మున్సిపాలిటీలో వసూల్ రాజాలు.. వారికి ఆ టీఆర్ ఎస్ నేతల అండ..
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మున్సిపాలిటీలో ఓ ఐదుగురు అధికారుల అవినీతి బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. లంచాలకు మరిగిన ఆ ఐదుగురు అధికారులు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో, ఇంటి పర్మిషన్, పేరు మార్పిడిలలో అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఏపని జరగాలన్న ఆ ఐదుగురుతోనే పని జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ ఐదుగురికి చేయి తడపనిదే పర్మిషన్ఇవ్వరని […]
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మున్సిపాలిటీలో ఓ ఐదుగురు అధికారుల అవినీతి బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. లంచాలకు మరిగిన ఆ ఐదుగురు అధికారులు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో, ఇంటి పర్మిషన్, పేరు మార్పిడిలలో అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కార్యాలయంలో ఏపని జరగాలన్న ఆ ఐదుగురుతోనే పని జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ ఐదుగురికి చేయి తడపనిదే పర్మిషన్ఇవ్వరని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు.
ఇంటి పేరు మార్పిడిలో సదరు అధికారులు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని టాక్ మండలంలో జోరుగా వినపడుతోంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే సస్పెండ్ అయిన అధికారి మళ్లీ మణుగూరుకే పోస్టింగ్ పై రావడం. ఆ పోస్టింగ్ వెనుక ఇద్దరు టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మండలంలో ఇద్దరు టీఆర్ఎస్ కీలక నేతలు మున్సిపాలిటీని శాసిస్తున్నారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతలు చెప్పిన పని చేయని అధికారులను బదిలీ చేయిస్తారని కొంతమంది ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆ ఐదుగురు అధికారులు ఈ ఇద్దరు టీఆర్ఎస్ నేతలకి అప్డేట్ ఇస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఎంత మంది అధికారులకు ట్రాన్ఫర్లు అయినా ఈ ఐదుగురికి మాత్రం ట్రాన్ఫర్లు కావని ప్రజలు, పలువురు నాయకులు గుసగుసలాడుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీలో హవా మొత్తం ఆ టీఆర్ఎస్ నేతలు, ఈ ఐదుగురు అధికారులదే నడుస్తుంతోందని ప్రజలు అంటున్నారు.
కమిషనర్ ను బదిలీ చేయాలని భారీ స్కెచ్…
మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ నాగ ప్రసాద్ ని బదిలీ చేయాలని ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతలు, ఈ ఐదుగురు అధికారులు భారీ స్కెచ్ వేస్తున్నారనే టాక్ మండలంలో సంచలనంగా మారింది. వీరందరి అవినీతి పనులకు కమిషనర్ అడ్డుపడుతున్నాడని, అందుకే కమిషనర్ పై భారీ స్కెచ్ వేశారనే ఊహాగానాలు మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. ఒక వైపు కమిషనర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ, ప్రజల సమస్యలను వెంటనే తీర్చుతున్నాడని ప్రజలు, పలువురు మేధావులు వెల్లడిస్తున్నారు. మరి ఎందుకు కమిషనర్ నాగప్రసాద్ పై భారీ స్కెచ్ వేశారనేది మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఆ ఇద్దరి టీఆర్ఎస్ నేతలు, ఈ ఐదుగురి అధికారులు మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ఐదుగురి అవినీతి అక్రమాలపై నిఘా పెట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు, పలు మేధావులు కోరుతున్నారు.