కరీంనగర్ పోలీసుల వినూత్న ప్రోగ్రాం.. ఇంకా వివరాలేమైనా కావాలా సార్..?
దిశ. కరీంనగర్: హలో నమస్కారమండి.. నేను కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను సార్.. ఈ ఠాణాలో ఫలానా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నా పేరు ఇదండి. మీరు మా స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. మీరిచ్చిన దరఖాస్తును అనుసరించి మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశామండి. మీ ఫిర్యాదు మేరకు నిందితుల గురించి వాకబు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నాం. మీరు నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీటు కూడా త్వరలో కోర్టులో సమర్పిస్తాం. ఇంకా […]
దిశ. కరీంనగర్: హలో నమస్కారమండి.. నేను కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను సార్.. ఈ ఠాణాలో ఫలానా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నా పేరు ఇదండి. మీరు మా స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. మీరిచ్చిన దరఖాస్తును అనుసరించి మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశామండి. మీ ఫిర్యాదు మేరకు నిందితుల గురించి వాకబు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నాం. మీరు నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీటు కూడా త్వరలో కోర్టులో సమర్పిస్తాం. ఇంకా వివరాలేమైనా కావాలా సార్..? ఉంటాను సార్ నమస్కారం..
ఇక కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి ఫిర్యాదు దారులకు ఈ విధమైన ఫోన్లు రానున్నాయి. కేసుల పరిశోధన, వాటిపై పోలీసులు ఏ విధంగా దృష్టి సారించాలన్న ఆలోచనతో సీపీ కమలాసన్ రెడ్డి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల 10న ‘ఫీడ్ బ్యాక్’ డే పేరిట ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనివల్ల ఫిర్యాదు చేసిన వారికి వారి కేసు పురోగతి తెలిసే అవకాశం ఉండడంతో పాటు, పోలీసుల పారదర్శకత ఎలాంటిదో చేతల్లో చూపాలని నిర్ణయించారు. కొత్తగా అమలు చేయనున్న ఈ పద్ధతిని ఖచ్చితంగా ప్రతి ఠాణాలో అమలు చేయాల్సిందేనని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు పరిశోధనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించడం వల్ల వారు సంతృప్తి చెందే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దరఖాస్తు ఇచ్చిన తరువాత సార్ మా కేసేమైంది..? అని అడిగేందుకు ఠాణాల చుట్టూ తిరగాల్సి వచ్చే పద్ధతికి బ్రేకు పడనుండి. పోలీసులే ఫోన్ చేసి సమాచారం అందిస్తుండడంతో ఫిర్యాదు దారులు కాల్ రిసీవ్ చేసుకుంటేనే కేసు పూర్వాపరాలు తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఆకస్మిక తనిఖీలు..
వినూత్నంగా సీపీ కమలాసన్ రెడ్డి చేపట్టిన ‘ఫీడ్ బ్యాక్’ డే ప్రోగ్రాంపై సీపీ ప్రత్యక్షంగా పరిశిలీంచే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందో కూడా తెలుసుకుంటారు. దీనివల్ల పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉండదని సీపీ భావిస్తున్నారు. నూతనంగా అమలు కానున్న ఈ విధానం వల్ల పోలీసుల్లో మరింత జవాబుదారీ తనం పెరుగుతుందన్న ఆలోచనతోనే చేపట్టినట్టు ఆయన తెలిపారు.