ఆ వివాదాలకు కాంట్రాక్టర్లే కారణం- బీజేపీ నేత
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కాంట్రాక్టర్లే కారణమని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అన్నారు. అక్కడా, ఇక్కడా పని చేస్తూ రాష్ట్రాల మధ్య రాయబారం చేస్తూ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల న్యాయమైన వాటా.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు కాంట్రాక్టర్లే కారణమని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అన్నారు. అక్కడా, ఇక్కడా పని చేస్తూ రాష్ట్రాల మధ్య రాయబారం చేస్తూ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల న్యాయమైన వాటా.. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య మెఘా సంస్థ రాయబారం చేస్తుందని, రెండుచోట్లా కాంట్రాక్ట్ పనులు చేస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో తెలంగాణ తరుపున ఏపీ సీఎం జగన్‌కు నిధులు సమకూర్చారని, ఈ నిధులను మెఘా సంస్థ మధ్యవర్తిత్వంతోనే వెళ్లాయని ఆరోపించారు.
ఒక రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేస్తూ మరో రాష్ట్రంలో కూడా పనులు చేయడానికి అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, దీనిపై జీవో జారీ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. నిర్మాణ సంస్థలే జల వివాదాలకు ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. కృష్ణా జలాలను దోచుకుంటున్నారని ఏడేండ్ల తర్వాత కేసీఆర్‌కు గుర్తుకు వచ్చిందని, కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిస్థాయిలో ఎందుకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. ఇదంతా రెండు రాష్ట్రాలు ఆడుతున్న నాటకమన్నారు.
నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ దొంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కృష్ణాలో తెలంగాణకు ఎక్కువ వాటా రావాల్సి ఉందని, కానీ ఏపీకి న్యాయం చేసేందుకు తెలంగాణ తలొగ్గిందన్నారు. అసలు జల వివాదాలకు కారణం రాజకీయ ప్రయోజనాలేనన్నారు. ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో పార్టీ పెట్టకుండా సీఎం కేసీఆర్.. జగన్‌పై ఒత్తిడి తీసుకువచ్చారని, అందుకు రాజీ కుదరకపోవడంతోనే ఈ వివాదాలు బయటకు వచ్చాయన్నారు. ఈ నీళ్ల సెంటిమెంట్‌ను రగిలించి రెండు రాష్ట్రాలూ రాజకీయంగా లబ్ధి పొందుతాయని విమర్శించారు. ఈ సందర్బంగా కృష్ణా జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన సంఘాలు, నేతలు, ఇరిగేషన్ నిపుణులు పాల్గొన్నారు.