57 ఏళ్లకే పింఛన్ హామీ నీటి మూటనేనా?
ఎన్నికల్లో మేం ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినం. ఖచ్చితంగా ఈ బడ్జెట్‌లో నిధులు పొందుపరుస్తం. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన మగవాళ్లు, ఆడవాళ్లందరికీ రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తం. ఎంత మంది ఉన్నరో లెక్క కూడా తేలింది. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏప్రిల్ నుంచే వారికి పింఛన్లు అందిస్తం. – మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత జనవరి […]
ఎన్నికల్లో మేం ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినం. ఖచ్చితంగా ఈ బడ్జెట్‌లో నిధులు పొందుపరుస్తం. మార్చి 31 తర్వాత రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన మగవాళ్లు, ఆడవాళ్లందరికీ రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తం. ఎంత మంది ఉన్నరో లెక్క కూడా తేలింది. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏప్రిల్ నుంచే వారికి పింఛన్లు అందిస్తం.
– మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత జనవరి 25న సీఎం కేసీఆర్ ప్రకటన
దిశ, న్యూస్ బ్యూరో:
సాక్షాత్తూ ముఖ్యమంత్రి విస్పష్టంగా ఫ్రకటన చేసినా అది ఆచరణకు నోచుకోలేదు. 57 ఏళ్లకే వృద్ధులకు పింఛన్లు ఇస్తామన్న మాట నీటి మూటగానే మిగిలిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియే ఇంకా ప్రారంభం కాలేదు. పైగా ఇప్పుడు ఉన్న పింఛన్లలోనే కోత పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పింఛన్ల అమలు కార్యరూపం దాలుస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పింఛన్ల అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గిస్తామని సాధారణ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రకటించింది. పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశాలను మేనిఫెస్టోలోనూ పొందుపర్చింది. పింఛన్లను రెట్టింపు చేస్తామన్న హామీ 2019 మే నెల నుంచి అమలవుతోంది. వయసు తగ్గింపు హామీ మాత్రం ఫైలుకే పరిమితమైంది. మరోవైపు పించన్లు వస్తాయన్న ఆశతో 57 ఏండ్లు నిండిన వృద్ధులు కుప్పలు తెప్పలుగా దరఖాస్తు చేసుకున్నారు. 8.51 లక్షల అర్జీలు వచ్చి పడ్డాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.200 చొప్పున రుసుము రూపంలో ప్రభుత్వానికి రూ.17.02 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. నిబంధనల ప్రకారం చూస్తే ఇందులో 6.62 లక్షల మంది అర్హులుగా ఉంటారని ప్రాథమిక అంచనా వేశారు. అందుకు సంబంధించిన ఫైల్ అతీగతీ లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ సాకుతో ఏడాదిన్నర కాలంగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు.
నిబంధనలు కఠినం
కొత్త పింఛన్లను మంజూరు చేయకపోగా, ప్రభుత్వం అందుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2018 నవంబర్ వరకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాను ఇందుకు ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి వరకు ఉన్న జాబితా ఆధారంగా పెన్షన్ వస్తుందని దరఖాస్తుదారులు ఆశ పడ్డారు. 2018 ఓటరు జాబితా ఆధారంగా వయస్సు నిర్ధారణ చేస్తుండటంతో దాదాపు 3.21 లక్షల మందికి పెన్షన్ అందని ద్రాక్షే అవుతోంది. ఒక ఇంట్లో రెండు పెన్షన్లు, మూడెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్నవారు కూడా అనర్హులేనని తేల్చి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షల వార్షికాదాయం పరిమితిగా నిర్ణయించడం కూడా అర్జీలు మరింతగా ఫిల్డర్ కావడానికి కారణమైంది.
లబ్ధిదారులు తగ్గుతున్నా
పెన్షన్ అర్హత వయస్సు 57 ఏండ్లకు కుదిస్తే రాష్ట్రంలో మరో పది లక్షల వరకు ఆసరా లబ్ధిదారులు పెరుగుతారని ప్రభుత్వం తొలుత భావించింది. నిబంధనల కారణంగా ఆ సంఖ్య తగ్గింది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల అధికారులు గ్రామాల్లో విచారణ సైతం చేశారు. పట్టణ ప్రాంతాల్లోమాత్రం పెండింగ్ లో పెట్టారు. 57 ఏండ్లు నిండిన వారు 6.62 లక్షల మంది ఉన్నారని, వారికి త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి దయాకర్‌రావు మార్చిలో ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరిచింది. పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పెన్షన్ల సొమ్ము రెట్టింపు చేసిన అనంతరం 2019 ఓటాన్ బడ్జెట్‌లో రూ. 12,067 కోట్లు కేటాయించింది. సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్లో రూ.9,434 కోట్లు కేటాయించింది. అప్పటివరకు రాష్ట్రంలో 38.72 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో పెట్టిన 2020-21 బడ్జెట్‌లో రూ.11,758 కోట్లను ఆసరా పెన్షన్ల కోసం కేటాయించింది.
కరోనాను సాకుగా చెబుతారా?
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38,58,615 మందికి పెన్షన్లు అందుకుంటున్నారు. వీరిలో దివ్యాంగులు 4,93,975 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.3016 చొప్పున పెన్షన్లు అందుతున్నాయి. వృద్ధులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, బోధకాలు వ్యాధిగ్రస్తులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలకు రూ.2016 చొప్పున ఇస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ. 800 కోట్లు చెల్లిస్తోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ కొత్త పెన్షన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. వాస్తవంగా ప్రభుత్వం అంచనా వేసిన విధంగా కొత్త పెన్షన్లు 6.62 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే ఏటా రూ.1,601 కోట్లు అదనంగా విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా దేశమంతా ఆర్థిక నష్టాలు తీసుకువచ్చింది. ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వలేకపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో ఆసరా పెన్షన్లు ఆగకపోయినా, నిధుల సమీకరణ ప్రభుత్వనికి సవాలుగా మారింది. ఈ కష్టకాలంలో కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుందా? అనేది సందేహమే. అధికారుల్లోనూ స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకుండా కొత్త పింఛన్ల ప్రక్రియను చేపట్టలేమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తవారికి ఇవ్వడం కష్టమేనని వారి అభిప్రాయం.
ఆసరా లబ్ధిదారుల వివరాలు
వృద్ధులు: 12,37,657
దివ్యాంగులు: 4,93,975
వితంతువులు: 14,37,924
నేత కార్మికులు: 37,042
గీత కార్మికులు: 62,356
హెచ్ఐవీ పేషెంట్లు: 32,846
బోదకాలు బాధితులు: 14,901
బీడీ వర్కర్లు: 4,07,708
ఒంటరి మహిళలు: 1,34,206
మొత్తం: 38,58,615