కార్పొరేట్ కూల్ డ్రింక్స్ ఎఫెక్ట్.. కనుమరుగవుతున్న ‘గోలీసోడా’
దిశ, శేరిలింగంపల్లి: మార్కెట్లోకి ఎన్ని కూల్ డ్రింక్స్ వచ్చినా గోలీసోడా తాగితే వచ్చే కిక్కే వేరు.. మేడిన్ లోకల్ బ్రాండ్ అయిన గోలీసోడాలకు మంచి డిమాండ్ ఉండేది. వేసవికాలం వచ్చిందంటే చాలు తోపుడు బండ్లలో పెట్టి గల్లీగల్లీ తిరుగుతూ సోడాలు అమ్మేవారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సోడాలు తాగి వేసవి తాపాన్ని తగ్గించుకున్నాం అంటూ సేదతీరేవారు. జాతర్లు, వేడుకల్లో అయితే వీటికి ఫుల్ డిమాండ్ ఉండేది. తెలుగు సినిమాల్లోనూ గోలీసోడాల మీద డైలాగ్‌లు, ఫైట్లు పుష్కలం. అలాగే […]
దిశ, శేరిలింగంపల్లి: మార్కెట్లోకి ఎన్ని కూల్ డ్రింక్స్ వచ్చినా గోలీసోడా తాగితే వచ్చే కిక్కే వేరు.. మేడిన్ లోకల్ బ్రాండ్ అయిన గోలీసోడాలకు మంచి డిమాండ్ ఉండేది. వేసవికాలం వచ్చిందంటే చాలు తోపుడు బండ్లలో పెట్టి గల్లీగల్లీ తిరుగుతూ సోడాలు అమ్మేవారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సోడాలు తాగి వేసవి తాపాన్ని తగ్గించుకున్నాం అంటూ సేదతీరేవారు. జాతర్లు, వేడుకల్లో అయితే వీటికి ఫుల్ డిమాండ్ ఉండేది. తెలుగు సినిమాల్లోనూ గోలీసోడాల మీద డైలాగ్‌లు, ఫైట్లు పుష్కలం. అలాగే ఒంటిచేత్తో సోడా కొట్టడాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని యూత్ పోటీపడేవారు. అప్పట్లో ఇవి అంత ఫేమస్ మరీ. కానీ, ప్రస్తుతం కార్పొరేట్ కూల్ డ్రింక్స్ ముందు గల్లీ గోలీసోడా కానరాకుండా పోతుంది. అడపాదడపా ఎక్కడో ఒకచోట మాత్రమే ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
రంగు రంగుల సోడాలు..
గోలీసోడా ఒక్కటే అయినా.. అందులో ఉండే ఫ్లేవర్లు అనేకంగా ఉండేవి. రకరకాల రంగుల్లో, రుచుల్లో లభించేవి. పిల్లలైతే స్వీట్ సోడా, ఆరెంజ్ ఫ్లేవర్స్ బాగా ఇష్టపడేవారు. ఇక పెద్దలు ఎక్కువగా మసాలా సోడకు మొగ్గుచూపేవారు. కాస్త ఆయాసంగా ఉన్నా.. అరుగుదల లేదని అనిపించినా లెమన్ సోడా ఎక్కడుందా అని వెతుక్కునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ సోడాల్లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్లెయిన్ సోడా, ఆరెంజ్ సోడా, గ్రేప్స్ సోడా, కలర్ సోడా, లెమన్, లెమన్ స్వీట్, మసాలా, మసాలా సాల్ట్, సుగంధీ సోడా, స్ట్రా బెర్రీ, అంజీర్, ఫ్రూట్ సోడా అంటూ ఎన్నో ఫ్లేవర్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి.
గోలీసోడా ప్రత్యేకమే..
గోలీసోడా అంటేనే అదో స్పెషల్. చిన్నపాటి సీసాలో సోడాను నింపి అందులోని గ్యాస్ బయటకు లీక్ అవకుండా చిన్నపిల్లలు ఆడుకునే గోటిని అడ్డంగా ఉండేలా ఏర్పాటు చేస్తారు. అందులో నీరు, గ్యాస్ నింపగానే అది రంధ్రానికి అడ్డుగా వచ్చి ఆగుతుంది. దాంతో సోడా బయటకు వెల్లదు. వేలితో ఆగోలీని అడ్డుతొలగిస్తే ఒకరకమైన శబ్దంతో కొద్దిపాటి గ్యాస్ బయటకు వచ్చి తాగేందుకు వీలు ఏర్పడుతుంది. దాన్ని కూడా ఎంత త్వరగా తాగితే అంత బాగుంటుందని చెబుతారు గోలీసోడా ప్రియులు.
తయారీ మాత్రం కష్టమేనంటా..!
అయితే దీని తయారీ విధానం మాత్రం చాలా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు తయారీదారులు. తగిన మోతాదులో గ్యాస్ ఫిల్ చేయాలని, లేదంటే సీసాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుందని, ఒక్కోసారి గాయాలు కావడం, లేదా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు. గోలీసోడాల కోసం వినియోగించే సీసాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వీటి పరిమాణం, ఆకారం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. వీటిని కేవలం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనే తయారు చేస్తుంటారు. గోలీసోడాలకు డిమాండ్ తగ్గిపోవడంతో అక్కడ కూడా వీటి తయారీ యూనిట్లు మూతపడ్డాయి. దీంతో గతంలో ఉన్న సీసాలను ఎక్కడెక్కడో వెతికి తెచ్చి ప్రస్తుతం పునర్వినియోగం చేస్తున్నారు. వీటి స్థానంలో ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినా గోలీసోడాలో తాగిన మజా రావడం లేదని జనాలు అంటున్నారు.
హెల్తీ సోడా..
సోడా తాగడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు డాక్టర్లు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనేది మాత్రం మర్చిపోవద్దని సలహా ఇస్తున్నారు. సోడా తాగడం వల్ల అజీర్తి, మైనర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీరుతాయని అంటున్నారు. ఎండ వేడిమికి, దాహం తీరేందుకు సహకరిస్తాయి. కానీ అదే అలవాటుగా మారినా, ఎక్కువగా తాగినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి అని హెచ్చరిస్తున్నారు. ఇందులో వాడే వాటర్, గ్యాస్ కోసం వినియోగించే ఆమ్లాలు, ఫ్లేవర్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఓసారి తాగడం మంచిదే అయినా రెగ్యులర్‌గా తాగకుండా కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.
గిరాకీలు బాగున్నాయి. నాగ నాయుడు వ్యాపారి
గోలీసోడాలకు మంచి డిమాండ్ ఉంది. ఖర్చు కాస్త ఎక్కువే అవుతున్నాయని.. దీంతో ధరలు పెంచి గిట్టుబాటు చేసుకుంటున్నాము. మేము చాలా రకాల ఫ్లేవర్స్ అమ్ముతున్నాము. లెమన్, కలర్ సోడాలను చాలామంది ఇష్టపడుతుంటారు. సుగంధి సోడా కూడా బాగా అమ్ముడవుతుంది. మినరల్ వాటర్ వాడుతూ సోడాలు తయారీ చేస్తున్నాం. అలాగే శుభ్రత విషయంలో కూడా రాజీపడం. నాగ నాయుడు, వ్యాపారి