తెలంగాణ సరిహద్దుల్లో రైతులను ముంచే దందా..!

దిశ, తెలంగాణ బ్యూరో : సరిహద్దులు నకిలీ విత్తన దందాకు రాచమార్గాలవుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక.. మరోవైపు ఏపీ ప్రాంతాల నుంచి రైతులను ముంచేందుకు నకిలీ విత్తనాలతో దిగుతున్నారు. మరోవైపు ఈ నకిలీ విత్తన దందాలో అధికార పార్టీకి చెందిన నేతలు ఉండటం మరో వివాదం. నకిలీ పత్తి విత్తన దందాకు మారుపేరైనా గద్వాల జిల్లాలో ఇటీవల భారీగా విత్తనాలు బయట పడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేత, అక్కడి ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన […]

Update: 2021-06-08 13:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సరిహద్దులు నకిలీ విత్తన దందాకు రాచమార్గాలవుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక.. మరోవైపు ఏపీ ప్రాంతాల నుంచి రైతులను ముంచేందుకు నకిలీ విత్తనాలతో దిగుతున్నారు. మరోవైపు ఈ నకిలీ విత్తన దందాలో అధికార పార్టీకి చెందిన నేతలు ఉండటం మరో వివాదం. నకిలీ పత్తి విత్తన దందాకు మారుపేరైనా గద్వాల జిల్లాలో ఇటీవల భారీగా విత్తనాలు బయట పడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేత, అక్కడి ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన కాటన్ ఇండస్ట్రీస్‌‌లోనే ఈ నకిలీ విత్తనాలు దొరికాయి. అందుకే ఈ కేసును పక్కదారి పట్టించేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. మరోవైపు ఇటు మహారాష్ట్ర నుంచి కూడా సోయా, పత్తి విత్తనాలు వస్తున్నాయి. ప్రతి ఏటా ప్రత్యేక బృందాలు, టాస్క్​ఫోర్స్​ వేసినట్లు ప్రకటిస్తున్నా ఈ నకిలీ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో రూ. 70 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. మరోవైపు ఖమ్మంలో కూడా సోమవారం సాయంత్రం రూ. 16.46 లక్షల విలువచేసే నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాగు సంబురంలోనే దందా

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుంద‌ని సంతోషిస్తున్న రైతుల‌ను న‌కిలీ దందా న‌ట్టేట ముంచేస్తోంది. ఏటేటా రాష్ట్రంలో సాగు పెరుగుతున్నా.. అదే స్థాయిలో నకిలీ విత్తన వ్యాపారం కూడా యథేచ్ఛగా సాగుతోంది. రైతులు తీవ్ర న‌ష్టాల‌ను చ‌విచూడాల్సి వచ్చేందుకు ఇది కూడా ప్రధాన కారణమవుతోంది. న‌కిలీ విత్తనాలు విక్రయిస్తూ ప‌ట్టుబ‌డ్డ వారిపై అధికారులు క‌ఠిన చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం కూడా దందా విస్తరణకు మార్గమవుతోంది. ఇప్పటివ‌ర‌కు వ్యవసాయ గ‌ణాంకాల ప్రకారం 436 మందిపై కేసులు న‌మోదైయ్యాయి.

కేసులెన్ని.. పట్టుబడిన వాళ్లెందురు..?

నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ ప‌ట్టుబ‌డ్డ న‌కిలీ కేటుగాళ్లు, న‌మోద‌వుతున్న కేసుల మ‌ద్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. న‌కిలీ మందులు, విత్తనాల విష‌యంలో వ్యవ‌సాయ శాఖ‌లోని కొంత‌మంది అధికారుల అండ‌దండ‌లు ఉండ‌డంతోనే న‌కిలీగాళ్లు హ‌ద్దులు మీరి వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలు, మండ‌లాల వారీగా ఉన్న దుకాణాల‌పై వ్యవ‌సాయ అధికారులు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గత యాసంగి సీజ‌న్‌లో కంపెనీ మందు డ‌బ్బాల‌ను పోలి ఉన్న వాటిలోనే న‌కిలీ మందుల‌ను విక్రయిస్తూ ప‌ట్టుబ‌డ్డ వారిపై ఎలాంటి చ‌ర్యలు తీసుకున్నారన్నది ఇంత‌వ‌ర‌కూ ప్రక‌టించ‌లేదు. ఇదే క్రమంలో ప‌ట్టుబ‌డ్డ వారందరిపైనా కేసులు న‌మోదుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కేసులు న‌మోదు కాక‌పోవ‌డంతోనే న‌కిలీగాళ్లకు, అధికారుల‌కు మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాలు తేట‌తెల్లమ‌వుతున్నాయంటూ విమర్శలున్నాయి. ఈ ఐదేండ్ల కాలంలో మొత్తం 420 మందిని అరెస్టు చేయ‌గా, 75 మందిని 6ఏ కింద బుక్ చేసిన‌ట్టు వ్యవ‌సాయ గ‌ణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి ఏటా న‌కిలీ మందులు, విత్తనాలు రైతుల‌ను ఆగం చేస్తూనే ఉన్నాయి. ఇక ప‌ట్టుబడుతున్న వారంద‌రిపై కేసుల తీవ్రత అంతంత‌మాత్రంగానే ఉండ‌డంతో కేసు న‌మోదైన‌ప్పటికీ వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌ళ్లీ వ్యాపారం చేస్తున్నారు. మొద‌టిసారి ప‌ట్టుబ‌డ‌డంతో అధికారుల‌తో సాన్నిహిత్యం పెర‌గ‌డంతో పాటు దొంగదారులు తెల‌వ‌డంతో పాటు నెట్​వ‌ర్క్ పెర‌గ‌డంతో వ్యాపారం రాచమార్గంలో సాగుతోంది.

