ఇది మందుబాబుల అడ్డా కాదు.. రైతు బజార్..

దిశ, నర్సంపేట : నియోజక వర్గంలోని నర్సంపేట పట్టణంలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్ అందుబాటులో లేదు. పట్టణంలో చాలా వరకు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా కొనుగోలు ప్రాంతాల్లో రద్దీ, ట్రాఫిక్ సమస్య పెరుగుతూ వస్తోంది. నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో ప్రతీ ఆదివారం జరిగే మార్కెట్ కి పట్టణం నుండే కాకుండా డివిజన్ లోని ఆరు మండలాల్లోని గ్రామాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రజలకు నాణ్యమైన, […]

Update: 2021-11-04 11:22 GMT

దిశ, నర్సంపేట : నియోజక వర్గంలోని నర్సంపేట పట్టణంలో ఏటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్ అందుబాటులో లేదు. పట్టణంలో చాలా వరకు రోడ్లపైనే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా కొనుగోలు ప్రాంతాల్లో రద్దీ, ట్రాఫిక్ సమస్య పెరుగుతూ వస్తోంది. నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో ప్రతీ ఆదివారం జరిగే మార్కెట్ కి పట్టణం నుండే కాకుండా డివిజన్ లోని ఆరు మండలాల్లోని గ్రామాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయల ని అందించడానికి మోడల్ రైతు బజార్ ని రూ. 2కోట్లతో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా మోడల్ రైతు బజార్ ఏర్పాట్లను సైతం త్వరితగతిన పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ మాడల్ రైతు బజార్ ని ప్రారంభించారు.

మందుబాబులకు అడ్డా..
నర్సంపేట పట్టనవాసులకు నాణ్యమైన కూరగాయల్ని అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్ మందు బాబులకు అడ్డాగా మారింది. మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి ఐదు నెలలు దాటినా నేటికీ అందులో క్రయవిక్రయాలు జరగట్లేదు. ఎప్పటిలాగానే రోడ్లపై అమ్మకాలు కొనసాగుతున్నాయి. మోడల్ రైతు బజార్ వినియోగంలో లేకపోవడంతో అపరిశుభ్రంగా మారిపోయింది. ఇది అదనుగా భావించిన మందు బాబులు దీన్ని అడ్డాగా చేసుకున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.

ఆర్భాటం చేశారు.. వదిలేశారు.
మోడల్ రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో పట్టణ ప్రజలు సంతోషపడ్డారు. తాజా కూరగాయలు సరసమైన ధరలకు, నాణ్యమైనవి దొరుకుతాయని ఆశ పడ్డారు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆర్భాటంగా మొదలెట్టారు కానీ ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు. లక్షల ప్రజాధనం వృథా అయ్యిందని పట్టనవాసులు వాపోతున్నారు.

రోడ్డు మీదే పార్కింగ్..
నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న అంగడి సెంటర్ లో రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి. మోడల్ రైతు బజార్ వినియోగంలో లేకపోవడంతో కూరగాయలు అమ్ముకునే వారు పోటీలు పడి మరీ రోడ్లపైకి వస్తున్నారు. మార్కెట్ కి వచ్చే వినియోగదారులు తమ వాహనాల్ని రోడ్లపై పార్కింగ్ చేయడంతో నిముషాల్లోనే ఈ ప్రాంతమంతా రద్దీగా మారిపోతోంది. మార్కెట్ కి సరైన పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, రోడ్డు పక్కనే కూరగాయలు అమ్ముతుండటంతో ఆదివారం వచ్చిందంటే చాలు అంగడి సెంటర్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరుగిపోతోంది.

పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి..
ఉదయం పూట కూరగాయల కోసం వచ్చే వారి ద్విచక్ర వాహనాలతో అంగడి సెంటర్ అంతా కిక్కిరిసిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి పోలీసులు రాంగ్ పార్కింగ్ పేరిట చలానాలు వేస్తుండటం కొనుగోలు దారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. చవకగా కూరగాయలు కొనడానికి వస్తే వందలకు వందలు జరిమానాలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News