మిడతల దండుపై పోరుకు సన్నద్ధం
దిశ, ఆదిలాబాద్: ఊహించినట్టుగానే మిడతల దండు దూసుకొస్తోంది. నిన్నటి దాకా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ వైపు మిడతల దండు వెళ్లిపోయిందన్న సంకేతాలు రాగా.. తాజాగా ఆదివారం మిడతల దండు తెలంగాణ వైపు వస్తుందన్న సమాచారం రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. నాగపూర్‌లో భారీగా మిడతలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో మిడతలు పాగా వేశాయి. మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద మిడతల దండు ఉందని అధికార వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే అక్కడి పొలాల్లో మిడతలు దాడులకు […]
దిశ, ఆదిలాబాద్: ఊహించినట్టుగానే మిడతల దండు దూసుకొస్తోంది. నిన్నటి దాకా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ వైపు మిడతల దండు వెళ్లిపోయిందన్న సంకేతాలు రాగా.. తాజాగా ఆదివారం మిడతల దండు తెలంగాణ వైపు వస్తుందన్న సమాచారం రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
నాగపూర్‌లో భారీగా మిడతలు
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో మిడతలు పాగా వేశాయి. మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద మిడతల దండు ఉందని అధికార వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే అక్కడి పొలాల్లో మిడతలు దాడులకు దిగినట్లు తెలుస్తుంది. పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నది. గాలివాటం తెలంగాణ వైపు మళ్లితే ఒక్క రోజు వ్యవధిలో మిడతలు దూసుకొచ్చే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగపూర్ పరిసరాల్లో మిడతల ప్రభావంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. హెలికాప్టర్ల సహాయంతో క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నారు.
జిల్లా సరిహద్దుల్లో అప్రమత్తం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వం నియమించిన ఐదుగురి సభ్యుల కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల గుండా హెలికాప్టర్‌లో తిరుగుతూ పరిస్థితిని అంచనా వేశారు. నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో అధికారులు పర్యటించారు. ఒక్కో జిల్లాలో ఐదు ఇంజన్లు, క్రిమిసంహారక మందులతో సిద్ధంగా ఉన్నారు. రైతులు కూడా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకైతే జిల్లా సరిహద్దులోకి మిడతల దండు రాలేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆశాకుమారి వెల్లడించారు. కాగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాణహిత, పెన్‌గంగా నదీ తీరం వెంబడి చర్యలు తీసుకుంటున్నామని ఆయా జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ మిడతల ఉనికి కనిపించింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో కొన్ని మిడతలు కనిపించగా… ఆదివారం నిర్మల్ పట్టణంలో అక్కడక్కడ మిడతలు కనబడడం గమనార్హం. అయితే గాలివాటంలో కొన్ని మిడతలు దారితప్పి వచ్చి ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.