ఆ టీవీలు వద్దంతే!
మన దేశంలో ఎన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినా, ఇంకెన్ని రకాల ఎలక్ట్రానిక్ అవసరాలు వచ్చినా ఎప్పటికప్పుడు ఆదరణ తగ్గకుండా ఉన్నది టీవీలే. లైవ్ అప్‌డేట్స్ ఉన్నా సరే, వెబ్ సిరీస్ వంటి కార్యక్రమాలు స్మార్ట్‌ఫోన్‌లోకే అందుబాటులో వచ్చినా సరే క్రికెట్ చూసేందుకు, సీరియళ్లను వీక్షించేందుకు ప్రజలు టీవీలకే మెజారిటీ ఓట్లు వేస్తారు. ఏడాదికి కొన్ని కోట్ల విలువైన టీవీలు మన దేశానికి దిగుమతి అవుతాయి. ఒక్క 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే […]
మన దేశంలో ఎన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లు వచ్చినా, ఇంకెన్ని రకాల ఎలక్ట్రానిక్ అవసరాలు వచ్చినా ఎప్పటికప్పుడు ఆదరణ తగ్గకుండా ఉన్నది టీవీలే. లైవ్ అప్‌డేట్స్ ఉన్నా సరే, వెబ్ సిరీస్ వంటి కార్యక్రమాలు స్మార్ట్‌ఫోన్‌లోకే అందుబాటులో వచ్చినా సరే క్రికెట్ చూసేందుకు, సీరియళ్లను వీక్షించేందుకు ప్రజలు టీవీలకే మెజారిటీ ఓట్లు వేస్తారు. ఏడాదికి కొన్ని కోట్ల విలువైన టీవీలు మన దేశానికి దిగుమతి అవుతాయి. ఒక్క 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 7 వేల కోట్ల విలువ టీవీ ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అయ్యాయంటే మనవాళ్లు ఏ స్థాయిలో టీవీలను కొంటున్నారో ఊహించవచ్చు. అయితే, ప్రభుత్వం దేశీయంగా టీవీల తయారీలను పెంచేందుకు, విదేశీ దిగుమతులను తగ్గించుకునేందుకు అవసరంలేని వస్తువుల జాబితాలో భాగంగా టీవీ దిగుమతులపై ఆంక్షలను విధించింది. దీనికోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు దీనికి సంబంధించి చర్చలు జరిపినట్టు సమాచారం.
సాధారణంగా ఇండియాకు టీవీలను ఎగుమతులు చేసే దేశాల్లో ప్రధమస్థానం చైనాదే. చైనా నుంచి దిగుమతి అయ్యే టీవీల విలువ దాదాపు రూ. 55 కోట్లు. తర్వాతి స్థానాల్లో వియత్నాం 32.7 కోట్లు, మలేషియా 10.9 కోట్ల విలువైన టీవీలను ఇండియాకు ఎగుమతి చేస్తున్నాయి. వీటి తర్వాత ఇండొనేషియా, జర్మనీ, కొరియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే టీవీలతో పాటు ఫర్నీచర్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులపైన కూడా ఆంక్షలు విధించింది.