ఎరువు… ఇక బతుకు‘తెరువు’
దిశ, కరీంనగర్: అచేతనావస్థకు చేరిన ఆ పరిశ్రమ గత వైభవాన్ని సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్మిక క్షేత్రం సిగలో అంతర్థానం అయిన నగకు మెరుగులు దిద్దినట్లయింది. దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్‌కు మోక్షం కలిగింది. సాకారమవుతున్న ఆ కల ఏంటంటే.. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం. ఈ కర్మాగారం ఇప్పుడు తిరిగి ఎరువుల ఉత్పత్తికి రెడీ అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్‌సీఎల్) ప్రారంభానికి సిద్ధమవుతోంది. […]
దిశ, కరీంనగర్: అచేతనావస్థకు చేరిన ఆ పరిశ్రమ గత వైభవాన్ని సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్మిక క్షేత్రం సిగలో అంతర్థానం అయిన నగకు మెరుగులు దిద్దినట్లయింది. దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్‌కు మోక్షం కలిగింది. సాకారమవుతున్న ఆ కల ఏంటంటే.. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం. ఈ కర్మాగారం ఇప్పుడు తిరిగి ఎరువుల ఉత్పత్తికి రెడీ అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్‌సీఎల్) ప్రారంభానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరత తీర్చేందుకు కిసాన్ యూరియాగా రైతుల ముందుకు వస్తున్న ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్ స్టోరీపై ఓ లుక్కేద్దాం.
గ్యాస్ బేస్ ప్లాంట్..
పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణాలు పూర్తయిన చోట ట్రయల్స్ వేశారు. అవి సఫలం కావడంతో ఉత్పత్తికి తొలి అడుగు పడినట్లయింది. ఈ ఫ్యాక్టరీలో అమోనియా ఉత్పత్తికి డెన్మార్క్ టెక్నాలజీ, యూరియా ఉత్పత్తికి ఇటలీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దాదాపు 373 యంత్రాలను ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. గతంలో కోల్ బేస్డ్ ప్రాజెక్టుగా ఉన్న ప్లాంట్‌ను ఆధునీకరించి గ్యాస్ బేస్ ప్లాంట్‌గా నిర్మించారు. 6,120 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న ఎరువుల కర్మాగారంలో ఎన్‌ఎఫ్‌సిఎల్ 26 శాతం, ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 26 శాతం, ఎఫ్‌సిఐ 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం 10 శాతం, జీఏఐఎల్ 14.3 శాతం, హల్దార్ టాప్స్ 11.07 శాతం పెట్టుబడులు పెట్టాయి. కూలింగ్ టవర్, రా వాటర్, గ్యాస్ పనులు, బ్యాగింగ్ పనులు పూర్తయ్యాయి. యూరియా తయారీలో కీలకమైన ఫ్రిల్లింగ్ టవర్ 134 మీటర్ల ఎత్తులో, ఫ్లెర్ స్ట్రిక్‌ను 60 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌సిఐ 1980లో ఉత్పత్తిని ప్రారంభించింది. కానీ, నష్టాల కారణంగా 1999 మార్చి 31న మూతపడింది. 2015 సెప్టెంబర్ 15 జీరో డేట్‌గా నిర్ణయించిన కేంద్రం 2016 ఆగస్ట్ 7న ప్రధాని మోడీ గజ్వేల్‌లో ఆన్‌లైన్ ద్వారా ఆర్ఎఫ్‌సీఎల్‌కు శంకుస్థాపన చేశారు. గ్యాస్ ఆధారిత ప్లాంట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా గ్యాస్ పైప్‌లైన్‌ను వేసి గ్యాస్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశారు.
లక్ష్యం ఇది..
వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల టన్నుల లక్ష్యంగా కేంద్రం నిర్దేశించింది. తెలంగాణకు వాటా 6 లక్షల టన్నులు. రోజుకు అమోనియా ఉత్పత్తి 2,200 టన్నులు, యూరియా ఉత్పత్తి 3,850 టన్నులు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులు లోపాలను సరి చేసుకుంటూ ప్లాంట్ ప్రారంభించే దిశగా ముందుకెళ్తున్నారు. ఈ పరిశ్రమంలో అత్యంత కీలకమైనవి యూరియా, అధునాతన టెక్నాలజీతో నిర్మాణం జరుగుతున్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్‌లో ప్లాంట్ నడిపించడానికి కంట్రోలో రూంను ఏర్పాటు చేశారు. యూరియా ఉత్పత్తిలో జరిగే ప్రక్రియలన్ని ఈ కంట్రోల్ రూం నుంచి ఆపరేట్ చేస్తారు.
తీరనున్న ఎరువుల కొరత
ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైతే దేశంలోని రైతాంగానికి ఎరువుల కొరతను తీర్చేందుకు ఈ ఫ్యాక్టరీ తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చనుంది. కిసాన్ యూరియా పేరుతో ఇక్కడ ఉత్పత్తి అయిన ఎరువులను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీఏ 2లోనే ఖాయిలా పడ్డ ఈ పరిశ్రమను పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పెద్దపల్లి ఎంపీ జి.వివేక్.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ఒప్పించడంలో సఫలం అయ్యారు. బకాయిలను తీర్చడంతో పాటు ఈ పరిశ్రమను తిరిగి తెరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వాటా పొందడం వల్ల రాష్ట్ర కర్షకులకు ఎరువుల కొరత తీర్చే ప్రయత్నం చేసింది. ఇందుకోసం కాళేశ్వరం జలాలను, అవసరమైన విద్యుత్‌ను కూడా ఈ పరిశ్రమకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గ్యాస్ ఆధారిత పరిశ్రమగా చరిత్రకెక్కబోతున్న రామగుండం ఎరువుల కర్మాగారం కొత్త శోభను సంతరించుకోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధికి కల్పించే అవకాశం ఉంటుంది.