దాపరికం ఎందుకు?

పంప్ హౌస్‌లోకి నీరు చేరడంతో కేఎల్ఐ పథకానికి బ్రేక్ పడింది. దీనిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవానికీ ఎక్కడా పొంతన కుదరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకానికి బ్రేక్ పడటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తడం నిజమే అయితే మరో నెల రోజుల్లో పంప్ హౌస్ అందుబాటులోకి వస్తుందని, అలా కాకుండా నిజంగా పెద్ద ప్రమాదమే తలెత్తితే ఇప్పట్లో అందుబాటులోకి […]

Update: 2020-10-21 02:11 GMT

పంప్ హౌస్‌లోకి నీరు చేరడంతో కేఎల్ఐ పథకానికి బ్రేక్ పడింది. దీనిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవానికీ ఎక్కడా పొంతన కుదరడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకానికి బ్రేక్ పడటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు చుట్టు పక్కల జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్య తలెత్తడం నిజమే అయితే మరో నెల రోజుల్లో పంప్ హౌస్ అందుబాటులోకి వస్తుందని, అలా కాకుండా నిజంగా పెద్ద ప్రమాదమే తలెత్తితే ఇప్పట్లో అందుబాటులోకి రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మరోసారి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. పాలమూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీరు అందించే కేఎల్ఐ పథకానికి బ్రేక్ పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 3.50లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఇటీవలే కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదనీరు ఈ పథకం మొదటి లిఫ్టు.. ఎల్లూరు పంప్ హౌస్‌లోకి చేరడంతో ప్రస్తుతం పంపింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పంప్ హౌస్‌ను ఆధారంగా చేసుకుని మిషన్ భగీరథ ఫిల్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పంప్ హౌస్‌లోకి నీరు చేరడంతో మిషన్ భగీరథలో నీటి పంపింగ్ వ్యవస్థ సైతం పూర్తిగా నిలిచిపోయింది.

అనేక సందేహాలు..

నిజంగా సాంకేతిక సమస్యే కారణమా? ప్రతిపక్షాలు చెబుతున్నట్టు బేస్‌మెంట్ దెబ్బతిందా‌? లేక సర్జ్ పూల్ సైడ్ వాల్ దెబ్బతినడం వల్ల వరద నీరు వచ్చి చేరిందా? ఇలా అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువవడంతో అసలు విషయం బయటకు రావడం లేదు. కేఎల్ఐ ఎల్లూరు లిఫ్టు వద్దకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా ఇతర పార్టీల వారిని అనుమతించడం లేదు. అధికార పార్టీ నాయకులు మాత్రం త్వరలోనే పంపింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని వెల్లడిస్తున్నారు. చివరకు మీడియాను కూడా పంప్ హౌస్ వద్దకు అనుమతించకపోవడం‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న సమస్యే ఉంటే అధికార పార్టీ నాయకులను మినహా మిగతా వారిని పంప్ హౌస్ వద్దకు ఎందుకు అనుమతించడం లేదని పలువురు ప్రశ్రిస్తున్నారు.

కుదరని పొంతన

పంప్ హౌస్ లోకి నీరు చేరిన రోజే మంత్రి నిరంజన్ రెడ్డి పంప్ హౌస్ ను పరిశీలించారు. తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పంప్ హౌస్ ను సందర్శించారు. సాంకేతిక కారణం వల్లే నీరు వచ్చిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని, త్వరలోనే పంపింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పంప్ హౌస్‌లో మొత్తం 120 ఫీట్ల మేర నీరు వచ్చి చేరింది. నీటిని తోడేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మోటర్లను తెప్పిస్తున్నామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెల్లడించారు. కానీ నాలుగు రోజులు గడుస్తున్నా ఇంతవరకు మోటర్లను తీసుకురాకపోవడంతో ఇక్కడే ఉన్న ఇతర మోటర్ల సహాయంతో పంపింగ్ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పంప్ హౌస్‌లోని మొత్తం నీరు తోడాలంటే కనీసం 25 నుంచి 30 రోజులు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక సమస్యే కారణమైతే ఇబ్బంది ఉండదు కానీ ఒక వేళ లోపల పగుళ్ళు ఏర్పడి సమస్య పెద్దదిగా ఉంటే మాత్రం ఇప్పట్లో నీటి తొలగింపు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో పంప్ హౌస్‌కు సంబందించిన ఏ అధికారి సైతం మాట్లాడేందుకు ఇష్టపడకపోవడం‌పై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటలకు అక్కడ జరుగుతున్న పనులకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదని నాయకులు ఆరోపిస్తున్నారు.

తాగునీటి కష్టాలు తప్పవా ?

సుదీర్ఘ కాలం పాటు తాగునీటి కష్టాలు ఎదుర్కొన్న పాలమూరు జిల్లా వాసులకు మరోమారు ఇబ్బందులు తప్పేలా లేవనే వాధనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటలకు కెఎల్ఐ వద్ద వున్న పరిస్థితికి పొంతన లేకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అదే సమయంలో సాంకేతిక సమస్య వున్న నేపథ్యంలో త్వరతిగతిన పనులు చేయాల్సిన అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. అదే సమయంలో ఇక్కడ సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ద్రుష్టి సారిస్తున్నారు. గతంలో జిల్లాకు తాగునీరు అందించిన కోయిల్ సాగర్, రామన్ పాడు తాగునీటి పథకాలను పునరుద్దరణ చేశారు. అయితే కొంతకాలంగా వాటిని నుండి నీటిని వినియోగించకపోవడం కారణంగా కొంత చిన్న చిన్న సమస్యలు ఉత్పనం అవుతున్నాయి. ముఖ్యంగా పైప్ లైన్ లీకేజీల కారణంగా నీరు చాలా ప్రాంతాల్లో వ్రుద్దాగా పారుతుండడంతో వాటిని సరిదిద్దే పనుల్లో అధికారులు నిమఘ్నమయ్యారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వున్న 1690 గ్రామ పంచాయితీలలో సైతం వ్రుద్దాగా వున్న బోరుబావులను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు.

స్పష్టత కరువు

అసలు పంప్ హౌస్ లోకి చేరిన నీటిని పూర్తిగా తొలగించేందుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో స్పష్టత కరువైంది. ఇరిగేషన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం పంప్ హౌస్ లో సాప్ట్ వాల్ ఊడిపోయి వుండవచ్చని, లేదా ఎక్కడైన వాల్స్ వద్ద లీకేజీలు ఏర్పడడం వల్ల కూడా ప్రమాదం జరిగి వుండచ్చని అంటున్నారు. అయితే ఇంత చిన్న ప్రమాదానికి ఇంత స్థాయిలో నీరు వచ్చి చేరుతుందా అనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో క్రుష్ణ నదిలో ప్రస్తుతం నీటి ఉద్రుతి తీవ్రంగా వున్న నేపథ్యంలో అధికారులు సమాచారం మేరకు అధికార పార్టీ నాయకులు చెబుతున్న విధంగా వారం పది రోజుల్లో పూర్తి స్థాయిలో డీవాటరింగ్ సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నేతలు చెబుతున్న విధంగా జరిగితే మాత్రం మరో నెల నుండి నెలన్నర రోజుల్లో తిరిగి కేఎల్ఐ యధాస్థితికి చేరుకుంటుంది ఇందుకు విరుద్దంగా జరిగితే మాత్రం ఇప్పట్లో కేఎల్ఐ పథకం పై ఆశలు పెట్టకుకోవడం కూడా వ్యర్థమే అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News