దోమలు స్త్రీల కంటే పురుషుల్నే ఎక్కువ కుడతాయంటా.. ఎందుకో తెలుసా..?!
వాటి సాపేక్ష వేడి లేదా కార్బన్ డయాక్సైడ్ కారణంగా కావచ్చు. Mosquitoes are more prone to bite men than women.
దిశ, వెబ్‌డెస్క్ః దోమల వల్ల పర్యావరణానికి లాభమెంతో గానీ, మనుషులకు మాత్రం చాలా నష్టమున్నట్లు కనిపిస్తుంది. చాలా సాధారణ రోగాలకు ఈ దోమలే పరోక్షంగా కారణమవుతూ, అతి చిన్న దోమే ప్రాణాలు తీస్తుంది. అయితే, ఈ దోమలు స్త్రీల కంటే పురుషులను కుట్టడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాయని ఇటీవలి అధ్యయనంలో వెల్లడయ్యింది. అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక స్టడీ ప్రకారం దోమలు స్త్రీల కంటే పురుషులను కుట్టడానికే ఎక్కువ అవకాశం ఉందని తెలుస్తుంది. పురుషుల శరీర పరిమాణం కారణంగా తరచుగా దోమల బారిన పడుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఎందుకంటే, "పెద్ద దేహమున్న వ్యక్తులు ఎక్కువ దోమలను ఆకర్షిస్తారు. బహుశా వాటి సాపేక్ష వేడి లేదా కార్బన్ డయాక్సైడ్ కారణంగా కావచ్చు" అని అధ్యయనం తెలిపింది.
ఇంతకుముందు, మహిళలే దోమలకు ఇష్టమని నమ్మారు. ఎందుకంటే, దోమలకు ఈస్ట్రోజెన్ బలమైన ఆకర్షకం. ఇక, 2000లో నిర్వహించిన లాన్సెట్ అధ్యయనంలో, గర్భిణీ స్త్రీలను గర్భిణీలు కాని వారితో పోల్చినప్పుడు, గర్భిణీ స్త్రీలు దోమలను రెండింతలు ఆకర్షిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతారు. అలాగే, అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటారు. కనుక, దోమలు వాటిని మరింత సులభంగా గుర్తిస్తాయి. న్యూయార్క్‌కు చెందిన అలెర్జీ, ఆస్తమా కేర్‌కు చెందిన డాక్టర్ క్లిఫోర్డ్ డబ్ల్యూ. బాసెట్ ప్రకారం, దోమలకు కార్బన్ డయాక్సైడ్‌తో పాటు, లాక్టిక్ యాసిడ్ బలమైన ఆకర్షకం. అందుకే, చెమట ఎక్కువగా ఉండే మనుషుల్నే దోమలు ఎక్కువగా దాడి చేస్తాయని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆడ దోమలు మనుషులను కుట్టడం వల్ల, అవి తమ గుడ్లు పెరగడానికి మానవ రక్తం నుండి ప్రోటీన్‌లను సంగ్రహిస్తాయని స్టడీ పేర్కొంది. ఇక, వాటి మగ సహచరులు మీ చుట్టూ తిరగడం వల్ల చికాకు కలిగినప్పటికీ, అవి ప్రమాదకరం కాదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.