వేముల రోహిత్‌కి.. శంభూకుడికి దక్కిన న్యాయమే దక్కుతుందా?

Will Vemula Rohit get the same justice as Sambhuku?

Update: 2024-05-08 01:00 GMT

ఎనిమిదేళ్ల క్రితం యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఆత్మహత్యకు ఒడిగట్టిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌ కేసులో తెలంగాణ హైకోర్టుకు పోలీసులు సమర్పించిన క్లోజర్ రిపోర్ట్ సంచలనాలకు కేంద్రమైంది. ఉన్నత విద్యాలయాల్లో తిష్టవేసిన అమానుష కులవివక్ష కారణంగా ప్రాణాలొదిలిన రోహిత్‌ చావుకు కారకులయిన మనువాదులను శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగగా.. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారని, రోహిత్ అసలు దళితుడే కాడనీ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

చెట్టంత కొడుకుని కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో మునిగిన రోహిత్‌ తల్లి వేముల రాధిక..''నా బిడ్డ చావుకి కారకులైన వారెవరో తేల్చండి.. నాలాగా మరో తల్లికి గర్భశోకం రాకుండా చూడండి..'' అంటూ ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి వేడుకున్నది. ఇప్పుడు పోలీసులిచ్చిన రిపోర్ట్‌తో ఈ ఎనిమిదేళ్ల కాలమంతా ఆ తల్లి పడిన వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. మీరు అసలు దళితులే కాదు, మీది దొంగ సర్టిఫికేట్ అంటూ తీర్పునిచ్చిన పోలీసులు.. రోహిత్ వేముల శవపేటికపై మరో మేకును దించారు.

దళితులు జాతి వ్యతిరేక శక్తులా?

డిగ్రీ వరకు గుంటూరులో చదివిన వేముల రోహిత్‌... చిన్ననాటి నుండే దుర్భర దారిద్య్రాన్ని, నిర్దాక్షిణ్యపు కుల వివక్షను ఎదర్కొన్నాడు. చదువు కొనసాగిస్తూనే... కుటుంబ పోషణకోసం అడ్డాకూలీగా, కాటరింగ్‌ బారుగా పనిచేసాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసి, అక్కడే పీహెచ్‌డీలో జాయినయ్యాడు. దళిత చైతన్యంతో కులవివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ... ముందు ఎస్‌ఎఫ్‌ఐ, తర్వాత ఏఎస్‌ఏ విద్యార్థి సంఘాల్లో చురుకైన కార్యకర్తగా పనిచేసాడు. కుల దురహంకారంతో విర్రవీగే మనువాద విద్యార్థి సంఘాల దురాగతాలను వేముల రోహిత్‌ ఎంతో ధైర్యంతో ఎదుర్కొనేవాడు. ''ముజఫర్‌ నగర్‌ బాకీహై'' డాక్యుమెంటరీ ప్రదర్శనపై ఢిల్లీలో మతోన్మాద గుండాలు దాడిచేయడాన్ని నిరసిస్తూ.. 2015 జూలైలో వర్సిటీ కాంపస్‌లో వేముల రోహిత్‌, ఇతర విద్యార్థులూ కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ ప్రదర్శనపై వర్సిటీలోని ఏబీవీపీ సంఘ నాయకులు.. వేముల రోహిత్‌, అతని సహచరుల గురించి ఫిర్యాదుచేస్తూ కేంద్ర మంత్రివర్గంలో తమ వాడైన బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. సదరు లేఖను యధాతథంగా కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీకి పంపిస్తూ... హెచ్‌సీయూలో కులతత్వాన్ని రెచ్చగొడుతున్న ''జాతివ్యతిరేక శక్తులపై'' చర్య తీసుకోవాలని దత్తాత్రేయ సిఫార్సు చేసాడు. దత్తాత్రేయ సిఫార్సు గురించి స్మృతి ఇరానీ నుండి ఆదేశాలు అందుకున్న వీసీ పొదిలె అప్పారావు తక్షణం వాటిని అమలు పరుస్తూ... వేముల రోహిత్‌తో పాటు మొత్తం అయిదుగురు ఏఎస్‌ఏ సభ్యులను యూనివర్సిటీ హాస్టల్‌ నుండి బహిష్కరించాడు. ఈ క్రమంలోనే.. 14 రోజుల నిరసన తర్వాత... ఎవ్వరిలోనూ ఎలాంటి కదలికా లేకపోయేసరికి... తన చావునే అంతిమ నిరసనగా మలచుకోవాలని నిర్ణయించుకున్న రోహిత్‌... 2016 జనవరి 17న తన దోస్త్ రూమ్ లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ప్రభుత్వాలన్నీ మనువాదుల తొత్తులే

