కలిసిపోయిన సోయం, రాథోడ్.. ఆదివాసీ, లంబాడాల పరిస్థితేంటి..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఒకరేమో ఆదివాసీలను అన్నీ తానై నడిపించే నేత, తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. మరొకరేమో లంబాడాల హక్కులకు అండగా నిలిచిన నాయకుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్.. ఇప్పటి వరకు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండగా.. తమ జాతి, తెగల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడారు.. ఇంతకాలం ఎవరి ఓటు బ్యాంకు వారిదే.. తాజాగా ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుందోననే […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఒకరేమో ఆదివాసీలను అన్నీ తానై నడిపించే నేత, తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. మరొకరేమో లంబాడాల హక్కులకు అండగా నిలిచిన నాయకుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్.. ఇప్పటి వరకు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండగా.. తమ జాతి, తెగల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసం పోరాడారు.. ఇంతకాలం ఎవరి ఓటు బ్యాంకు వారిదే.. తాజాగా ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుందోననే చర్చ మొదలైంది.
రాథోడ్ రమేష్ బీజేపీలో చేరటంతో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. సోయం, రాథోడ్ మధ్య సయోధ్య కుదిరినా.. వారు ప్రాతినిధ్యం వహించే తెగల మధ్య సయోధ్య, సమన్వయం సాధించటం కష్టమేనని తెలుస్తోంది.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడటమే అసలు సమస్యగా మారింది..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు, సమస్యలకు తెరలేచింది. సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కాంగ్రెసును వీడి బీజేపీలో చేరటంతో ఆ పార్టీతో పాటు జిల్లా రాజకీయాల్లోనే సమీకరణాలు మారిపోతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాల కాలంగా ఆదివాసీ, లంబాడా తెగల మధ్య వివాదం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో తమ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను లంబాడాలు పొందుతున్నారని.. రిజర్వేషన్లు వర్తించవద్దని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు వచ్చిన రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. వాటిని ఎలా అడ్డుకుంటారని లంబాడాలు పేర్కొంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఆదివాసీల హక్కుల పరిరక్షణ, లంబాడాలకు రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా తుడుం దెబ్బ అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పోరాటం చేస్తున్నారు. ఇక లంబాడాల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మద్దతుగా నిలబడుతూ వచ్చారు.
గత కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదానికి.. ఏ వర్గం నాయకులు ఆ వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోయం బాపురావు గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలో ఉండగా.. తాజాగా బీజేపీలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బోథ్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోగా.. 2019పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ఆదివాసీ తెగకు చెందిన ఆయన తమ జాతి ప్రయోజనాలు, హక్కుల కోసం తుడుం దెబ్బ అధ్యక్షుడిగా, ఎంపీ హోదాలో పోరాడుతున్నారు.
ఇక లంబాడా తెగకు చెందిన రాథోడ్ రమేష్ గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఉండగా.. తాజాగా బీజేపీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఖానాపూర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుకాగా.. ఒకరు ఆదివాసీల, మరొకరు లంబాడాల మద్దతుతో బరిలో దిగారు. చివరికి బీజేపీ నుంచి బరిలో దిగిన సోయం బాపురావు ఎంపీగా గెలిచారు.
తాజాగా రాథోడ్ రమేష్ బీజేపీలో చేరగా.. ఆయన రాకను సోయం బాపురావు అడ్డుకున్నారు. కేంద్ర నాయకత్వంతో మాట్లాడి కొంతకాలం ఆయన చేరికకు అడ్డుగా నిలిచారు. చివరికి రాథోడ్ రమేష్ స్వయంగా సోయం బాపురావు వద్దకు వెళ్లి మంతనాలు జరిపాక.. కొద్దిరోజులకు ఆయన బీజేపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. ఆదివాసీ, గిరిజన నాయకులు ఇద్దరు ఇంతకాలం వేర్వేరు పార్టీల్లో ఉండగా.. ఎవరి ఓటు బ్యాంకు వారికుండేది. తాజాగా ఇద్దరు బీజేపీలో ఉండటంతో.. నేతల మధ్య సయోధ్య కుదిరిందనే సంకేతాలిచ్చారు.
నాయకులు కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆదివాసీ, లంబాడా తెగల మధ్య సమన్వయం, సయోధ్య లేదు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇరువర్గాల మధ్య వివాదాలు, ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు ఎవరి పక్షాన నిలబడతారు.. బీజేపీ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుందనే చర్చ మొదలైంది.
ఆదివాసీలు, లంబాడాల ముఖ్య నాయకులు బీజేపీలో ఉండగా.. వారు ఓట్ల పరంగా బీజేపీకే మద్దతుగా ఉంటారా.. వేరే పార్టీకి అనుకూలంగా మారుతారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇరు వర్గాల మధ్య రిజర్వేషన్ల వివాదం ఉండగా.. దీనిని క్షేత్రస్థాయిలో సయోధ్య కష్టమే. రాజ్యాంగపరంగా మార్పులు చేయటం ఏ మేరకు సాధ్యం. తర్వాత తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రెండు తెగలకు చెందిన కీలక నేతలు ఒకే పార్టీలో ఒకే వేదికపై చేరినా.. క్షేత్రస్థాయిలో తెగల పంచాయితీ తేల్చటం కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ఆదివాసీ నాయకులను రాథోడ్ రమేష్ మొదటి నుంచి పట్టించుకోరని.. తాజాగా బీజేపీలో చేరాక ఆదివాసీ నాయకుల ఫొటోలు ఫ్లెక్సీల్లో పెట్టడం లేదనే చర్చ మొదలైంది. ఇది కూడా సరికొత్త వివాదానికి తెరలేపుతోంది.