విపక్ష నేతల అరెస్టులతో.. బీజేపీ గెలుపు సాకారమవుతుందా?

దాదాపు రెండేళ్లుగా సాగుతున్న లిక్కర్ కుంభకోణ ప్రహసనంలో ఒక ఘట్టం ముగిసింది. మొన్ననే జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది.

Update: 2024-03-26 00:45 GMT

దాదాపు రెండేళ్లుగా సాగుతున్న లిక్కర్ కుంభకోణ ప్రహసనంలో ఒక ఘట్టం ముగిసింది. మొన్ననే జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను భూకుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ క్రమంలోనే రెండో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. ఆయన గతంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నాయకత్వాన ఢిల్లీలో జరిపిన నిరసనోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అలాంటి కేజ్రీవాల్ చివరికి అవినీతి కేసులోనే అరెస్ట్ కావడం, అది కూడా లిక్కర్ కేసులో ఇరుక్కోవడం శోచనీయం. ఈ విషయంలో అన్నా హజారే కూడా తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది నిజంగా కేజ్రీవాల్ స్వయంకృత అపరాధమా! లేక విధి వైపరీత్యమా!! లేక బీజేపీ కుట్ర రాజకీయమా భవిష్యత్తు విచారణలో తేలుతుంది.

కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. అప్పటినుండి అవకాశం కోసం కాచుకొని కూర్చున్న మోదీ ప్రభుత్వం, గత గురువారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆయనను అరెస్టు చేసే దాకా నిద్ర పోలేదు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తొమ్మిది సార్లు సమన్లను ఇచ్చినా ఆయన లక్ష్యపెట్టలేదు. చివరికి పదో సారి నేరుగా కేజ్రీవాల్ అధికార గృహంలో అరెస్ట్ వారెంట్‌తో సోదాలు నిర్వహించి, ఆయనను అరెస్టు చేసారు.

ఆదినుంచీ వివాదాల పుట్టే

ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకొని అన్నా హజారే నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పైకొచ్చిన కేజ్రీవాల్‌ని మొదటి నుండీ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా హజారే ప్రారంభించిన ఉద్యమ బాటను వీడి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని స్థాపించడం అన్నా హజారేతో పాటు, ఆయన ఉద్యమ సహచరులు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతి భూషణ్, ఆయన కుమారుడు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు మొదట ఆ విషయాన్ని జీర్ణించుకోలేదు. కొద్దికాలంలోనే కేజ్రీవాల్ 'ఉద్యమాన్ని స్వలాభానికి వాడుకున్నాడు' అంటూ ఆయన పై ఆరోపణలు చేసి, వారు వైదొలిగారు. వారి విమర్శలకు కేజ్రీవాల్ ఎదురు సమాధానం చెప్పలేదు. ఆయన సాదాసీదాగా స్థాపించిన 'ఆమ్ ఆద్మీ పార్టీ' దేశ రాజకీయాల్లో సంచలనాలను సృష్టించింది. దేశ రాజధాని డిల్లీలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి పెను సంచలనాలను సృష్టించింది.

రోజువారీ పాలనకూ అడ్డంకులే

అధికారంలోకి వచ్చాక ఆయనపై దాదాపు డజన్ సార్లు దుండగులు దాడి చేశారు. ఇంకుతో, కోడిగుడ్లతో, కర్రలతో, రాడ్లతో, చివరకు కళ్ళలో కారం చల్లటం ద్వారా దాడులు చేశారు. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాటి యూపిఏ ప్రభుత్వంతో కూడా ఇబ్బందులు పడ్డాడు. చివరకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తరచూ ఏదో ఒక అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. డిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వచ్చిన వారు కేజ్రీవాల్ మంత్రివర్గం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఏదో వంకతో నిలుపుదల చేశారు. అప్రజాస్వామికంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా లెఫ్టినెంట్ గవర్నర్లు అనేక అర్ధంలేని కొర్రీలు వేయడం, ప్రభుత్వాన్ని ముందుకు సాగనివ్వకపోవటం చేశారు. కేజ్రీవాల్ కొన్నిసార్లు న్యాయస్థానాలలో కేసులు వేసి చివరికి విజయం సాధించి, పరిపాలన చేయడం రివాజ్ అయిపోయింది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించింది.

