‘ధరణి’లో కులమెందుకు?
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ ఆస్తుల నమోదు ప్రక్రియలో ‘కులం’ ప్రస్తావన తప్పనిసరి చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆస్తుల డేటాతో పాటు యజమాని కులం కూడా అడుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. అనవసరపు వివరాలను కూడా సేకరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఆస్తులు ఏ కులంవారికి ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడానికేనా అనే సందేహాలు కలుగు తున్నాయి. ఆస్తి ఏ కులానికి చెందినవారిదో గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని రెవెన్యూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ ఆస్తుల నమోదు ప్రక్రియలో ‘కులం’ ప్రస్తావన తప్పనిసరి చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆస్తుల డేటాతో పాటు యజమాని కులం కూడా అడుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. అనవసరపు వివరాలను కూడా సేకరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఆస్తులు ఏ కులంవారికి ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవడానికేనా అనే సందేహాలు కలుగు తున్నాయి. ఆస్తి ఏ కులానికి చెందినవారిదో గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని రెవెన్యూ చట్టాల నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వే నివేదికలో భూముల రికార్డుల్లో జెండర్ తప్పనిసరిగా పేర్కొంది.
మహిళల ఆస్తులపై ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అందుకే, ఏయే ఆస్తులు మహిళల పేరిట ఉన్నాయో గుర్తించాలని సూచించింది. కుల ప్రాతిపదికన ఆస్తుల నమోదు ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 56 శాతం మందికి భూములు లేవు. తెలంగాణలోనూ కొన్నేండ్ల క్రితం గ్రామీణ పరివర్తనపై కొందరు మేధావులంతా కలిసి చేసిన సర్వేలో ఓ బీసీల్లోని కొన్ని కులాలకు ల్యాండ్ హోల్డింగ్స్ పెరిగినట్లు తేలింది. ఎస్సీ, ఎస్టీలకు భూములు తగ్గినట్లు వెల్లడైంది. ఈ అంశాలన్నింటినీ హెచ్ సీయూ ప్రొఫెసర్ ఒకరు రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ పై రాసిన పుస్తకంలోనూ పేర్కొన్నట్లు సమాచారం. ఉన్నతవర్గాల్లోని ఓ కులానికి చెందిన సంపన్నవర్గాల చేతుల్లోకి కూడా పెద్ద ఎత్తున భూ హక్కులు మారాయన్న ప్రచారం ఉంది. ప్రభుత్వం ఈసారి చేపట్టిన సర్వేలో వ్యవసాయేతర ఆస్తులు ఏ వర్గానికి ఎంత శాతం ఉన్నాయో స్పష్టం కానుంది. ఇదే ఆందోళనకు గురి చేస్తోంది.
పాలకుల గుప్పిట ఆస్తులు
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అప్డేషన్ యాప్ ఫర్ అఫిషియల్స్ (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు) యూజర్ డాక్యుమెంటు’లో స్టెప్ 3, సీరియల్ నంబరు 5 లో కులం, 6 లో మొబైల్ నంబరు, స్టెప్ 9 లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు. స్టెప్ 4లో ఆధార్ కార్డు నంబరు, స్టెప్ 5లో యజమాని ఫోటో (ఐచ్ఛికం)గా తీసుకుంటున్నారు. దీని ద్వారా ఏ కులం వారికి ఎంత ఆస్తి ఉంది? ఏ కులం వారికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? ఏ యే ప్రాంతంలో ఏ కులం వారు ఆర్ధికంగా ఉన్నారన్న సమగ్ర వివరాలు పాలకుల గుప్పిటకు రానున్నాయని తెలుస్తోంది. ధరణి పోర్టల్ లో ఆస్తుల వివరాలు నమోదు కాకపోతే మీ ఆస్తి మీది కాకుండా పోతుందన్న భయాలను ఉద్యోగులు, మంత్రులు సృష్టిస్తున్నారు. దాంతో ప్రతి ఒక్కరూ వారి ఆస్తుల వివరాల నమోదుకు పోటీ పడుతున్నారు. ఇష్టం లేకపోయినా కులం ఏమిటో అనివార్యంగానే చెప్పేస్తున్నారు.
