స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుత బీజేపీకి దాని సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్ర పోరాటంలో పాత్ర లేకపోగా, బ్రిటీషు వారి అడుగులకు మడుగులొత్తారు. చరిత్రలో వారికి పాత్ర లేదనే విషయాన్ని నేటి తరాలకు తెలియవద్దనే ఉద్దేశ్యంతో నాటి స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర పోరాట చరిత్రపై బురదజల్లి, ద్వేషభావాన్ని నింపుతున్నారు. జీవితఖైదు నుండి బైటపడేందుకు ఆంగ్లేయులకు పదే పదే క్షమాభిక్ష కోరిన సావర్కర్‌ను వీరుడిగా మార్చేశారు. చివరకు చరిత్రను తుడిచిపెట్టేందుకు కుట్రపూరితంగా పాఠ్యాంశాలనే మార్చేస్తున్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా చేసుకుంటున్న ఉత్సవాలకు 'ఆజాదీ కా అమృత మహోత్సవం' అని ప్రధాని మోడీ ముద్దు పేరు పెట్టారు. మరో వైపు దీనినే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు అని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. పేరేదైనప్పటికీ 75 సంవత్సరాల సందర్భమనేది ఒక స్మరణీయమైన సమయమే. ఈ ఉత్సవాలను జరిపేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ప్రతి ఇంటి పైన త్రివర్థ పతాకం, ర్యాలీలు, సాంస్కృతిక ఉత్సవాలు వాడవాడల జరపాలని పాలకులు పిలుపు ఇవ్వడంతో విజయవంతంగానే కొనసాగుతాయి. నిధులుంటే విధులు నెరవేరుతాయి. ఆలోచనలను సమర్థించాల్సిందే.
అయితే, ఆనాడు స్వాతంత్ర్య సమరయోధులు ఆశించినది ఏమిటి? మహాత్మా గాంధీ కన్న కలలు సాకారమయ్యాయా? భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేశ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధుల త్యాగాలు ఫలితానిచ్చాయా? అని పునరావలోకనం చేసుకొని, భావి తరాలకు నాటి త్యాగాల భరిత చరిత్రను, ఆ స్ఫూర్తిని అందించాల్సిన సందర్భమిది. అంతే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లిఖించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలుకు ఎంత వరకు నోచుకుంటున్నాయి? ప్రజాస్వామ్యం నిర్వచనమైన 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్య ప్రభుత్వము' అనేది నినాదం వరకేనా? సోషలిస్టు దిశగా అడుగులు పడాలని ఆశించాం. ఆ ఆశలు అడియాసలేనా? అమలుకు సవాళ్లు ఎన్నో? ప్రాథమిక హక్కుల అమలు ఎక్కడ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 'దుడ్డు వున్న వాడిదే బర్రె' అనే సామెత లాగా అధికారం, డబ్బు ఉన్నవాడిదే పైచైయి అనే సామెత అక్షరాల అమలవుతున్నది.
ప్రపంచంలో మనమెక్కడ?
అధునాతన ప్రపంచంలో మనం ఎక్కడ? ఎంత శాతం అక్షరాస్యత ఉన్నది. విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ఎక్కడ? ఆఖరుకు ఎన్ని కోట్ల మంది అంధకారం (చీకటిలో) పూరి గుడిసెలలో ఉంటున్నారు? పాలకులకు ఆత్మవిమర్శ ఉన్నదా? ఇలాంటి సందర్భాలలో అణగారిన, అట్టడుగువర్గాలు, సామాజిక న్యాయం నోచుకోలేని ప్రజలకు ప్రభుత్వాలు అండనందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి కదా? ఇందుకు ప్రత్యేకమైన టైం బాండ్ కాల పరిమితిని విధించుకోవాలి.
ప్రజలందరూ తమ కాళ్లపైన తాము నిలబడగలిగిన రోజు వచ్చినప్పుడు ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు సిద్ధించినట్లు. మహాత్మా గాంధీ చెప్పినట్లు 'అర్ధరాత్రి ఆడపడుచు మెడలో బంగారం వేసుకొని గమ్యం చేరడానికి మలినం కాకుండా వెళ్లినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం' కానీ, ఈనాడు ఎన్ని మలినాలు జరుగుతున్నాయి? పాలకులే కళంకితులైతే ప్రజలను రక్షించేది ఎవరు? నైతిక విలువలు ఏమైనాయి?
పురోగమనమా? తిరోగమనమా?
