టీఆర్ఎస్ పార్టీది రాష్ట్రమంతా ఒకరకంగా ఉంటే.. ఇక్కడ మాత్రం డిఫరెంట్
దిశ, సత్తుపల్లి టౌన్: టీఆర్ఎస్ పార్టీది రాష్ట్రమంతా ఒకరకంగా ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మరోరకం. పార్టీలో దాదాపు అందరూ ఉద్దండులు కావడం.. అందరికీ ఘనమైన చరిత్ర ఉండడం.. ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం రాజుకుంది. గతంలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచినా ఈ మధ్య కాలంలో ఒకరంటే మరొకరికి గిట్టని […]
దిశ, సత్తుపల్లి టౌన్: టీఆర్ఎస్ పార్టీది రాష్ట్రమంతా ఒకరకంగా ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం మరోరకం. పార్టీలో దాదాపు అందరూ ఉద్దండులు కావడం.. అందరికీ ఘనమైన చరిత్ర ఉండడం.. ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి.
తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం రాజుకుంది. గతంలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచినా ఈ మధ్య కాలంలో ఒకరంటే మరొకరికి గిట్టని స్థాయికి పరిస్థితి దిగజారింది. సుమారు ఒక ఏడాదిగా ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తన పర్యటన సందర్భంగా కలుస్తున్న కార్యకర్తలపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరిట కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్లెక్సీని తొలగించడం పట్ల టీఆర్ఎస్ లోని ఆయన వర్గం మండిపడుతోంది. మున్సిపల్ కమిషనర్ తీయమన్నారంటూ సత్తుపల్లి మున్సిపల్ సిబ్బంది సదరు ఫ్లెక్సీని తొలగించడంపై పొంగులేటి వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పైగా పూర్తి అయిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరిట ఫ్లెక్సీని తొలగిస్తున్నారంటూ ప్రచారం చేయడం వెనుక ఎవరికి ఏ ఉద్దేశాలు ఉన్నాయో అందరికీ తెలుసంటూ పొంగులేటి వర్గం సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతోంది.
ఇప్పటికే రకరకాల ఇబ్బందులతో సతమతమవుతున్న టీఆర్ఎస్ లో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గంలో తాజాగా తలెత్తుతున్న పరిణామాలు పార్టీ క్యాడర్‌లో ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ నుంచి సత్తుపల్లిలో గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్యతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తొలిరోజుల్లో మంచి సంబంధాలే ఉండేవి. వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి ఇక్కడ సమస్యలు మొదలైనట్టు చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన మట్టా దయానంద్ అప్పటి నుంచి పొంగులేటికి సన్నిహితునిగా ఉండడం, గతంలో సండ్ర వెంకటవీరయ్య మద్దతుతో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన మువ్వా విజయ్‌బాబు పదవీ కాలం పూర్తయిన అనంతరం పొంగులేటి వర్గంలో కొనసాగుతుండడం ఎమ్మెల్యే సండ్రపై ఒకరకమైన వత్తిడి పెరిగినట్లయింది. నిజానికి ఇప్పటికి మూడు సార్లు సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర.. దాదాపు ప్రతిసారీ ఒక ముఖ్య నాయకుని మద్దతుతోనే గట్టెక్కారని చెప్పొచ్చు.
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా చెప్పుకునే సత్తుపల్లిలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గం మద్దతుతోనే గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన జలగం వెంగళరావు మొదలు, తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులు రాజకీయాలు చేయగలిగారని చెబుతుంటారు. ప్రాబల్య వర్గాల పట్ల చాలా జాగ్రత్తగా మెలుగుతూ, మూడుమార్లు గెలిచిన సండ్రకు ఇక్కడ సహజంగానే ప్రత్యేక వర్గం ఏర్పాటైంది. గతంలో ఎవరి పార్టీల్లో వాళ్లు ఉండడం వల్ల పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అందరూ ఒకే పార్టీలోకి వచ్చాక నేతలకు కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. పరస్పర ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసిన సండ్ర, మట్టాలు ఇప్పుడు ఒకే పార్టీలో ఇమడలేకపోవడం.. మట్టా దయానంద్‌కు పొంగులేటి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తుండడం, పైగా తాజాగా విజయ్‌బాబు వీరికి జత కలవడం.. ఈ పరిణామాలు సహజంగానే సండ్రకు తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు.
దీంతో తన స్థాయిలో ఎక్కడ ఎలాంటి చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, పొంగులేటి, దయానంద్, విజయ్‌బాబులు ఉన్న ఫ్లెక్సీని తొలగించడం పట్ల పొంగులేటి వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిల్ తన చేతిలో ఉండడంతోనే ఎమ్మెల్యే ఇలాంటివి చేస్తున్నారని.. పైగా పూర్తయిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పరస్పరం దూషణల పర్వం కొనసాగుతోంది. నేతలకు చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ఎవరిదీ ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీ లేకుండా తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోజురోజుకూ రకరకాల మలుపులు తీసుకుంటున్న రాజకీయ ఆధిపత్య ధోరణులు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయోనన్న ఆందోళన సగటు కార్యకర్తల్లో వ్యక్యం అవుతోంది.