ఆ సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు
పారే నది... విచే గాలి.. ఊగే చెట్టు
ఉదయించే సూర్యుడు
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా
ప్రవహిస్తున్నది ఆ నెత్తురుతో సహా
ఏదీ ఆగిపోకుడదు....
పుట్టడం గొప్పకాదు. బతకడం గొప్ప
మంచి బతకడం గొప్పగాదు..
మంచిని పంచి బతకడం గొప్ప
నీకు నువ్వే గొప్ప అనుకోకు
నీగురించి నలుగురు..
గొప్పగా చెప్పుకుంటే గొప్ప..
కుదిరితే పరుగెత్తు...
లేకపోతే నడు
అది చేత కాకా పోతే పాకుతూ పో..
అంతే కానీ...
ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు..
ఏదీ తనంతట తాను నీ దరి చేరదు
ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే
విజయం నీ సొంతమవుతుంది.
చదివితే ఇవి పదాలు మాత్రమే.. ఆచరిస్తే అస్త్రాలుగా తెలుగు సాహిత్యంలో తన కలంతో కదం తొక్కి సిరా చుక్కలతో అగ్నిజ్వాలలు కురిపించిన మహాకవి శ్రీశ్రీ. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, ఈ శతాబ్దం నాది అని చెప్పుకున్న దమ్మున్న కవి శ్రీ శ్రీ.. అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా సాంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన ప్రజాకవి శ్రీ శ్రీ. ఈయన అసలుపేరు శ్రీరంగం శ్రీనివాసరావు. హేతువాది, నాస్తికుడు.
సాహితీ వ్యాసంగం
శ్రీ.శ్రీ రచనా వ్యాసంగాన్ని తన ఏడవ సంవత్సరం ప్రారంభించాడు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటి ప్రచురించాడు. 1933 -1940ల కల్లోల కాలంలో మహాప్రస్థానం. జగన్నాథుని రధ చక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేశారు. ఈ కాలాన్ని ఆ మహాకవి యుగంగా చెప్పవచ్చు. 1934 ఏప్రిల్ 12న మహాప్రస్థానం గొప్ప కవితా గొప్ప సంకలనం రచనను ప్రారంభించారు. 41 ఖండికలు గల మహాప్రస్థానం. 'ఆదిశంకరుల భజగోవిందం' నడక వంటిది. చతురస్రగతి చందో రీతిలో ఉంటుంది. మహాప్రస్ధానం తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా నేటికి జననీరాజనాలు అందుకుంటోంది. ప్రాసకు, శ్లేషకు శ్రీ శ్రీ పెట్టింది పేరు. శ్రీ శ్రీ మాటల్లో శబ్దలంకారాలు, చమత్కారాలు దొర్లుతుండేవి. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సూచిచండంలో శ్రీ శ్రీ మేటి. వ్యక్తికి -బహువచనం శక్తి అనేది అతను గుర్తించిన మహత్తర వాక్యం.
((నువ్వు పడుకున్న పరుపు
నిన్ను చీదరించుకొక ముందే
బద్ధకాన్ని వదిలేయ్....
నీ అబద్దం నిన్ను ప్రశ్నించక ముందే
సమాధానం వెతుక్కో...
గెలవక పోవడం ఓటుమి కాదు
మళ్ళీ ప్రయత్నించక పోవడమే..
నిజమైన ఓటమి
కన్నీరు చుక్క కారిస్తే కాదు..
చెమట ముక్క చిందిస్తే..
చరిత్ర రాయగలవని తెలుసుకో...
అంటూ తన రచనలతో యువతను చైతన్య పరుస్తునే తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ.))
సినీ రంగ ప్రవేశం -
1956లో సినిమా రంగప్రవేశం చేశారు. ఎన్నో సినిమాలకు ఆయన మాటలను.. పాటలను రాశారు. ఆయన సినీ జీవితం మొత్తం 1500 పైగా గీతాలు శ్రీశ్రీ కలం నుండి జాలువారాయి. తెలుగు మొదటి డబ్బింగ్ సినిమా 'ఆహుతి' మాటలు, పాటలను రాశారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు 1974లో శ్రీశ్రీ రాసిన తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశ మాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా.. అనేది తెలుగు సినీ పాటల్లో ఆణిముత్యమై వెలుగొంది. తొలిసారి తెలుగు సినిమా చరిత్రలో ఈ పాటకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. అంతేకాకుండా మనసున మనసై, హలో హలో అమ్మాయి.. నాహృదయంలో నిదురించే చెలి.. పాడవోయి భారతీయుడా, సాహితీ లోకంలో మంచి పేరు తెచ్చిపెట్టిన పాటలు.
((శ్రీ శ్రీ పురస్కారాలు
1972లో శ్రీ శ్రీ సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 1966లో ఖడ్గసృష్టికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, 1974లో ఉత్తమ గేయ రచయితగా అవార్డు. మొదటి రాజ్యాలక్ష్మి ఫౌండేషన్ అవార్డులను శ్రీశ్రీ అందుకున్నారు)
శ్రీ శ్రీ గురించి ప్రముఖుల పలుకులు-
మహాప్రస్థానం ఈ శతాబ్ది (20వ శతాబ్ది)లో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం --పురిపండా అప్పలస్వామి.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచపు బాధ.. ఆ ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ --చలం (మహాప్రస్థానం - యోగ్యతాపత్రంలో)
కవిత్వం ఒక ఆల్కెమీ దాని రహస్యం శ్రీ శ్రీకే తెలుసు (పెద్దన, కృష్ణశాస్త్రి)తోపాటు అన్నది --బాలగంగాధర్ తిలక్
అభ్యుదయ కవిత్వోద్యమ మూలవిరాట్టు --సి. నారాయణ రెడ్డి
తెలుగుభాష సాహిత్యంపై శ్రీశ్రీ
తెలుగే మన జాతీయ భాష కావాలనేది శ్రీశ్రీ అభిమతం. దేశంలో హిందీ భాషదే మొదటిస్థానం అయినా ఆ భాష మాట్లాడేవారు 40శాతం మించరు. హిందీ ఒక చిన్న చెట్టుకు పరిమితం. నా దృష్టిలో తెలుగుభాషా కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ అని అంటారాయన. శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షులుగా వ్యవహరించారు. విప్లవ రచయితల సంఘం (1970) వ్యవస్థాపకులు. క్యాన్సరు వ్యాధికి గురై 1983 జూన్ 13న శ్రీశ్రీ కన్నుమూశారు.
(మహాకవి, అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త శ్రీ శ్రీ జయంతి సందర్భంగా)
బి. సరిత, టిజిటి తెలుగు పండిట్
94942 03152