నాడు ఒక పరిపూర్ణ ప్రజాస్వామ్యం, వ్యవసాయ, ఆర్థికరంగాలలో స్వాలంబన, సమానత్వం, ఉపాధి వంటి ఆకాంక్షలు ఉండేవి. అందులో చాలా వరకు మనం పురోగమించామనేది వాస్తవమే. ప్రాజెక్టులు కట్టుకున్నాం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించుకున్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థలను పటిష్టం చేసుకున్నాం, రిజర్వేషన్‌ల ద్వారా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి చేయూతనిస్తున్నాం, సమానత్వానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంతరిక్ష రంగంలో సైతం స్వావలంబన సాధించాం. సుమారు ఏడు దశాబ్దాలలో ఇంత ప్రగతి సాధించిన మనం, గడిచిన ఎనిమిదేళ్లలలో స్వాతంత్య్ర లక్ష్యాల నుండి పక్కకు జరిగి తిరోగమనంలోకి వెళ్తున్నామా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
విదేశాలలోని భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి, ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు పంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన నినాదాలకు రూపకర్త. మన్‌కీ బాత్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇండియా, ఫిట్ ఇండియా, సబ్కా సాత్, సబ్కా వికాస్, బేటీ పఢావో, బేటీ బచావో వంటి నినాదాలతో ప్రజలను ఆకర్షితులను చేసుకున్నారు. అయితే, జరుగుతున్నదేమిటి? ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారు. చివరకు అన్నదాతలపై కూడా ఉగ్రవాదులనే ముద్ర వేశారు. ప్రజాతీర్పును పరిహాసం చేశారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలోనే మహారాష్ట్రలో అడ్డదారిలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇందుకు పరాకాష్ట.
చెప్పేదొకటి, చేసేదొకటి
ఇదే సంవత్సరంలో ఉచితాలు అనుచితమంటూ ప్రధాని చేస్తున్న ప్రకటనలకు అర్థమేమిటి? పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా దక్కనివ్వరా? వారి నోటికాడ బుక్కను లాక్కుంటారా? ఒకవైపు తమ వంధి మాగధులైన కార్పొరేట్ శక్తులకు మాత్రం ఎన్‌పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు మాఫీ చేస్తారు. మరో వైపు సంపద సృష్టిలో భాగస్వాములైన ప్రజలకు అందులో వాటా ఇస్తే మాత్రం తప్పుబడతారా? రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు, వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌లు, దళితులు, గిరిజనులకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేయాలనేది ప్రధాని ఆకాంక్షనా? ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏడాదిలోనే దశాబ్దాల పోరాటాలతో శ్రామికుల హక్కులను దూరం చేశారు.
కార్మిక చట్టాలను, సంక్షేమాన్ని నిర్దద్వంద్వంగా ఎత్తివేసి, కార్పొరేట్‌లకు అనుకూలంగా, శ్రామికులు సంఘటితం అయ్యేందుకు వీలు కాకుండా నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చారు. 70 ఏళ్లలో ఏమీ జరగలేదని, మొత్తం తామే చేస్తున్నామని చెప్పుకునే ప్రధాని మోడీ హయాంలో ఒక ఘనతను మాత్రం సృష్టించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో చేసిన అప్పులు రూ.55 లక్షల కోట్లు ఉంటే, ఈ ఎనిమిదేళ్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశ రుణాన్ని బీజేపీ ప్రభుత్వం రూ. 155 లక్షల కోట్లకు తీసుకెళ్లనుంది. అంటే తొమ్మిదేళ్లలో సుమారు రూ. 100 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు లెక్క! ఇన్ని అప్పులు చేసినా, ప్రజల దృష్టి మళ్ళించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో దేశంలో శ్రీలంక సంక్షోభాన్ని తీసుకువస్తున్నారని ప్రచారం చేయడం విడ్డూరమే.
ప్రమాదకర విభజనవాదం
దేశ ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఈ అమృత మహోత్సవంలోనే కార్పొరేట్ మితృలకు కానుకగా ఇస్తున్నారు. దొడ్డి దారిలో రిజర్వేషన్‌లను అటకెక్కించేందుకు దీనిని మరో మార్గంగా కూడా ఎంచుకున్నారు బీజేపీ పాలకులు. 2007-08 లో అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి ప్రభుత్వ రంగ వ్యవస్థే కారణమని ఆర్థిక నిపుణులు చెప్పిన విషయాలను మరిచిపోదామా? భిన్న సంస్కృతులకు, మతాలు, భాషలకు ఆలవాలమైన భారతదేశాన్ని పూలమాలలో దారం లాగా ఐక్యత, సమగ్రత ఉంచేందుకు రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన సమాఖ్య వ్యవస్థే పునాదిగా ఉన్నది. అలాంటి ఫెడరల్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేసే ప్రక్రియను శరవేగం చేసింది.
ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను అంటూ చివరకు ఒకే పార్టీ అని అమృత్ మహోత్సవ ఏడాదిలోనే బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేయడం ఆ పార్టీ దురహంకార, నియంతృత్వ పోకడకు నిదర్శనంగా మారింది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా తినే ఆహారం, దుస్తులు, వేషధారణ పేరుతో దాడులు చేస్తూ, మతం పేరుతో దేశంలో ప్రమాదకర విభజనవాదాన్ని తీసుకురావడం పురోగమనమేనా? నాడు దేశభక్తిని పెంపొందించే సినిమాలు తీస్తే, నేడు దేశ పౌరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలను పాలకులే ప్రోత్సహించడం దారుణం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ పదవికి పోటీ పడేంత వరకు వారి స్వంత గ్రామంలో విద్యుత్ లేకపోయిన దుస్థితిలో ఉండడం బాధాకరం.
చరిత్రకు వక్రభాష్యాలు
స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుత బీజేపీకి దాని సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్ర పోరాటంలో పాత్ర లేకపోగా, బ్రిటీషు వారి అడుగులకు మడుగులొత్తారు. చరిత్రలో వారికి పాత్ర లేదనే విషయాన్ని నేటి తరాలకు తెలియవద్దనే ఉద్దేశ్యంతో నాటి స్వాతంత్య్ర సమరయోధులు, స్వాతంత్య్ర పోరాట చరిత్రపై బురదజల్లి, ద్వేషభావాన్ని నింపుతున్నారు. జీవితఖైదు నుండి బైటపడేందుకు ఆంగ్లేయులకు పదే పదే క్షమాభిక్ష కోరిన సావర్కర్‌ను వీరుడిగా మార్చేశారు. చివరకు చరిత్రను తుడిచిపెట్టేందుకు కుట్రపూరితంగా పాఠ్యాంశాలనే మార్చేస్తున్నారు. ఆనాటి పోరాట ఘట్టాలను ప్రతిబింబించే విధంగా ఈనాటి తరానికి తెలియపరిచే ప్రక్రియ నిజాయితీగా జరగాలి. కానీ, బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్నదేమిటి? జాతిపిత మహాత్మా గాంధీని ప్రధాని పొగుడుతారు.. ఆయన పార్టీకే చెందిన వారు గాంధీని చంపిన వారిని కీర్తిస్తారు. గుడులు కడతారు.
స్వాతంత్ర పోరాటంలో మీరట్, కాన్పూర్, పెషావర్ కుట్ర కేసులలో కమ్యూనిస్టులు సంవత్సరాల తరబడి జైలులో ఉన్న వాళ్లను, అనేకమంది అజ్ఞాత వీరులను స్మరించుకోవాల్సిన అవసరం లేదా? ఉత్సవాల కొరకు ఉత్సవాలు కాదు? అసలు భవిష్యత్తులో చేయాల్సిందేమిటిదనేది ప్రధాన ఎజెండాగా ఉండాలి. గతాన్ని నెమరు వేసుకొని, భవిష్యత్తుకు బాటలు ఏమిటి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఇప్పటివరకు అందిన స్వతంత్ర ఫలాలు యుద్ధ ప్రాతిపదికను అందించే చర్యలకు ఉపక్రమిస్తామని అంతరాలు లేని సామాజిక లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈనాడు భారతదేశంలో ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్న అంతరాలకు నిలయమై, కుళ్లిపోతున్న సంక్లిష్ట పరిస్థితి. దీనిని చేదించాలంటే సంక్షేమం పేదలకు అమలు కావాలి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలి. స్వావలంబన వైపు అడుగులు పడాలి. కార్పొరేటీకరణ స్థానంలో ప్రభుత్వ రంగం బలోపేతం చేయబడాలి. సకల జనుల సుఖానికి విలువలతో కూడిన వ్యవస్థ నిర్మాణానికి నాంది పలకాలి. అప్పుడే స్వాతంత్య్ర స్వేచ్ఛా ఫలాలు అందరికీ అందుతాయి. ఇంటింటికి జెండా లాగే సంపద అందరి పరం కావాలి, అందరికీ చెందాలి. అదే నిజమైన స్వాతంత్ర్య భారతంగా గుర్తించబడుతుంది.
చాడ వెంకటరెడ్డి
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి