చార్మినార్ వద్ద బ్యాండ్ కొట్టిన పోలీసులు.. చిందులేసిన యువత
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న సండే ఫండేకు మంచి స్పందన లభిస్తుండడంతో పర్యాటకులలో జోష్ పెంచడానికి చార్మినార్ వద్ద కూడా ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. చార్మినార్ చుట్టూరా ఏర్పాటు చేసిన త్రివర్ణ రంగుల లైటింగ్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. చార్మినార్ త్రివర్ణ శోభితంలో వెలిగిపోయింది. మక్కా మసీదు, […]
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్న సండే ఫండేకు మంచి స్పందన లభిస్తుండడంతో పర్యాటకులలో జోష్ పెంచడానికి చార్మినార్ వద్ద కూడా ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. చార్మినార్ చుట్టూరా ఏర్పాటు చేసిన త్రివర్ణ రంగుల లైటింగ్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. చార్మినార్ త్రివర్ణ శోభితంలో వెలిగిపోయింది. మక్కా మసీదు, చార్మినార్ కు నలువైపులా విద్యుత్ దీపాలతో అలంకరించి త్రీడీ లైట్లను ఏర్పాటు చేశారు. చార్మినార్ కు రెండు వైపులా ఏర్పాటు చేసిన లేజర్ షోతో పర్యాటకులు ఎంజాయ్ చేశారు. ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమంలో భాగంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ముందుగా బీట్ బాక్సింగ్, పోలీస్ బ్యాండ్, ముషాయిరా కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
పోలీస్ బ్యాండ్ కు యువత కేరింతలు కొడుతూ చిందులేశారు. కళాకారులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చారిత్రాత్మక చార్మినార్ కు మూడు వైపులా లాడ్ బజార్, మక్కా మసీదు, సర్దార్ మహల్ వైపు ఎల్ ఈడీలను, గుల్జార్ హౌజ్ వైపుగా వేదికను ఏర్పాటు చేశారు. మొదటి సండే వేలాది మంది సందర్శకులతో చార్మినార్ సందడి సందడిగా మారింది. చార్మినార్ వద్ద 44 ఫుడ్ కోర్టులతోపాటు ఇతర స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. రెండు స్టాల్స్ లలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా అర్భన్ బయో డైవర్సీ ఆధ్వర్యంలో 20 రకాల 30 వేల పూల, ఔషధ మొక్కలను సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేశారు. మరొక స్టాల్ లో షీ టీమ్స్ ఆధ్వరంలో భరోసాపై అవగాహన చేపట్టారు. సందర్శకుల కోసం మొబైల్ టాయ్ లెట్స్ ఏర్పాటు చేశారు.
చార్మినార్ వద్ద చేపట్టిన ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమానికి మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, చార్మినార్ నియోజక వర్గ టీఆర్ఎస్ ఉపాధ్యక్షురాలు గుంటి మంజుల రాణి, అస్లాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ ఏక్ షామ్ చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, ట్యాంక్ బండ్ లో కూడా సండే ఫండే అద్భుతంగా ఉందని కొనియాడారు. లాల్ ఖిలా లో ఏర్పాటు చేసినట్టుగా లైటింగ్, లేజర్ షో లను ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని, గోల్కొండలో కూడా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ ఆధ్వరంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.