ఆధార్ తో ఆస్తుల చిట్టా
ఇప్పటికే వ్యవసాయ భూములన్నింటినీ ఆధార్ నంబరు సీడ్ చేశారు. దీని ఆధారంగా ఎవరికెన్ని భూములు, ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఉన్నాయి. తాజాగా వ్యవసాయేతర భూముల వివరాల నమోదుతో సంపన్నుల బాగోతం బయట పడనుంది. ఆధార్ నమోదుతో సంక్షేమ పథకాలకు అర్హులా, కాదా అన్న విషయాన్ని మాత్రం వెంటనే తేల్చేయొచ్చు. వారి ఆస్తుల జాబితాను బట్టి సంపన్నులా? పేదలా అన్న విషయం స్పష్టమవుతుంది.
కుటుంబ సభ్యుల చిట్టాతో పంచాయతీ
సమగ్ర కుటుంబ సర్వే క్రమంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి చోటు చేసుకున్నది. ఎక్కడెక్కడో ఉన్నోళ్లు, స్థిరపడ్డోళ్లంతా సొంత ఊర్లకు రావాల్సి వచ్చింది. ఇప్పుడూ గ్రామాల్లోని ఆస్తుల వివరాల నమోదుకూ మరోసారి తప్పనిసరిగా రావాలంటున్నారు. ఊర్లలో స్థలాలను పంచుకునేటప్పుడు కొలతలు వేసుకునే సందర్భాలు తక్కువే. వాటికి ప్రత్యేక ఇంటి నంబర్లు కూడా ఏర్పాటు కాలేదు. అలాంటి ఆస్తుల వివరాల నమోదు క్లిష్టంగా మారింది. వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. ఇప్పుడేమో సంబంధిత ఆస్తి పత్రాలను చూపించాలంటున్నారు. తామెక్కడి నుంచి తీసుకురావాలని జనం ప్రశ్నిస్తున్నారు. పంచుకున్న ఆస్తి వివరాలను వారసులందరి పేరిట రాస్తారా? అక్కడ నివాసముంటున్న ఒక్కరి పేరిటే రాస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ డేటా సేకరణ లేకపోతే నివాసముంటున్న ఒక్కరే దాన్ని అనుభవించేవారు. మిగతా ఇద్దరు కూడా అంగీకరించేవారు. ఆస్తిని గుర్తు చేసే సరికి తమకు హక్కులు లేకుండా పోతాయన్న భయం పట్టుకుంది. అందుకే ఎప్పుడో ఇంటిని వదిలేసి వెళ్లిన సోదరులు కూడా తమ పేర్లు కూడా రాయించాలంటూ అన్నలకు చెప్పేస్తున్నారు. దీంతో విబేధాలు మొదలవుతున్నాయని తెలిసింది. ప్రతి ఆస్తిలోనూ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడంతో హక్కులు ఉన్నాయన్న ఆశలు రేకెత్తిస్తాయని న్యాయవాదులు చెబుతున్నారు.
టైటిల్ నిర్దారించదు
రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే వివరాలు పన్నుల వసూళ్లకు మాత్రమే. అది టైటిల్ ను నిర్ధారించదని సుప్రీం కోర్టు ఇప్పటికే రెండు ప్రధాన తీర్పుల్లో వెల్లడించిందని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ధరణిలో నమోదు కాని ఆస్తుల బదలాయింపు జరగదన్న భయం పట్టుకుంది. వ్యవసాయేతర భూముల నమోదులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఇకనైనా ప్రజలకు ఈ డేటా నమోదు వెనుకనున్న ఉద్దేశ్యాలను వివరిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.