ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లకు సంబంధించి దేశీయ దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు పొదుపుదారులకు ఊరటనిచ్చాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష(ఎంపీసీ)కు ముందు తమ దీర్ఘకాలిక డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించాయి. హెచ్‌డీఎఫ్‌సీ తన దీర్ఘకలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయించింది. 33 నెలల కాలపరిమితి ఉన్న రూ. 2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం, 66 నెలల కాలపరిమితికి రూ. 2 […]
దిశ, వెబ్‌డెస్క్: ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లకు సంబంధించి దేశీయ దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు పొదుపుదారులకు ఊరటనిచ్చాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష(ఎంపీసీ)కు ముందు తమ దీర్ఘకాలిక డిపాజిట్ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించాయి. హెచ్‌డీఎఫ్‌సీ తన దీర్ఘకలిక డిపాజిట్లపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయించింది. 33 నెలల కాలపరిమితి ఉన్న రూ. 2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం, 66 నెలల కాలపరిమితికి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి 6.7 శాతం, 99 నెలల కాలానికి 6.8 శాతం వడ్డీ రేటుతో ఇవ్వనుంది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది.
పెంచిన వడ్డీ రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. మరో దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ బజాజ్ ఫైనాన్స్ సైతం తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లను పెంచింది. 12-23 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులేమీ చేయలేదని కంపెనీ తెలిపింది. 24-35 నెలల కాలానికి రూ. 5 కోట్ల వరకు డిపాజిట్లకు 6.4 శాతం, 36-60 నెలల కాలానికి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ అందించనుంది. ఈ నెలలో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో సర్దుబాటు వైఖరిలో మార్పు ఉండొచ్చని నిపుణుల అంచనాల నేపథ్యంలోనే కంపెనీలు వడ్డీ రేట్లను పెంచాయని తెలుస్తోంది.