గ్రేటర్ వార్ : గెలుపోటముల్లో 'సోమీ' కీలక పాత్ర
గ్రేటర్ ఎన్నికల కోలహలం అంతా సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. మాటల యుద్ధం.. పంచ్ డైలాగులు.. సెటైర్లు ఇలా అన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. స్టేటస్ లు, మేసేజ్ లు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు అందరిదీ అదే దారి. నట్టింట్లోకి స్మార్ట్ఫోన్ఎంటరైన తర్వాత సోషల్మీడియాయే పార్టీల ప్రచారానికి కీలకంగా మారింది. ఆయుధాల్ని సమకూర్చుకుంటూ, అప్రకటిత యుద్ధం చేస్తూ జనం నాడిని పట్టేసేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. […]
గ్రేటర్ ఎన్నికల కోలహలం అంతా సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. మాటల యుద్ధం.. పంచ్ డైలాగులు.. సెటైర్లు ఇలా అన్ని ఫేస్ బుక్, ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. స్టేటస్ లు, మేసేజ్ లు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు అందరిదీ అదే దారి. నట్టింట్లోకి స్మార్ట్ఫోన్ఎంటరైన తర్వాత సోషల్మీడియాయే పార్టీల ప్రచారానికి కీలకంగా మారింది. ఆయుధాల్ని సమకూర్చుకుంటూ, అప్రకటిత యుద్ధం చేస్తూ జనం నాడిని పట్టేసేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎదుటోడి బలహీనతలను చూపిస్తూ తమ బలం పెంచుకుంటున్నాయి. కొత్త పోకడల ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే ఇప్పుడు వారి ప్రధాన ఎజెండా అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలేవైనా రాజకీయ పార్టీలు పచ్చనోట్లపైనే ఆధారపడతాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అదనంగా సోమీ (సోషల్ మీడియా) సైతం కీలక పాత్ర పోషిస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సోషల్ మీడియాపై ఈసారి బాగానే ఫోకస్ పెట్టాయి. ఈ ప్లాట్‌ఫాంను విస్తృతంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయి. విమర్శలు, ఆరోపణలను ఆకర్షణీయమైన తీరులో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ముందంజలో ఉండగా, ఈసారి టీఆర్ఎస్ సైతం ప్రవేశించింది. కాంగ్రెస్ నాయకత్వం ఈ దిశగా కేడర్‌ను డ్రైవ్ చేయడంలో ఒకింత వెనకబడే ఉంది.
దుబ్బాకలో బీజేపీ గెలుపునకు సోషల్ మీడియానే ప్రధాన కారణమంటూ టీఆర్ఎస్ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో ఖాతాలు తెరిచింది. కార్యకర్తలకు విస్తృతంగా సర్క్యులేట్ చేసింది. ఈ ఐదేళ్లలో జీహెచ్ఎంసీకి చేసిన అభివృద్ధి, సంక్షేమ అంశాలను ఇమేజ్‌ల రూపంలో కుమ్మరిస్తోంది. ట్విట్టర్ వినియోగంలో మంత్రి కేటీఆర్, అధికారులు యాక్టివ్‌గా ఉన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పెద్దగా అందుకోలేదు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావాలని సూచిస్తున్నారు.
పొరబడి..తడబడి
గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండే దుబ్బాక మీద సోషల్ మీడియా ప్రభావం తక్కువని టీఆర్ఎస్భావించింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలు, ప్రభుత్వం ఇతర నియోజకవర్గాలకు దీటుగా దుబ్బాకను అభివృద్ధి చేయకపోవడం లాంటి అంశాలను బీజేపీ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసింది. టీఆర్ఎస్ దీనిని తూర్పారబట్టింది. ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న తర్వాత కానీ, సోషల్ మీడియా ప్రచారం ఏ మేరకు చేటు చేసిందో టీఆర్ఎస్ గ్రహించలేకపోయింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న దుబ్బాకలోనే సోషల్ మీడియా ప్రభావం ఈ స్థాయిలో ఉంటే ఇక పట్టణ ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో దాని ప్రభావం గణనీయంగా ఉంటుందనేది కాదనలేని అంశం. నగరంలోని చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నందున ఆ ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. వారిని ఆకట్టుకోడానికి పార్టీలు కూడా ఊహకు అందని విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అబద్ధాలు, వాస్తవాలు, గోబెల్స్ ప్రచారాలు, గొప్పలు, నిందలు, ప్రతిష్టలు.. ఇలా ఆయా పార్టీలు వాటికి అనుగుణంగా సోషల్ మీడియా ద్వారానే ప్రజలను చేరుకోడానికి ఎత్తులు వేస్తున్నాయి. మైకుల ద్వారా, రోడ్‌షోలు, ర్యాలీల ద్వారా జరిగే ప్రచారంకంటే సోషల్ మీడియా మంచి ఫలితాలను ఇస్తుందని పార్టీలు భావిస్తున్నాయి.
