నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. రాజీవ్ యువ వికాస్ పథకానికి గడువు పెంపు
రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
దిశ, కొత్తగూడెం : రాజీవ్ యువ వికాస్ పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులైన యువకులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్కు పలు సూచనలు చేశారు. అర్హులైన వారు ఏప్రిల్ 14, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు. 50 వేల రూపాయల లోపు రుణం వంద శాతం మాఫీ, లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ. 2 లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుంది.
రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. అలాగే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత కలెక్టరేట్ కార్యాలయాలలో, ఎంపీడీవో ఆఫీసులలో, మున్సిపల్ కార్యాలయాలలో ప్రజా పాలన హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినందున అక్కడ ఉన్న సిబ్బంది తప్పనిసరిగా ఫిజికల్ గా అప్లికేషన్లు తీసుకొని కరెక్ట్ గా ఉన్నది లేనిది చెక్ చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చామన్నారు. గ్రామీణ స్థాయిలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. నిరుద్యోగులైన యువత ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకొని ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేసిన తర్వాత వాటిని తీసుకొని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన హెల్ప్ డెస్క్ లలో ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామని, సూచనల ప్రకారము హెల్ప్ డెస్క్ కార్యాలయంలో ఫిజికల్ గా అప్లికేషన్లు అందుబాటులో ఉంచి తీసుకుంటామని అన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, మైనార్టీ అధికారి సంజీవరావు, ఎస్సీ కార్పొరేషన్ ఉపేందర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి అనసూయ, మెప్మా పిడి రాజేష్, డి ఆర్ డి ఓ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.