నాగార్జున వర్సిటీ డిస్టేన్స్ ఎడ్యుకేషన్‌ దందా.. ప్రతీ పరీక్షకు రేటు ఫిక్స్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రాలను నిర్వహిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​గైడెన్స్​ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు మరో రాష్ట్రంలో దూరవిద్య కేంద్రాలను నిర్వహించకూడదు. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దూరవిద్యా కేంద్రాలను నిర్వహించుకోవాలి. కానీ, ఆ నిబంధనలేవీ యాజమాన్యం పట్టించుకోవడంలేదు. అక్రమ సంపాదనే ధ్యేయంగా తెలంగాణ వ్యాప్తంగా సబ్​సెంటర్లను కేటాయించడమే కాకుండా పరీక్షలు సైతం నిర్వహిస్తోంది. ఆ పరీక్షల్లోనూ అక్రమాలకు […]

Update: 2021-11-15 17:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రాలను నిర్వహిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​గైడెన్స్​ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు మరో రాష్ట్రంలో దూరవిద్య కేంద్రాలను నిర్వహించకూడదు. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే దూరవిద్యా కేంద్రాలను నిర్వహించుకోవాలి. కానీ, ఆ నిబంధనలేవీ యాజమాన్యం పట్టించుకోవడంలేదు. అక్రమ సంపాదనే ధ్యేయంగా తెలంగాణ వ్యాప్తంగా సబ్​సెంటర్లను కేటాయించడమే కాకుండా పరీక్షలు సైతం నిర్వహిస్తోంది. ఆ పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కోర్సుకు చెందిన విద్యార్థులకు ఒక్కో రేటును ఫిక్స్​చేసి అవకతవకలకు పాల్పడుతోంది.

ఏపీకి చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలను నిర్వహిస్తోంది. పలు కోర్సులకు ఈనెల 6వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా, ఈ పరీక్షలు రాసేందుకు కోర్సులవారీగా సబ్​సెంటర్ల నిర్వాహకులు రేటును ఫిక్స్​చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో నాగార్జున యూనివర్సిటీకి సైతం ముడుపులు అందుతాయని సమాచారం. చూసి పరీక్ష రాసేందుకు విద్యార్థుల నుంచి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దాన్ని కూడా కోర్సుల వారీగా విభజించినట్లు విద్యార్థి సంఘాలు వెల్లడిస్తున్నాయి. ఆర్ట్స్ గ్రూపునకు చెందిన ఒక్కో పేపర్‌కు కనీసం రూ.2,500గా రేట్​ఫిక్స్​చేసినట్లు సమాచారం. అదే సైన్స్​గ్రూపునకు చెందిన పరీక్షా పత్రానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ మొత్తాన్ని కూడా సెంటర్లలో చూసి పరీక్ష రాసేందుకే తీసుకుంటుండగా.. కచ్చితంగా పాస్​చేసేందుకు, విద్యార్థులకు నచ్చిన పర్సంటేజీ కావాలంటే రూ.5 వేల నుంచి రూ.7 వేలు చెల్లించాల్సిందే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తుండటంపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెళ్లడంతో గ్రేటర్​పరిధి వరకు కట్టడి చేసినట్లు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని వారు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నాగార్జున వర్సిటీ దూరవిద్య కేంద్రానికి చెందిన పలు సబ్ సెంటర్లలో లక్షన్నర మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దాదాపు 50 వేలకు పైగా ఉంటారని తెలుస్తోంది. అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారులు గ్రేటర్​హైదరాబాద్​వరకు కట్టడి చేసినా రూరల్​ఏరియాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. నాగార్జున వర్సిటీ నాన్​లోకల్ కావడంతో ఆ సర్టిఫికెట్‌కు తెలంగాణలో ప్రాధాన్యత తక్కువ. 95 శాతం జోనల్​సిస్టం ప్రకారం స్థానికులకే ఉద్యోగాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వర్సిటీ నుంచి సర్టిఫికెట్​పొందిన విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సర్టిఫికెట్​తీసుకొని ఉద్యోగాలకు వెళ్లినా నాన్​లోకల్​కిందికి వస్తారు కాబట్టి అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ విషయం తెలియక గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

రాష్ట్రంలో నేడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డబ్బులతోనే ముడిపడి ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, కేవలం పరీక్షలకు హాజరైతే చాలనే వెసులుబాటు ఉండటం వల్ల విద్యార్థులంతా డిస్టెన్స్​ఎడ్యుకేషన్​వైపునకే మొగ్గుచూపుతున్నారు. దానికి తోడు పరీక్షలు సైతం చూసి రాసే అవకాశాన్ని కల్పించడం, ఎక్కువ పర్సంటేజీలు తెచ్చుకోవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. అందుకే దూరవిద్యకే సై అంటున్నారు. దీన్ని నాగార్జున యూనివర్సిటీతో పాటు పలు ప్రైవేట్​వర్సిటీలు క్యాష్ చేసుకుంటున్నాయి.

ఇష్టారాజ్యంగా ప్రైవేట్​కళాశాలలకు సబ్​సెంటర్లను కేటాయించేందుకు డబ్బుల దండుకోవడమే కాక, పరీక్ష కేంద్రాలను నిర్వాహకులకు నచ్చిన ప్రాంతంలో కేటాయించేందుకు రూ.2.50 లక్షలు అధికారులకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణకు సిటీలో అయితే ఇబ్బంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలనే నిర్వాహకులు ఎంచుకుంటున్నారు. అక్కడైతే గుట్టు చప్పుడు కాకుండా దర్జాగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఎంత డబ్బైనా సరే ఇచ్చేందుకు నిర్వాహకులు వెనుకాడటం లేదని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాలను నిర్వహిస్తే రూ.5 లక్షలు జరిమానా, క్రిమినల్​కేసుతో పాటు అఫిలియేషన్​రద్దు చేస్తామని చెప్పినా నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు.

ఈజీగా సర్టిఫికెట్ల కోసమే..

ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల దూరవిద్య కేంద్రాల్లో విద్యార్థులు చేరొద్దు. విద్యార్థులు ఈజీగా సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు పలు ప్రైవేట్​వర్సిటీలను ఆశ్రయిస్తున్నారు. కానీ, తెలంగాణలో ఆ సర్టిఫికెట్లకు ప్రాధాన్యం తక్కువ. నాన్​లోకల్ కిందికి వెళ్తారు కాబట్టి ఉద్యోగావకాశాలు కూడా తగ్గుతాయి. ఇప్పటికే ఎన్నో ప్రెస్ మీట్‌లు పెట్టి అవగాహన కల్పించాం. ఇప్పటికైనా విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్తపడాలి.
ప్రొఫెసర్​ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్.​

యూజీసీకి ఫిర్యాదు చేస్తాం..

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సరైన అవగాహన లేక నాగార్జున వర్సిటీ డిస్టెన్స్​ఎడ్యుకేషన్‌లో చేరుతున్నారు. పలువురు అధికారులు, మేనేజ్‌మెంట్లు కోట్ల రూపాయలు విద్యార్థుల నుంచి దోచుకుంటున్నారు. ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విషయమై నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం డైరెక్టర్‌పై యూజీసీకి ఫిర్యాదు చేస్తాం.
-ప్రేమ్​కుమార్, ఓయూ రీసెర్చ్​స్కాలర్

 

Tags:    

Similar News