రాములో రాములా… నీ బడ్జెట్ ఏమాయె!
దిశ, ఖమ్మం: భద్రాద్రి రామయ్య ఆలయాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందా! శ్రీ సీతారామచంద్రస్వామికి ఇచ్చిన వరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకున్నారా? ఇక ఆలయ అభివృద్ధి కలేనా… రూ.100 కోట్లు మంజూరు వట్టి మాటేనా? అంటే జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రభుత్వ ధోరణి చూస్తూంటే అనుమానాలు రాక మానడం లేదంటున్నారు భక్తులు. 2016 ఏప్రిల్ 15న శ్రీ రాములోరి కల్యాణానికి భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఏడాది బడ్జెట్‌లోనే ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి మంజూరు […]
దిశ, ఖమ్మం: భద్రాద్రి రామయ్య ఆలయాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందా! శ్రీ సీతారామచంద్రస్వామికి ఇచ్చిన వరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తీసుకున్నారా? ఇక ఆలయ అభివృద్ధి కలేనా… రూ.100 కోట్లు మంజూరు వట్టి మాటేనా? అంటే జరుగుతున్న నిర్లక్ష్యం, ప్రభుత్వ ధోరణి చూస్తూంటే అనుమానాలు రాక మానడం లేదంటున్నారు భక్తులు.
2016 ఏప్రిల్ 15న శ్రీ రాములోరి కల్యాణానికి భద్రాచలం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఏడాది బడ్జెట్‌లోనే ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి మంజూరు చేస్తామని లక్షలాది మంది భక్తుల సమక్షంలో మాటిచ్చారు. దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతామని, ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం పూడుస్తుందని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సీఎం చెప్పినట్లుగానే మరుసటి సంవత్సరం 2017 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ అభివృద్ధి, కళాకృతులు, నిర్మాణాలు, ఇలా అనేక విషయాల పర్యవేక్షణకు చినజీయర్ స్వామి సమక్షంలో ప్రణాళిక, పర్యవేక్షణ జరిగేలా ఆయనకు బాధ్యతలను అప్పగించింది. జీయర్‌స్వామి కూడా పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు.
ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మంజూరును మాత్రం మరిచింది. మూడేళ్లుగా ఒక్కపైసా కూడా విడుదల కాకపోవడంతో ఆలయాభివృద్ధి పనులు అంగులం కూడా ముందుకు సాగలేదు. మరోవైపు యాదాద్రి పనులు ఓ వైపు శరవేగంగా పూర్తవతుండగా భద్రాచలం రాముని ఆలయంపై కేసీఆర్ ఎందుకో చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపుల ప్రస్తావన ఉంటుందని, ఆ వెంటనే నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని రాములవారి భక్తులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ, ఈసారి కూడా నిరాశే మిగిల్చింది ప్రభుత్వం.
నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే ఆలయంపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం ఆధ్యాత్మికంతో పాటు పర్యాటకరంగం పరంగా కూడా ఎంతో స్కోప్ ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. భద్రాచలం శ్రీరాముని కల్యాణోత్సవం వచ్చే నెలలో జరగనున్న నేపథ్యంలో ఆలయాభివృద్ధిపై భక్తుల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం కల్యాణోత్సవంపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన మంత్రి అజయ్‌కుమార్ దృష్టికి రూ.100 కోట్ల విషయాన్నిపలువురు భక్తులు దృష్టికి తీసుకెళ్లగా ఇప్పట్లో కష్టమే అంటూ కుండబద్ధలు కొట్టేశారని సమాచారం.
Tags :Bhadrachalam, Sri Rama, Sita, Seetha Ramachandra Swamy, KCR, China Jiar Swamy, Budget of Rs 100 crore, Minister Ajay, Kumar, devotees