నాడు మండిపడి
దుబ్బాక ఎన్నికల ప్రచారంలోగానీ, కరోనా కట్టడి విషయంలోగానీ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న పోస్టింగులపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మొదలు టీఆర్ఎస్ నేతలు చాలామంది అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘సోషల్ మీడియాకు విశ్వసనీయత లేదు. రాసేవాళ్లు ఫాల్తుగాళ్లు. శాడిస్టులు. పనీపాట లేనోళ్లు. అడ్డం పొడుగు లేకుండా రాసేటోళ్లు” అంటూ పరుష పదాలతో ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారంటూ మంత్రి ఈటల రాజేందర్ సైతం కరోనా సమయంలో చాలా కరుకుగానే మాట్లాడారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదంతా గతం. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నేతలు సోషల్ మీడియాపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, హైదరాబాద్ నగర గొప్పదనం, మౌలిక సౌకర్యాలకు ఖర్చు చేసిన వివరాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులేమీ లేవన్న అంశాన్నీ ప్రచారంలో పెడుతున్నారు.
వెనకబడిన కాంగ్రెస్
టీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి అన్ని రకాల ప్రయోగాలు చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం వెనకబడే ఉంది. సీనియర్ నేతలంతా ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పార్టీ నేతలు లైవ్ సమావేశాలు నిర్వహించినా ప్రభుత్వ వైఫల్యాలను లేదా పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలనుగానీ ప్రజలకు చేరే విధంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతోంది. టీఆర్ఎస్, బీజేపీల దూకుడును తట్టుకునే విధంగా కనీసం ఆత్మరక్షణ స్థాయిలోనైనా సోషల్ మీడియా ప్రచారాన్ని విస్తృతం చేయాలన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో కనిపించడంలేదు.
కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్
దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం నిలిపివేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్యన సోషల్ వార్ నడుస్తోంది. వరద సాయాన్ని బీజేపీయే నిలిపివేయించిందని టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎస్ఈసీకి లేఖ రాయడంతోనే సాయం ఆగిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ మాత్రం తాను లేఖ రాయలేదని, తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఫోర్జరీ చేసిందని మండిపడుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలని సవాల్ విసురుతున్నారు. అదే ఆలయంలో తానూ ప్రమాణం చేస్తానని అంటున్నారు. వదర సాయాన్ని ఆపేయమంటూ కాంగ్రెస్ చెప్పలేదని, ఆ పార్టీ నేత దాసోజ్ శ్రవణ్ వాదిస్తున్నారు. తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఎటు చూసినా ఎన్నికల ప్రచారమే దర్శనమిస్తోంది.
ఐడీ కార్డులతో..
ఓ రాజకీయ పార్టీ ఫేక్ ఐడీ కార్డులతో సిమ్ లను తీసుకొని ప్రత్యర్థి పార్టీలపై యుద్ధం చేయాలని చూస్తోంది. ఇందుకోసం తన పార్టీకి సంబంధించిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, జర్నలిస్టుల ఆధార్ కార్డు, ఫొటోలను సేకరిస్తోంది. ఆ అధారాలతో సిమ్ కార్డులు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేయాలని సంకల్పిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై దుష్ప్రచారం చేసేందుకు ఉద్యోగులను వాడుకుంటోంది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్చ కొట్టేందుకు ఇతరుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.