సహచర విద్యార్థులు, రోహిత్‌ తల్లి వేముల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. నాడు అధికారం వెలగబెట్టిన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు సైతం కేంద్రప్రభుత్వంతో పాటు మనువాదులకు తొత్తులుగా మారాయి. రోహిత్‌ దళితుడనే కారణంగానే.. నానా విధాల కుల వివక్షకు గురిచేసి, హింసించి చివరకు ఆత్మహత్యకు పూనుకునేలా చేసిన మనువాదులను రక్షించడానికి.. రోహిత్‌ అసలు దళితుడే కాదంటూ సాక్ష్యాలను పుట్టించడానికి ప్రయత్నించారు. రోహిత్‌ ఐదేండ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడే రోహిత్‌ తల్లిని పిల్లలతో సహా ఇంట్లో నుండి గెంటేసిన దయలేని తండ్రి మణికుమార్‌ ఇచ్చిన అఫిడవిట్‌ ఆధారంగా రోహిత్‌ కులం వడ్డెర అని గుంటూరు జిల్లా స్క్రూటినీ కమిటీ నిర్ధారించింది. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారైనప్పుడు, దళితురాలైన తల్లి కుటుంబ వాతావరణంలో పిల్లల పెంపకం జరిగితే.. సదరు పిల్లలకు తండ్రి కులంతో సంబంధం లేకుండా తల్లి కులమే వర్తిస్తుందంటూ.. 2012లో ''రమేష్‌ భాయి దబాయినాయక్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌'' కేసులో సుప్రీంకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పును సైతం బేఖాతరు చేసిన అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించింది.

రోహిత్‌కి ఎక్కడా దక్కని న్యాయం

ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రోహిత్‌ ఆత్మహత్యకు ఒడిగట్టింది తెలంగాణ గడ్డపై కాబట్టి.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులెవరో తేల్చాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. నాటి కేసీఆర్‌ ప్రభుత్వం రోహిత్‌ కేసులో దోషులను రక్షించడానికే యధాశక్తి ప్రయత్నించింది. వర్సిటీలో అశాంతికి కారకుడైన వీసీ అప్పారావును తొలగించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తానంటూ అసెంబ్లీ వేదికగా హామీనిచ్చిన కేసీఆర్‌ ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేసారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌ తన 31వ సమావేశంలో రోహిత్‌కు న్యాయం దక్కేలా చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. రోహిత్‌ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతీ యువకులను తట్టిలేపి.. అమానవీయ కుల వ్యవస్థను వదిలించుకునే దిశలో ఉద్యమించేట్టు చేసింది. దేశంలోని దళిత, బహుజన, వామపక్ష శ్రేణులు మనువాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాయి.

ఇక దేశమంతా వెలివాడే!

పోలీసులు హైకోర్టుకి సమర్పించిన క్లోజర్ రిపోర్టు సత్య దూరమంటూ.. తెలంగాణలోని విద్యార్థులందరూ నేడు తీవ్రంగా నిరసిస్తున్నారు. యూనివర్సిటీలో నెలకొన్న కుల వివక్ష కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎంతో మంది విద్యార్థులు సాక్ష్యం చెబుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ దేశంలో శంభూకునికి జరిగిన ధర్మమే.. ఏకలవ్యునికి దక్కిన న్యాయమే.. నేడు వేముల రోహిత్‌కూ దక్కింది. వేరే రకంగా జరిగే ఆస్కారమే లేదంటూ మన పాలకులు నిర్ద్వందంగా తేల్చిచెప్పేసారు. అంబేద్కర్‌ రాసింది కాదు, ఈ దేశంలో నేటికీ మనుస్మృతియే అమలులో ఉన్న రాజ్యాంగమంటూ తమ చర్యలతో తేల్చేసారు. నాడు.. వేముల రోహిత్, ఆయన సహచర దళిత విద్యార్థులూ.. యూనివర్సిటీలో నిరసనలకు దిగినప్పుడు.. తమ దీక్షాస్థలికి వారు పెట్టుకున్న పేరు వెలివాడ! నేడిక దేశమంతా వెలివాడయే!!

ఆర్‌. రాజేశమ్‌

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Tags:    

Similar News