జాతీయపార్టీగా ఎదిగి..

నిజానికి కేజ్రీవాల్ పరిపాలనా ప్రాంతం చాలా చిన్నది. ఆయన ప్రభావం కేవలం ఢిల్లీకే పరిమితం. కాకపోతే అది దేశ రాజధాని. అయితే తన పాలనా ప్రతిభతో కేజ్రీవాల్ పంజాబ్‌లో సైతం 'ఆప్' పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 12.92 శాతం ఓట్లతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించి బీజేపీకే సవాల్ విసిరారు. గోవాలో సైతం ఆప్ గణనీయ ఫలితాలను అందుకొంది. అనతి కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ చూస్తుండగానే జాతీయ పార్టీగా అవతరించింది. ఒకవైపు కాంగ్రెస్‌కు, మరొకవైపు బీజేపీకి ధీటుగా ప్రత్యామ్నాయ పార్టీగా ఆప్ ఎదిగింది. అయినా దేశ రాజకీయాలలో దాని పాలన సరిగ్గా సాగకండా బీజేపీ ఏదోరకమైన ఆటంకాలు సృష్టిస్తూనే వచ్చింది.

ఆప్ అంటే రెండు పార్టీలకూ వెరపే!

చిత్రమేమిటంటే అటు కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ బలపడితే తమ పార్టీకే ముప్పు ఏర్పడుతుందని భావించింది. కేజ్రీవాల్‌పై లిక్కర్ కేసు నమోదు కాగానే ఆయనను తగినంత దూరంలో ఉంచింది. ఇండియా కూటమిలో కెజ్రీవాల్‌కు తగినంత ప్రముఖ స్థానం ఇవ్వలేదు. అలాగే, ప్రస్తుతం ఎన్నికల తరుణంలో దేశవ్యాప్తంగా కూడా విపక్ష పార్టీలు పెద్ద బలంగా లేవు. 'ఆప్' కు మద్దతు ఇవ్వటానికి. కనుక తమ నేత కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టులపై ఆప్ ఒంటరి పోరాటమే చేయాల్సి ఉంటుంది. దేశమంతటా ఎన్నికల వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్ పార్టీకీ, ఇండియా కూటమికి కూడా పెద్దదెబ్బే. ప్రధానంగా డిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, గోవా, చండీగడ్, రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా కీలకమైనవి. ఇప్పుడు ఆయన అక్కడ ప్రచారం నిర్వహించలేని పరిస్థితి. ఆయన విజయావకాశాలను దెబ్బతీయటం కోసం బీజేపీ ఇంతకాలం సైలెంట్‌గా ఉంది. ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ను అదును చూసి అరెస్టు చేసి కుట్ర చేసిందని సామాన్య ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భావిస్తున్నారు.

రాజ్యాంగస్ఫూర్తిని విరిచేశారు

ఒక ఆకర్షణీయమైన వక్త కేజ్రీవాల్. ఆయన ప్రచారం చేయకపోతే ఆప్‌తో పాటు 'ఇండియా' కూటమికి పెద్ద లోటు ఏర్పడుతుంది. విపక్షాల విజయావకాశాలు దెబ్బతినటమే బీజేపీకి కావాల్సింది. దర్యాప్తు సంస్థలను ఎంతగా భ్రష్టుపట్టించాలో అంతగా బీజేపీ చేసి చరిత్రలో రికార్డు నెలకొల్పింది. రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని, వ్యక్తిత్వ వెన్నెముకను బీజేపి విరిచేసింది. ప్రపంచ మీడియా బీజేపీ నేలబారు రాజకీయాలను విమర్శలు చేస్తున్నా అది లక్ష్యపెట్టడం లేదు. ఏదిఏమైనా బీజేపీ అనుసరించే ఈ అప్రజాస్వామిక విధానాలను బుద్ధిచెప్పగల సత్తా ప్రజలకే ఉంది.

డాక్టర్.. కోలాహలం రామ్ కిశోర్

98493 28496


Similar News