

2. నిద్రలేమి

నిద్ర మానవ ఆరోగ్యానికి కీలకం. ప్రతీరోజు ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ. ఈ విషయంలో రాజీపడితే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే అతిగా సినిమాలు చూడటం నిద్ర షెడ్యూల్‌ను విస్మరిస్తుంది. తద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మానసిక స్థితికి భంగం కలిగించడంతో పాటు, అలసటను పెంచుతుంది. దీన్ని ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల నిద్ర లేమిని నివారించవచ్చు.

3. అభిజ్ఞా సమస్యలు (కాగ్నిటివ్ ఇష్యూస్)

మొబైల్ ఫోన్‌లు, టీవీ, ల్యాప్‌టాప్‌లలో స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం, కంటెంట్ నిష్క్రియంగా వినియోగించడం వల్ల అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీరు రోజుల తరబడి అలసిపోయిన అనుభూతిని కలిగిస్తుంది. ఏదైనా కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేయగల లేదా ఆలోచించగల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

4. డిప్రెషన్‌కు కారణం

ఎక్కువ సమయం అదే పనిగా టీవీ చూడటం అలసటకు దారితీస్తుంది. తద్వారా ఒత్తిడి పెరిగి డిప్రెషన్, యాంగ్జయిటీ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. అతిగా చూడటం, నిరాశ మరియు ఒంటరితనం మధ్య బలమైన సంబంధం ఉందని కనుగొన్నారు.

5. మూడ్ డిస్టర్బెన్స్ అండ్ బిహేవియర్ చేంజెస్

ప్రజలు ముఖ్యంగా వారాంతాల్లో లేదా ఖాళీ సమయం దొరికినప్పుడు విశ్రాంతి కోసం ఎక్కువగా సినిమాలు చూస్తారు. అయితే నిరంతరం అతిగా చూడటం, తీవ్రమైన మానసిక స్థితి అంతరాయం మరియు ప్రవర్తనా మార్పులకు కారణమవుతుంది. అందుకే స్క్రీన్‌లతో ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు టైమ్ లిమిట్స్ సెట్ చేయాలి.

పరిష్కారం ఏమిటి?

నిర్దిష్ట సంఖ్యలో ఎపిసోడ్‌ల తర్వాత మీరు ఎంత వీక్షించవచ్చనే దానిపై పరిమితిని సెట్ చేయడం చాలా కీలకం. మీరు మీ పరిమితిని చేరుకున్నప్పుడు టెలివిజన్‌ని ఆఫ్ చేసి, వేరే ఏదైనా పని చేయండి. టీవీ చూడడాన్ని ఒక సామాజిక సందర్భంగా చేసుకోండి. కమ్యూనికేషన్‌ను సజీవంగా ఉంచడానికి మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించవచ్చు.


Similar News