వ్యవసాయ శాఖ, పోలీస్​ కేసులకు భారీ తేడా

నకిలీ విత్తనాల కేసులో 2017లో 49, 2018లో 44, 2019లో 56, 2020లో 259, 2021లో ఇప్పటివ‌ర‌కు 28 మందిని అరెస్టు చేసిన‌ట్లు వ్యవసాయ శాఖ వెల్లడిస్తుంది. వీటిలో 6ఏ కింద 2017లో 50, 2018లో 3, 2019లో 4, 2020లో 18 మందిని బుక్ చేయ‌గా 2021లో ఇప్పటివ‌ర‌కు ఒక్కరిని బుక్ చేయ‌లేదు. ప‌ట్టుబ‌డ్డ 70మంది దుకాణ‌దారుల లైసెన్స్‌లను మాత్రమే ర‌ద్దుచేసిన‌ట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది. న‌కిలీలో ప‌ట్టుబ‌డ్డ 420 మందిలో కేవ‌లం మూడు కంపెనీలు, నలుగురు వ్యక్తుల‌పై మాత్రమే అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో నామ‌మాత్రంగా కేసులు న‌మోదు చేస్తుండ‌గా, పట్టబడ్డ వారందరిపై కూడా కేసులు పెట్టడం లేద‌ని స్పష్టమవుతోంది. మొత్తం రూ. 2.50 కోట్ల విలువైన 192 క్వింటాళ్ల న‌కిలీ విత్తనాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గ‌తేడాది రూ. 8.50కోట్ల విలువైన 1885 క్వింటాళ్ల న‌కిలీ విత్తనాల‌ను స్వాధీనం చేసుకోవ‌డంతో పాటు హెచ్ టీ విత్తనాల‌కు సంబంధించి 624 శాంపిల్స్ సేక‌రించ‌గా, వీటీలో 193 న‌కిలీవిగా తేలినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

పోలీసుల లెక్క మరోలా..!

రాష్ట్ర పోలీసులు మాత్రం విత్తన నకిలీ దందాపై 602 కేసులు న‌మోదు చేసినట్లు వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటివ‌ర‌కు 602 కేసుల‌ను న‌మోదు చేయ‌గా, 27 మందిపై పిడి యాక్ట్‌ల‌ను న‌మోదు చేశారు. ఇప్పటివ‌ర‌కు పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2014లో 3 కేసులు, 2015లో 25, 2016లో 31 కేసులు, ఏడుగురిపై పీడీ యాక్ట్, 2017లో 69 కేసులు, ముగ్గురిపై పీడీ యాక్ట్, 2018లో 115 కేసులు, ఒక‌రిపై పీడీ యాక్ట్, 2019లో 160 కేసులు, ఇద్దరిపై పీడీ యాక్ట్, 2020లో 112 కేసులు, 14 మందిపై పీడీ యాక్ట్, 2021లో ఇప్పటివ‌ర‌కు 87 కేసులు న‌మోదుచేశారు.

సరిహద్దు మార్గాలు

ఆదిలాబాద్‌–మంచిర్యాల–రామగుండం–ఖమ్మం ప్రాంతాలు నకిలీ దందాకు మరింత అండగా మారుతున్నాయి. రైలుమార్గాన్ని ఆనుకుని ఉన్న ఈ దారి పొడవునా నకిలీ విత్తనాల కేసులు నమోదవుతున్నాయి. వాస్తవంగా నకిలీ విత్తనాలేవీ కూడా మన రాష్ట్రంలో తయారుకావు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకువస్తున్నట్లు గుర్తించారు. అయితే నకిలీ విత్తనాల్లో అధిక శాతం మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయి. అటు ఏపీలోని కర్నూలు కేంద్రంగా సాగుతున్న దందా కూడా గుట్టుచప్పుడు కాకుండా అనేక మార్గాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విస్తరించినట్లు ఇప్పటికే గుర్తించారు.

గద్వాలలో గలీజ్​ దందా

నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో నకిలీ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్‌లో టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసినట్లు చాలా విమర్శలు వచ్చాయి. అయితే విమర్శలు రావడం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలతో సదరు మిల్లు యజమాని, సీడ్‌ ఆర్గనైజర్, సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ బండ్ల రాజశేఖర్‌రెడ్డి (ఏ–1)పై కేసు పెట్టారు. కానీ పోలీసులు ఇక్కడే తెలివి ప్రదర్శించారు. నిందితులపై చీటింగ్‌ కేసు, విత్తన యాక్ట్‌ కిందే కేసు నమోదైంది. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్‌ చేయాలనే ఆదేశాలున్నా.. పట్టించుకోలేదు. వాస్తవంగా బండ్ల రాజశేఖర్​రెడ్డి అక్కడి ఎమ్మెల్యేకు బంధువు మాత్రమే కాకుండా.. అధికార పార్టీలో కూడా కీలక నేత. అందుకే కేసును పక్కదారి పట్టించారనే విమర్శలూ ఉన్నాయి.

Tags:    

Similar News