మనోళ్లే గదా.. లైట్ తీస్కో…
మనం మనం బరంపురం అనేది ఓ నానుడి. దాన్ని నిజం చేసేలా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యులైతే ఒక రూల్.. మన వాళ్లయితే మరో రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు ఇంటి గేటుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకుంటే జీహెచ్ఎంసీ అధికారులు వేలల్లో ఛలాన్లు విధించారు. నాన్– ప్రాఫిటబుల్, స్వచ్ఛంద సంస్థలు, స్టడీ సర్కిళ్ల ప్రచార పోస్టర్లను […]
మనం మనం బరంపురం అనేది ఓ నానుడి. దాన్ని నిజం చేసేలా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యులైతే ఒక రూల్.. మన వాళ్లయితే మరో రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు ఇంటి గేటుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకుంటే జీహెచ్ఎంసీ అధికారులు వేలల్లో ఛలాన్లు విధించారు. నాన్– ప్రాఫిటబుల్, స్వచ్ఛంద సంస్థలు, స్టడీ సర్కిళ్ల ప్రచార పోస్టర్లను కూడా వదల్లేదు. ఈ తీరును ఎంపీలు, ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసి పాలకమండలి సమావేశాల్లో తీవ్రంగా తప్పుపట్టారు. 2019 అక్టోబర్ నుంచి అనుమతిలేని బ్యానర్లు, ఫ్లెక్సీలపై జరిమానాలు విధించడాన్ని నిరసించారు. పద్దతి మార్చుకోవాలని మేయర్‌పై వత్తిడి తెచ్చారు.
అప్పటికే విజిలెన్స్ విభాగం రూ. 30 కోట్లకు పైగా విలువైన చలాన్లు జనరేట్ చేసింది. ఒకే పోస్టర్‌పై ప్రతీ 24 గంటలకోసారి చలాన్ జనరేట్ అవకాశం ఉంది. దీంతో పాటు ఫైన్ చెల్లించని సందర్భంలో మొదటి చలాన్ మీదనే ఇదే విధంగా మళ్లీ మళ్లీ ఫైన్ వేస్తున్నారు ఆ విభాగం అధికారులు. పోస్టర్, బ్యానర్ కొలతలను బట్టి రూ.5 నుంచి 20 వేల వరకూ జనరేట్ అయిన మొదటి చలాన్పైనే ఇప్పుడు రూ.5 లక్షల వరకూ చెల్లించాలంటూ పదేపదే ఈవీడీఎం నుంచి నోటీసులు అందుకున్నవారి సంఖ్య వందల్లోనే ఉంది. స్వచ్ఛంధ సంస్థలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను మినహాయించాలని సామాజిక కార్యకర్తలు, సంస్థలు ఈవీడీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పోస్టర్లను తొలిగించిన తర్వాతనైనా ఆ చలాన్లను రద్దు చేయాలని మొరపెట్టుకున్నారు. ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం ఒకసారి చలాన్ జనరేట్ అయితే దాన్ని తీసేందుకు కంప్యూటర్‌లో అవకాశం లేదని దబాయించేవారు. విజిలెన్స్ డైరెక్టర్‌కు కూడా ఆ రకమైన ఆప్షన్ లేదని చెప్పారు. స్వయంగా డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు సిఫారసులు చేసినా ఛలాన్లు తొలగించలేదని ఉదాహరణలతో వివరించారు. కానీ తాజాగా కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్వయంగా ఒక బ్యానర్ పెడితే రూ.10 వేల జరిమానాతో చలాన్ జనరేట్ చేసింది. ఎవరో పెట్టారనుకుని చలాన్ జనరేట్ చేసిన తర్వాత వాస్తవాన్ని తెలుసుకున్న ఈవీడీఎం తర్వాత నాలుక్కరుచుకుంది.
పత్రికల్లో, సోషల్ మీడీయాలో ఈ వార్త హల్చల్ కావడంతో ఆ తర్వాత చలాన్ రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. బ్యానర్‌ను వినైల్‌తో కాకుండా క్లాత్ మెటీరియల్ వాడినందుకే ఛలాన్‌ను రద్దు చేసినట్టు పేర్కొనింది. ఒకసారి చలాన్ జనరేట్ అయితే విజిలెన్స్ డైరెక్టర్‌కు సైతం దాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పే జీహెచ్ఎంసీ ఇప్పుడు జోనల్ కమిషనర్ విషయంలో మాత్రం ఎలా సాధ్యమయిందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. రోజుకు రూ.500 కూడా సంపాదించలేని వారిపై లక్షల్లో జరిమానా విధించిన ఈవీడీఎం సామాజిక సంస్థలు గోడల మీద వేసిన పోస్టర్లను కూడా వదలలేదు. కనీసం రూ.30 వేలతో నెక్లెస్ రోడ్ సర్కిల్ వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన కటౌట్‌కు మాత్రం కేవలం రూ.5 వేలు చలాన్ వేసి సరిపెట్టుకుంది.
కేసీఆర్ పుట్టిన రోజున నగరంలో వేల సంఖ్యలో బ్యానర్లు, ఫ్లెక్సీలను టీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేస్తే పదుల సంఖ్యలో కూడా చలాన్లు జనరేట్ చేయలేదు. కేసీఆర్, జీహెచ్ఎంసీ బ్యానర్‌పై మాత్రం చలాన్ వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ విభాగాలైన జీహెచ్ఎంసీ, ఈవీడీఎం ఒకటే కాబట్టి చలాన్లు జనరేట్ చేయడం, క్యాన్సిల్ చేయడం అంతా మన పనే అన్నట్టు వ్యవహరించారు. అదే సమాజానికి సేవ చేసే వారికి మాత్రం మినహాయింపునివ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ, నాయకులకు సంబంధించిన బ్యానర్లపై ఒక విధంగా, సామాన్య జనాల విషయంలో ఇంకో విధంగా ఈవీడీఎం వ్యవహరించి విమర్శల పాలవుతోంది.