వృద్ధుల క్షోభకు దర్పణం

zindagi tamasa is A mirror to the distress of the elderly

Update: 2023-12-16 00:30 GMT

వృద్ధులను చిన్న సంఘటనలో, మన సమాజం ఎలా పొరబాటుగా అర్థం చేసుకొని, కేటాగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తుందో, అతనితో కుటుంబ సభ్యులు కూడా ఎంత అన్యాయంగా వ్యవహరిస్తారో జిందగి తమాషా చక్కగా చూపుతుంది.

కథేంటంటే..

కథ రాహత్ ఖ్వాజా అనే 70 ఏళ్ళు పైబడిన వృద్ధుని చుట్టూ తిరుగుతుంది. దళారి పనిలో ఉంటూ, ఇళ్ళ స్థలాలు అమ్మిపెట్టి ఆ కమిషన్‌తో కుటుంబ పోషణ చేస్తుంటాడు. భార్య మంచం పట్టి ఉంటుంది. అతనే వంటపని, ఇంటిపనులు చేసి భార్యను ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉంటాడు. కూతురు సాదత్, అల్లుడు వేరుగా ఉంటూ, కూతురు అప్పుడప్పుడు వచ్చి తల్లిని, తండ్రిని చూచి పోతూ ఉంటుంది. రాహత్ బాగా మత విశ్వాసాల ప్రకారం జీవించే వ్యక్తి. అవకాశం దొరికినప్పుడల్లా మసీదులో, ఇతర మత సమావేశాల్లో మహమ్మద్ ప్రవక్త పైన సన్నుతి గీతాలు శ్రావ్యంగా పాడుతాడు. అతను ఉండే మొహాల్లాలో సజ్జనుడని మంచి పేరుంది.

రాహత్ పరిచయస్తుల పెళ్లికి హాజరైనప్పుడు అతని సమవయస్కులు పెళ్లి మండపంలో పిచ్చాపాటి మాట్లాడుతూ, పాత మిత్రులు నీవు బాల్యంలో బాగా నృత్యం చేసేవాడివి కదా, గుర్తుందా, మర్చిపోయావా అని అడుగుతారు. ఏది నాలుగు అడుగులు వేసి అభినయించి చూపు అని అతన్ని బలవంత పెడతారు. తప్పించుకోను వీలుపడక, పెళ్ళి మంటపంలో ఒక వృత్తి గాయని పాడుతున్న విషాద గీతం జిందగీ తమాషాకు రాహత్ అభినయం చేసి చూపుతాడు. ఎవరో అతని అభినయాన్ని వీడియో తీసి ఇంటర్ నెట్‌లో పెట్టడంతో అది వైరల్ అవుతుంది. ఇతనికి ఇదేం పోయేకాలం, వృద్ధుడు నృత్యం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ పాకిస్థానీ సంకుచిత, మతతత్వ సమాజంలో కలకలం రేగింది.

నిషేధానికి గురయ్యి..

ఆరోజు నుంచి రాహత్ కష్టాలు ఆరంభం. వీధిలో ఎవరూ పలకరించరు. మొహల్లాలో పిల్లలు బూతు మాటలతో దూషిస్తారు. ఈద్ పండుగ రోజుల్లో కథ జరుగుతుంది. వీరి ఇంటిలో చేసిన తినుబండారాలు తీసుకోవడానికి ఇరుగు పొరుగు తిరస్కరిస్తారు. ఆఖరుకు కన్న కూతురు కూడా తండ్రిని అపార్ధం చేసుకుంటుంది. కరుడు కట్టిన మత సమాజంలో, మత తత్వ దేశంలో ఒక సాధారణ పౌరుడు కొన్ని పరిస్థితుల్లో మతాచరణకు విరుద్ధంగా నృత్యం చేయడం ఒక మహా ఘోరమైన తప్పిదమవుతుంది. రాహత్ మెజారిటీ మతానికి చెందినవాడయినా, ఆ సమాజంలో ఒక అల్పసంఖ్యాక వర్గంలోకి నెట్టబడతాడు. అతని పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకొన్న వ్యక్తి ఆ మొహల్లాలో నివసించే థర్డ్ జెండర్ వ్యక్తి ఒకరే. హాస్యం పొర వెనుక మనుషుల వేదన, బాధ దర్శకుడు చక్కగా చూపించారు.

ఈ సినిమా పాకిస్థాన్‌లో నిషేధానికి, అనేక ఇబ్బందులకు గురై, విడుదలకు నోచుకోలేదు. చివరకు దర్శకుడు యూట్యూబ్‌లో ఉచితంగా విడుదల చేయవలసి వచ్చింది. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డంకులు కల్పించిన పాకిస్థాన్ ప్రభుత్వం, ఆస్కార్ పురస్కారం పోటీకి ఈ సినిమా పేరును ప్రతిపాదించడంలో దాని ద్వంద్వ నీతి బయటపడింది. బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బహుమతి అందుకున్న తర్వాత 2020లో ఈ సినిమా యూట్యూబ్‌లో అందరికి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది, కానీ సినిమా దర్శకుడు ప్రేక్షకులను దయతో తనకు ఆర్థికంగా సహాయపడమని అర్థించవలసి వచ్చింది. కళాకారుడి దయనీయ పరిస్థితి ఇది. సినిమాకు హిందీ భాషలో సబ్ టైటిల్స్ ఉన్నాయి. టైటిల్ సాంగ్ తప్పకుండా వినండి.

సినిమా - జిందగీ తమాషా (Circus of Life)

దర్శకుడు - సర్మద్ ఖూసత్

సంగీతం - సాకిన్, షంషేర్ రాణా

లభ్యం - యూట్యూబ్

డా. కాళిదాసు పురుషోత్తం

90006 42079

Tags:    

Similar News